‘పైగా’ భూములపై.. అవి తప్పుడు తీర్పు నివేదికలే.. | Sakshi
Sakshi News home page

‘పైగా’ భూములపై.. అవి తప్పుడు తీర్పు నివేదికలే..

Published Sun, Oct 1 2023 2:24 AM

Judicial Registrar who submitted the report to the High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘పైగా’భూములకు సంబంధించి 1998లో ఇచ్చిన తీర్పు కాపీని సీల్డ్‌ కవర్‌లో హైకోర్టుకు రిజిస్ట్రార్ సమర్పించారు. సెపె్టంబర్‌ 15న విచారణ సందర్భంగా ఆదేశాలు జారీ చేయడంతో ఈ మేరకు నివేదిక అందజేశారు. పిటిషనర్‌ పేర్కొన్నట్లు ‘పైగా’భూములపై 1998లో హైకోర్టు ఏ తీర్పునూ ఇవ్వలేదని, అసలు పిటిషనర్‌ పేర్కొన్న పిటిషన్‌లే నమోదు కాలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీంతో తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పిటిషనర్‌ను ఆదేశిస్తూ, స్టేటస్‌ కో ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. అక్టోబర్‌ 13కు విచారణను వాయిదా వేసింది. 

50ఎకరాల భూములపై వివాదం 
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ గ్రామంలోని దాదాపు 50 ఎకరాల భూమిని తన పూర్వికులు పైగా(సైన్యం నిర్వహణకు పరిహారంగా నిజాం నవాబ్‌ మంజూరు చేసిన భూమి) యజమానుల నుంచి కొనుగోలు చేశారని, అన్ని డాక్యుమెంట్లు ఉన్నా హెచ్‌ఎండీఏ అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని ఇబ్బందులు కల్పిస్తున్నారని పేర్కొంటూ హైదరాబాద్‌ వట్టేపల్లికి చెందిన యహియా ఖురేషి హైకోర్టులో రెండు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కేజీ రాఘువన్, ప్రభుత్వం తరఫున బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. బోగస్‌ డాక్యుమెంట్లు, రశీదులు సృష్టించి కోర్టును తప్పదారి పట్టించి అత్యంత విలువైన ప్రాంతంలో దాదాపు 50 ఎకరాలకుపైగా భూమిని స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారని ఏజీ గతంలో వాదనలు వినిపించారు. 2007, 2012లో జారీ చేసి న రసీదులు పూర్తిగా నకిలీవని.. తప్పుడు రసీదులను, కోర్టు తీర్పు ఉత్తర్వుల డాక్యుమెంట్లను ఆయ న ఈ సందర్భంగా ధర్మాసనం ముందు ఉంచారు. 

2007నాటికి తెలంగాణ రాష్ట్రం ఎక్కడుంది? 
2007 నాటికి తెలంగాణ రాష్ట్రమే లేదని, రసీదుల్లో మాత్రం అలా పేర్కొన్నారని, అలాగే శంషాబాద్‌ గ్రామం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండగా, హైదరాబాద్‌ అని మరో రసీదులో ఉందన్నారు. దీనిపై పూర్తిగా విచారణ జరిపి సీల్డ్‌ కవర్‌లో నివేదిక అందజేయాలని జుడీషియల్‌ రిజిస్ట్రార్‌ను హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం ఈ మేరకు నివేదిక అందజేసింది. అనంతరం ధర్మాసనం.. ఈ నివేదిక కాపీలను అక్టోబర్‌ 3లోగా పిటిషనర్‌కు, ప్రభుత్వానికి కూడా అందజేయాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది.

 
Advertisement
 
Advertisement