వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని.. | Insurance Money Motive Behind Husband Life Ends By Wife | Sakshi
Sakshi News home page

వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని..

Jun 11 2026 11:18 AM | Updated on Jun 11 2026 12:29 PM

Insurance Money Motive Behind Husband Life Ends By Wife

కామారెడ్డి (ఎల్లారెడ్డి): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేసిన కేసులో భార్య, ప్రియుడిని సదాశివనగర్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు బుధవారం సదాశివనగర్‌ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. మర్కల్‌ గ్రామానికి చెందిన కంచర్ల రాజయ్య గత నెల 22న రాత్రి వ్యవసాయ పొలానికి వెళ్తుండగా బైకు అదుపుతప్పి పడిపోయి మృతి చెందాడని భార్య కంచర్ల రేణుక సదాశివనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా ఎస్పీ రాజేశ్‌చంద్ర ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణ, సదాశివనగర్‌ సీఐ సంతోష్‌ కుమార్‌ నేతృత్వంలో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

పక్కా ప్రణాళిక ప్రకారం తలపై బలంగా కొట్టడంతోనే రాజయ్య మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మర్కల్‌ గ్రామానికి చెందిన కంచర్ల గంగశేఖర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. గంగశేఖర్‌కు నాలుగు సంవత్సరాలుగా రాజయ్య భార్య రేణుకతో వివాహేతర బంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త రాజయ్య అడ్డుగా ఉన్నాడని భావించడంతోపాటు చనిపోతే వచ్చే ఇన్సురెన్స్‌ డబ్బులను పొందవచ్చనే దురాశతో ఇద్దరు కలిసి రాజయ్యను హతమార్చాలని కుట్రపన్నారు. అందులో భాగంగా గత నెల 21న గంగశేఖర్‌ ముందస్తు ప్రణాళికతో రాజయ్యను గాంధారి ప్రాంతానికి పిలిపించాడు.

 మద్యం తాగించిన అనంతరం తిర్మన్‌పల్లి గ్రామ శివారులోని రామారెడ్డి ప్రధాన రహదారిపై రాత్రివేళ మత్తులో ఉన్న రాజయ్య తలపై గంగశేఖర్‌ ఐరన్‌ రాడ్‌తో బలంగా కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం  ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహం, ద్విచక్ర వాహనం అక్కడే పడేసి పరారయ్యాడు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. హత్యకు ఉపయోగించిన ఐరన్‌ రాడ్, ద్విచక్ర వాహనం, నిందితుల మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. కేసును ఛేదించిన సీఐ సంతోష్‌ కుమార్, ఎస్సైలు పుష్పరాజ్, సిద్ధిక్, పోలీస్‌ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement