● ప్రజల వద్దకే వేగవంతమైన న్యాయసేవలు
● రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి
తంగిరాల మాధవీదేవి
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): సమాజంలో ప్రతి పౌరుడికి సమ న్యాయం చేయడం, ఉచితంగా న్యాయ సహాయం అందించడం న్యాయవ్యవస్థ లక్ష్యమని హైకోర్టు న్యాయమూర్తి, నిజామాబాద్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ తంగిరాల మాధవీదేవి అన్నారు. భీమ్‌గల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి–కమ్–జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టును జస్టిస్ మాధవీదేవి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో న్యాయమూర్తి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు న్యాయసేవలను మరింత చేరువ చేయడమే కోర్టు ఏర్పాటు ప్రధాన ఉద్ధేశమన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 ఏ ప్రకారం ప్రతి పౌరుడికి సమాన న్యాయం, ఉచిత న్యాయ సహాయం అందించడం న్యాయవ్యవస్థ బాధ్యత అని అన్నారు. ఒక కోర్టు గొప్పతనం దాని భవనం పరిమాణంపై కాకుండా, అక్కడ లభించే న్యాయం యొక్క నాణ్యతపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. న్యాయమూర్తులు సహనం, నిష్పక్షపాతం, నిజాయితీ, పారదర్శకతతో వ్యవహరించాలని సూచించారు. న్యాయవ్యవస్థలో బెంచ్, బార్ రెండు సమాన భాగస్వాములని, సంస్థ ప్రగతికి న్యాయవాదుల సహకారం ఎల్లప్పుడూ అవసరమని ఆకాంక్షించారు. జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్‌టీ) నిధులతో మండల మహిళా సమాఖ్య భవనాన్ని తక్కువ సమయంలో కోర్టు భవనంగా తీర్చిదిద్దిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.
1600 కేసుల బదిలీ
ఆర్మూర్, నిజామాబాద్ కోర్టుల నుంచి భీమ్‌గల్ కోర్టుకు సుమారు 1,600 కేసులు (300 సివిల్, 1,300 క్రిమినల్) బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. కేసుల బదిలీతో పాత కోర్టులపై భారం తగ్గడంతోపాటు విచారణ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
సత్వర న్యాయ పరిష్కారం
భీమ్‌గల్ కోర్టు ప్రారంభంతో ఐదు మండలాల ప్రజలు స్థానికంగానే సివిల్, క్రిమినల్ కేసులకు సంబంధించిన సత్వర న్యాయ పరిష్కారం లభించనుందని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. కేసుల విచారణ వేగవంతం కావడంతోపాటు న్యాయ ప్రక్రియలో జాప్యం తగ్గే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ కోర్టు ఏర్పాటు కీలక మైలురాయిగా నిలవనుందని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు.
తొలి జూనియర్ సివిల్ జడ్జి భవ్యశ్రీ
భీమ్‌గల్ కోర్టు తొలి జూనియర్ సివిల్ జడ్జిగా భవ్యశ్రీని నియమిస్తున్నట్లు జస్టిస్ ప్రకటించారు. కోర్టు భవ్యంగా వెలుగొందాలని ఆకాంక్షించారు. ఆదివారం నుంచే కోర్టు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిందని వెల్లడించారు. భవ్యశ్రీ న్యాయమూర్తి స్థానంలో కూర్చోని జ్యుడీషియల్ పరిధిలోని ఆరు కేసులకు కాల్ వర్క్ నిర్వహించారు.
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మీ నా రాయణ అలిశెట్టి, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వి.ఎన్. భారత లక్ష్మి, ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కే. ప్రవీణ్ చందర్, న్యాయవాదులు జి. చైతన్య, సూర సురేష్, బార్ అసోసియే షన్ ప్రతినిధులు, జిల్లా న్యాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


