
రాజీనామాకు సిద్ధమైన మాజీ సైనికోద్యోగులైన మార్షల్స్
ప్రధాన కార్యాలయంలో వారితో చర్చలు జరిపిన కమిషనర్
జీతాలు ఏమాత్రం తగ్గవనే హామీతో వెనక్కు తగ్గిన వైనం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆ«దీనంలోని మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌కు (ఎంఈటీ) నేతృత్వం వహిస్తున్న మార్షల్స్ సోమవారం మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు తగ్గిస్తూ ఇటీవల ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తెలిసి రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అప్రమత్తం అయ్యారు. బుద్ధభవన్‌లోని ప్రధాన కార్యాలయంలో మార్షల్స్‌తో భేటీ కావడంతో వివాదం సద్దుమణిగింది. తమ జీతాలు పెంచుతామంటూ హైడ్రా కమిషనర్ హామీ ఇచి్చనట్లు మార్షల్స్ ప్రకటించారు.
జీహెచ్‌ఎంసీ నుంచి హైడ్రాలోకి ఆ రెండూ...
హైడ్రా ఏర్పాటు ముందు వరకు ఎంఈటీలు, మార్షల్స్ జీహెచ్‌ఎంసీ ఆ«దీనంలో ఉండేవి. ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఈవీ అండ్ డీఎం) వి«భాగంలో అంతర్భాగంగా పని చేసే వాళ్లు. మాజీ సైనికోద్యోగులైన 93 మంది 2020 మే నుంచి మార్షల్స్‌గా పని చేస్తున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వీరికి అప్పట్లో నెలకు రూ.22,500 చొప్పున చెల్లించేవారు. 2022లో పీఆర్సీ ఆధారంగా ఈ మొత్తాన్ని రూ.29,250కి పెంచారు. గత ఏడాది ఈవీ అండ్ డీఎం జీహెచ్‌ఎంసీ నుంచి హైడ్రాలోకి వచి్చంది. దీంతో ఈ ఏడాది నుంచి ఎంఈటీలతో పాటు మార్షల్స్ బాధ్యతల్నీ హైడ్రాకు అప్పగించారు.
మార్షల్స్‌లో ఆందోళన నింపిన ఆ ఉత్తర్వులు...
తాము చేస్తున్న సేవల్ని పరిగణలోకి తీసుకుని జాతాలు పెంచాలంటూ మార్షల్స్ కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క మాజీ సైనికోద్యోగులకు సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ రీ సెటిల్‌మెంట్ సైతం వీరికి రూ.32 వేల నుంచి రూ.35 వేల వేతనాన్ని సిఫార్సు చేసింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇవి అమలవుతున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ జీతాల పెంపుపై గతంలో మార్షల్స్‌కు హామీ ఇచ్చారు. ఇది కార్యరూపంలోకి రాకముందే ఈ నెల 5న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వీరిలో ఆందోళన నింపాయి. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది జీతాలను రూ.22,750కు తగ్గిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ఉంది.
మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమై...
ఈ ఉత్తర్వులను నిరసనగా మార్షల్స్ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తొలుత సోమవారం సమ్మె సైరన్ మోగించాలని నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అప్రమత్తం అయ్యారు. వర్షాలు కురుస్తున్న ఈ సమయంలో 30 డివిజన్లలోని 150 ఎంఈటీలకు నేతృత్వం వహిస్తున్న మార్షల్స్ ఆవశ్యకతను ఆయన గుర్తించారు. దీంతో అందరినీ బుద్ధ భవన్‌లోని హైడ్రా ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. ఆ ఉత్తర్వులతో మీకు సంబంధం లేదని, జీతాలు ఏమాత్రం తగ్గవని హామీ ఇచ్చారు. మార్షల్స్ జీతాల పెంపుపై త్వరలోనే మరో జీవో వస్తుందని హామీ ఇచ్చారు. పని గంటల అమలు, అదనపు పనికి అదనపు వేతనం తదతర డిమాండ్లనూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని రంగనాథ్ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.