హైదరాబాద్ : అమెరికా ఫ్లొరిడాలోని అపార్ట్‌మెంటులో జరిగిన అగ్ని ప్రమాదంలో హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటకు చెందిన విద్యార్థి గాయపడ్డాడు. దీంతో అతని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేట తురాబ్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఆరీఫ్ పెద్ద కుమారుడు మహ్మద్ అమీర్ హుస్సేన్(23) ఎంఎస్ చదువుకోవడానికి ఏడాదిన్నర క్రితం అమెరికా ఫ్లొరిడా (Florida) వెళ్లాడు.
ఈ నెల 19 అతను నివసిస్తున్న అపార్ట్‌మెంటులో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అమీర్ హుస్సేన్ తన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతుండగా.. తన భవనం మంటల్లో చిక్కుకుందని అరవడం ప్రారంభించాడు. కొద్దిసేపటి తర్వాత అతడి ఫోన్ డిస్‌కనెక్ట్ అయింది. తమ కుమారుడికి ఏమైందో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వారికి కొంత సమయం తర్వాత అమీర్ హుస్సేన్ స్నేహితుడు కళ్యాణ్ ఫోన్ చేశాడు. హుస్సేన్‌ను మొదట తల్లాహస్సీ మెమోరియల్ హెల్త్ కేర్‌కు తరలించారని, తర్వాత గైనెస్‌విల్లేలోని యుఎఫ్ హెల్త్ షాండ్స్ హాస్పిటల్‌కు తరలించినట్లు తెలియజేశాడు.
చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కూమరుని కోసం అమెరికా (America) వెళ్లేందుకు సిద్దపడ్డారు. దీంతో స్థానిక కేంద్ర మంత్రి జీ.కిషన్‌రెడ్డిని సంప్రదించడంతో వెంటనే స్పందించి వీదేశి వ్యవహారాల మంత్రికి లేఖ రాసి సహాయం అందించి తాత్కలిక వీసా ఇవ్వాలని కోరారు. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.


