
ఆస్తులు, అప్పులు తేలితేనే అప్పగింత..
కేంద్రం అనుమతి తప్పనిసరి
బ్యాంకు రుణాల బదిలీ సహా అనేక అంశాలు పరిష్కారం కావాలి
ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఏడాదికి పైగా సమయం
మెట్రో మొదటిదశ ప్రాజెక్టు నుంచి ఎల్‌అండ్‌టీ వైదొలగనున్న నేపథ్యంలో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. అసలు ప్రభుత్వ అధీనంలోకి వెళ్తే నిర్వహణ ఎలా ఉంటుంది..? సౌకర్యాలు ఎలా ఉంటాయనే చర్చ మొదలైంది. అలాగే మెట్రో మొదటి దశ ప్రాజెక్టు ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వానికి బదిలీచేసే ప్రక్రియ కూడా అంత ఈజీ కాదు. వివిధ అంశాలపైన స్పష్టమైన అవగాహన, ఒప్పందం ఏర్పడిన తరువాత మాత్రమే ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వానికి బదిలీ కానుంది. ఇందుకోసం ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో వివిధ అంశాలపైన సమావేశాలు నిర్వహించి ఒప్పందాలు చేసుకోవలసి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
– సాక్షి, సిటీబ్యూరో
హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్మించి నిర్వహిస్తోన్న 69.2 కి.మీల మెట్రో మొదటిదశ ప్రాజెక్టు నుంచి ఎల్‌అండ్‌టీ వైదొలగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఎల్‌అండ్‌టీ సంస్థకు ఏకమొత్తంగా రూ.2000 కోట్లు చెల్లించి ప్రభుత్వం ప్రాజెక్టును స్వాదీనం చేసుకోనుంది. అలాగే రూ.13000 కోట్ల రుణాలను కూడా ప్రభుత్వమే భరించనుంది. ఈ ఆర్థిక అంశాలపైన ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకోవడంతోపాటు నిర్వహణపరమైన అంశాలపైన కూడా ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వానికి బదిలీ ఒప్పందాలు జరగాల్సివుంది. ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏడాది కంటే ఎక్కువ కాలమే పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
కేంద్రం అనుమతి తప్పనిసరి
పీపీపీ పద్ధతిలో చేపట్టిన మొదటి దశ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా ఒక భాగస్వామ్య సంస్థగానే ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి ఎల్‌అండ్‌టీ వైదొలగాలన్నా, ఆర్థిక లావాదేవాలపైన ఎలాంటి ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నాకేంద్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా అనుమతించవలసి ఉంటుంది. ఎల్‌అండ్‌టీకి, ప్రభుత్వానికి మధ్య కుదిరే ప్రతి ఒప్పందం వివరాలను కేంద్రానికి అందజేయాలి. అలాగే బ్యాంకు రుణాలను (Bank Loan) రాష్ట్రం భరించనున్న దృష్ట్యా అందుకు కూడా కేంద్రం నుంచి అనుమతి లభించవలసి ఉంటుంది. రెండోదశ నిర్మాణానికి కేంద్రం అనుమతి ఎలా ముఖ్యమో, మొదటి దశ బదిలీకి కూడా అంతే ముఖ్యం అని అధికారులు తెలిపారు.
కేంద్ర రాష్ట్రాలతో పాటు ఎల్‌అండ్‌టీ (L&T) సంయుక్త ప్రాజెక్టుగా 2011లో మెట్రో మొదటిదశ చేపట్టిన సంగతి తెలిసిందే. 2017 నవంబర్ నుంచి మొదటి దశ రైళ్లు అందుబాటులోకి వచ్చా యి. ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, ఎల్‌బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్‌ల మధ్య ప్రతి రోజు సుమారు 1000 ట్రిప్పులకు పైగా తిరుగుతున్నాయి. రోజుకు 4.8 లక్షల మందికి పైగా పయనిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఎల్‌అండ్‌టీ తన వాటాను రాష్ట్రానికి విక్రయించనున్న దృష్ట్యా నిర్వహణపరమైన సాంకేతిక అంశాలపై న కూడా ఒప్పందాలు తప్పనిసరి.
కియోలిస్‌కు ఇంకా గడువు ఉంది
ఫ్రాన్స్‌కు చెందిన కియోలిస్ (Keolis) సంస్థ హైదరాబాద్‌లో మెట్రో రైళ్లను నడుపుతోంది. సీబీటీసీ (కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్) సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రైళ్లు నడుస్తున్నాయి. కియోలిస్ సంస్థ హైదరాబాద్‌తో పాటు దుబాయ్, లండన్, పూణే నగరాల్లో కూడా మెట్రోలను నడుపుతోంది. నగరంలో ఈ సంస్థతో 2026 నవంబర్ వరకు ఒప్పందం ఉంది. ఈ మేరకు ఈ ఒప్పందాన్ని ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వానికి బదిలీ చేసుకొని పునరుద్ధరించవలసి ఉంది. ఒకవేళ కియోలిస్‌ను కాకుండా మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలనుకున్నా 2026 నవంబర్ వరకు ఆగాల్సిందే. కానీ హైదరాబాద్‌తో మెట్రో రైళ్ల నిర్వహణలో కియోలిస్‌కు ఉన్న అనుభవం దృష్ట్యా ప్రభుత్వం మరో సంస్థను సంప్రదించకపోవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు కియోలిస్‌తోనే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవలసి ఉంటుంది.
ఆస్తులు–అప్పలు తేలాల్సిందే..
మెట్రో రైళ్లను నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 270 ఎకరాల భూములను ఎల్‌అండ్‌టీకి లీజుకు ఇచ్చింది. ఈ స్థలాల్లో మాల్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొనేందుకు అనుమతినిచ్చారు. కానీ ఎల్‌అండ్‌టీకి ఇచ్చిన మొత్తం 18.5 లక్షల చదరపు అడుగుల్లో ఇప్పటి వరకు కేవలం 6.5 లక్షల చదరపు అడుగుల స్థలాలను మాత్రమే ఆ సంస్థ వినియోగించుకుంది. ఇందులో కొంత భూమిని సబ్‌లీజ్‌కు ఇచ్చారు. ప్రస్తుతం ఈ భూములన్నింటినీ ప్రభుత్వం తిరిగి తీసుకోవలసి ఉంది. ఇందుకోసం కొంతసమయం పట్టే అవకాశం ఉంది.
చదవండి: ప్రైవేటు వెంచర్‌కు ప్రభుత్వ భూమిలో రోడ్డు
అలాగే సబ్‌లీజుకు సంబంధించిన అంశాల్లో కూడా స్పష్టత రావలసి ఉంది. మరోవైపు రూ.13000 కోట్ల బ్యాంకు రుణాలు ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వానికి బదలాయించాలి. ఎస్‌బీఐ (SBI) నేతృత్వంలో 12 బ్యాంకులు ఈ రుణాలను అందజేశాయి. ప్రస్తుతం ఈ 12 బ్యాంకుల నుంచి రుణాలను ప్రభుత్వానికి బదిలీ అయ్యేందుకు కూడా కొంత గడువు అవసరం. ఇలా అనేక అంశాలతో ముడిపడి ఉన్న మెట్రో మొదటి దశ ప్రాజెక్టు యాజమాన్య బదిలీకి ఏడాది కంటే ఎక్కువ సమయమే పట్టవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.