మేడ్చల్‌– మల్కాజిగిరి జిల్లాలో యథేచ్ఛగా భూ దందా | land encroachment and illegal constructions in Medchal district | Sakshi
Sakshi News home page

ప్రైవేటు వెంచ‌ర్‌కు ప్ర‌భుత్వ భూమిలో రోడ్డు

Sep 29 2025 6:29 PM | Updated on Sep 29 2025 7:32 PM

land encroachment and illegal constructions in Medchal district

దుండిగల్‌ పురపాలికలో హెచ్‌ఎండీఏ అనుమతి కోసం యత్నాలు

కలెక్టర్‌కు స్థానికుల ఫిర్యాదు.. విచారణ చేపట్టిన మల్కాజిగిరి ఆర్డీఓ

కొర్రెముల్లో ప్రభుత్వ పార్కు స్థలం ఆక్రమించి వెంచర్‌ 

మేడ్చల్‌ జిల్లాలో పలు పురపాలికల్లో అదే తంతు

పట్టించుకోని తహసీల్దార్లు.. కలెక్టరేట్‌కు ఫిర్యాదుల వెల్లువ  

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: హైద‌రాబాద్‌ నగర శివారు మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో భూ దందా యథేచ్ఛగా సాగుతోంది. కంచె చేను మేసిన చందంగా ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులు, రాజకీయ పెద్దలే దళారులుగా మారి అందినకాడికి దోచుకుంటున్నారు.  చిన్న స్థలంలో పేదలు గుడిసె వేసుకుంటేనే నానా హంగామా చేసే అధికారులు.. ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో మాత్రం నిసిగ్గుగా వహిస్తున్నారు. బడాబాబులు, రాజకీయ నేతల అనుచరులు ఏకంగా ఎకరాల కొద్దీ భూములు ఆక్రమిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా అధికారి అడ్డుకుంటే నాయకులే వారిపై ఒత్తిడి తెస్తున్నారు. 

ఇదీ మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూముల పరిస్థితి. జిల్లాలో అధికారులు ప్రైవేట్‌ వ్యక్తుల కోసం ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టటం.. వారి వెంచర్ల కోసం ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు, చెరువు, కుంటల బఫర్‌ జోన్, శిఖం భూములను ఫణంగా పెడుతున్నారన్న ఆరోపణలు వెల్లుతున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు, లే అవుట్లపై అధికార యంత్రాంగ ఉదాసీనత భూ కబ్జాదారులకు వరంగా మారుతోంది.

దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు సమీపంలో బౌరంపేట రెవెన్యూలో సిల్వర్‌ ఓక్స్‌ స్కూల్‌ నుంచి ప్రైవేట్‌ పట్టా ,అసైన్డ్‌ భూములలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఆదేశాలను లెక్క చేయకుండా ప్రైవేటు వెంచర్‌ కోసం ప్రభుత్వ నిధులతో రోడ్డు వెడల్పు పనులు చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సదరు రోడ్డులో ప్రైవేట్‌ ,అసైన్డ్‌ భూములను కలిగి ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఇప్పించడంతో పాటు రోడ్డు పనులకు అయ్యే వ్యయాన్ని వెంచర్‌ నిర్వాహకులే భరించేలా  దళారులు  ఒప్పందం కుదిర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక రోడ్డు నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత బిల్లులను సంబంధిత అధికారులు డ్రా చేసుకునేలా మాస్టర్‌ ప్లాన్‌  కూడా రూపొందించినట్లు సమాచారం.  

బండ్ల బాట విస్తరణ.. 
బౌరంపేట సర్వే నంబరు 166లో ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు సిల్వర్‌ ఓక్స్‌ స్కూల్‌ నుంచి గతంలో బండ్ల బాట ఉండేది. ఈ రోడ్డు సిల్వర్‌ ఓక్స్‌ స్కూల్‌ నుంచి కుడి వైపు వెళ్లే దారిలో హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌లో (HMDA Master Plan) 100 ఫీట్ల రోడ్డు ప్రతిపాదన ఉంది. కానీ ఎడమ వైపు వ్యవసాయ పొలాలకు వెళ్లే బండ్ల బాటను మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్నట్లుగా చూపించి 40 ఫీట్ల రోడ్డు వేస్తున్నారు. దాదాపు అరకిలో మీటరు పైగా రోడ్డు పనుల కోసం  ఇరు వైపులా ఉన్న చెట్లను తొలగించారు.

నిర్మాణ సంస్థ కోసమేనా..
రోడ్డు వేస్తే మంచిదేనని కొందరు వాదిస్తుండగా.. దాని వెనుక ఓ పెద్ద మతలబు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రోడ్డులో కొంత భాగం పట్టా భూమి, మరి కొంత అసైన్డ్‌ భూమి ఉంది. ఈ రోడ్డు ద్వారానే  ఓ బడా నిర్మాణ సంస్థ రైతుల నుంచి సుమారు 50 ఎకరాలు కొనుగోలు చేసి వెంచర్‌ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం  సదరు నిర్మాణ సంస్థ హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు పొందటానికి  40 ఫీట్ల రోడ్డును చూపించాల్సి ఉండటంతో ప్రభుత్వ స్థలం నుంచి రోడ్డు వేసేలా సంబంధిత అధికారులతో బేరం కుదుర్చున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

కలెక్టర్‌కు ఫిర్యాదు.. 
దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలో ప్రైవేట్‌ వెంచర్‌ కోసం, పంట పొలాలు, ప్రభుత్వ భూముల నుంచి రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంపై విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల కలెక్టరేట్‌ ప్రజావాణిలో స్థానికులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన కలెక్టర్‌ మల్కాజిగిరి ఆర్గీఓను విచారణ చేపట్టాలని ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టిన ఆర్డీఓ సదరు స్థలం పరిశ్రమల స్థాపన కోసం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఐఐసీ)కు కేటాయించినట్లుగా పేర్కొంటూ జిల్లా అధికార యంత్రాంగానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది.  

పురపాలికల్లో ఆక్రమణలు ఇలా..
పోచారం మున్సిపాలిటీ పరిధిలోని  కొర్రెములలోని సర్వే నెం.739 నుంచి 749 వరకూ 147 ఎకరాల్లో 1985లో ఏకశిలానగర్‌ పేరుతో లే ఔట్‌ చేశారు. అందులోని 47 ఎకరాలను 2006లో వ్యవసాయ భూమిగా మార్చేసిన ఓ వ్యక్తి లే ఔట్‌ స్వరూపాన్నే మార్చారని ప్లాట్ల యజమానులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇదే లే ఔట్‌లో రెండు బడా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ప్రహరీలు నిర్మించి కొంతమేర కబ్జా చేశారని పేర్కొన్నారు. అన్నోజిగూడలోని సర్వే నెంబర్లు 9,10లోని పదెక రాల లే ఔట్‌లో ఎకరం విస్తీర్ణంలో ఉన్న పార్కును ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అన్నోజిగూడ సర్వే నెంబర్‌ 14లో రెండెకరాల ప్రభుత్వ భూమిని కొందరు  ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి విక్రయించగా, రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి వదలివేశారు.

దమ్మాయిగూడ మున్సిపాలిటీ, కీసరలోని సర్వేనంబర్‌ 131లో 105.26 ఎకరాల ఫారెస్టు భూమి ఉండగా, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 2 ఎకరాల స్థలంలో బండరాళ్లను పగులగొట్టి స్థలాన్ని చదును చేసి, భవన నిర్మాణ పనులు పారంభించారు. చీర్యాల గ్రామంలోని సర్వేనంబర్‌ 7,8లలో 12.5 గుంటల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించారు.  ఇదే రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్‌ 152/2లో ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని ప్లాట్లు చేసి విక్రయించారు.  

జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలోని  అల్వాల్‌ మండలం జొన్న బండలోని వజ్ర ఎన్‌ క్లేవ్లో 900 గజాల పార్కు స్థలం కబ్జాకు గురైందని, దీంతో 236 ప్లాట్లకు పార్కు లేకుండా అవుతోందని స్థానికులు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కాప్రా సర్కిల్‌ పరిధిలోని సర్వేనంబర్‌199/1 జమ్మిగడ్డలోని స్టేడియానికి చెందిన ప్రభుత్వ భూమిని ఆక్రమించి, ఫ్లాట్లు చేసి ఇళ్లు నిర్మించి, విక్రయిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement