హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా హైదరాబాద్ | Hyderabad as a Hub for Health Care Innovations Minister Sridhar Babu | Sakshi
Sakshi News home page

హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా హైదరాబాద్

Jun 13 2026 10:40 PM | Updated on Jun 13 2026 10:40 PM

Hyderabad as a Hub for Health Care Innovations Minister Sridhar Babu
  •  రాబోయే ముప్పును ముందే అంచనా వేసే స్థాయికి వైద్య రంగం
  • ఏఐ ఎప్పటికీ వైద్యుడికి ప్రత్యామ్నాయం కాదు
  • ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏఐ ఇన్ హెల్త్ కేర్’లో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్‌: హెల్త్ కేర్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలపాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా, ఆవిష్కర్తలను ప్రోత్సహించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘ఎకో సిస్టం’ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైటెక్ సిటీలోని యశోదా ఆసుపత్రిలో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఏఐ ఇన్ హెల్త్ కేర్’ను ఆయన శనివారం లాంఛనంగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ఏఐ ఏదో ఒక రంగానికి మాత్రమే పరిమితం కాలేదని, అన్నింటికి విస్తరించి మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ముఖ్యంగా కేవలం వ్యాధి నిర్ధారణ దశకే పరిమితం కాకుండా... రాబోయే ముప్పును ముందే అంచనా వేసే స్థాయికి వైద్య రంగాన్ని చేర్చిందన్నారు. అలాగే... ప్రతి రోగికి ప్రత్యేక వ్యక్తిగత వైద్య సంరక్షణను అందించే సాధనంగా మారిందన్నారు. ఏఐ ఎప్పటికీ వైద్యుడికి ప్రత్యామ్నాయం కాలేదని స్పష్టం చేశారు. సాంకేతికతకు మానవీయ విలువల్ని జోడించినప్పుడే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. ప్

రపంచవ్యాప్తంగా వృద్ధుల జనాభా పెరుగుతున్న తరుణంలో... క్యాన్సర్, గుండెజబ్బులు వంటి క్లిష్టమైన ఆరోగ్య సవాళ్లకు సరికొత్త పరిష్కారాలు, ఆవిష్కరణలు రావాల్సిన అవసరముందన్నారు. అందుకు... హైదరాబాద్ ను ఒక ల్యాంచ్ ప్యాడ్ తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. అకాడెమియా, ఇండస్ట్రీ మధ్య బలమైన అనుసంధానం ఏర్పడినప్పుడే ఏఐ హెల్త్ కేర్ ఆవిష్కరణలు సామాన్యుడికి అందుతాయన్నారు. భవిష్యత్తు సవాళ్లను ముందే ఎదుర్కొనేలా... కొత్త ఆలోచనల్ని ప్రోత్సహించే ఇన్నోవేషన్ ఆధారిత వ్యూహాలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. 

ఆవిష్కరణలు కేవలం ల్యాబ్‌లకే పరిమితం కాకుండా, సమాజంలో నిజమైన మార్పును తీసుకొచ్చేలా ఆవిష్కర్తలు, స్టార్టప్స్ కు మార్గనిర్దేశం చేస్తున్నామన్నారు. పరిశోధనలకు ఊతమిచ్చేలా దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత డేటా ఎక్స్ ఛేంజ్ ను ప్రారంభించామన్నారు. లైఫ్ సైన్సెస్ లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ‘వన్ బయో’ పేరిట ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామన్నారు. స్టార్టప్స్ కు అండగా నిలిచేందుకు ‘ఫండ్స్ ఆఫ్ ఫండ్స్’ను ఏర్పాటు చేశామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. హైదరాబాద్ వేదికగా గ్లోబల్ హెల్త్ టెక్ విప్లవంలో భాగస్వామ్యం కావాలని నిపుణులు, ఆవిష్కర్తలు, కంపెనీలు, స్టార్టప్స్ ను సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement