జూలై 24లోగా ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకుంటే ఓటు గల్లంతే
ఈ నెల 25 నుంచి ఇంటింటికీ బీఎల్‌ఓలు
జులై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల
జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్
హైదరాబాద్: ‘ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసే ఎన్యూమరేషన్ ఫారాలను జూలై 24లోగా సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌వోలు) సమర్పించాలి. లేకుంటే జూలై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటరు జాబితాలో ఓటర్ల పేర్లు ఉండవు’ అని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ స్పష్టం చేశారు.
జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ (ఎన్నికలు) కె.చంద్రకళతో కలిసి సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికీ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో బీఎల్‌వోలు ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారని, వాటిని నింపి తిరిగి సమర్పించడం తప్పనిసరి అన్నారు.
47 లక్షల మంది ఓటర్లకు ఫారాల పంపిణీ
జిల్లాలో 47,36,669 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుషులు 23,99,880 మంది, మహిళలు 23,36,448 మంది, ఇతరులు 341 మంది ఉన్నట్లు వెల్లడించారు. వీరందరికీ వారి వివరాలతో కూడిన ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఫారాలు అందుకున్న ఓటర్లు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా వాటిని నింపి సంబంధిత బీఎల్‌ఓలకు అందజేయాలని కర్ణన్ సూచించారు. చివరి నిమిషంలో రద్దీ, సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ఫారాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇంటికి వెళ్లిన సమయంలో ఇల్లు తాళం వేసి ఉంటే ఫారాలు అక్కడే ఉంచి బీఎల్‌వోలు కనీసం మూడు సార్లు వెళ్తారని చెప్పారు. అయినప్పటికీ వారికి ఫారం అందజేయలేకపోయినా, నింపిన ఫారం తిరిగి అందజేయకపోయినా అలాంటి ఓటర్ల పేర్లు కూడా ముసాయిదా జాబితాలో ఉండవని స్పష్టం చేశారు.ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను www.voter.eci.in వెబ్‌సైట్ లేదా ఈసీఐ యాప్ ద్వారా డౌన్‌న్‌లోడ్ చేసుకుని, అవసరమైన వివరాలు నింపి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే సౌకర్యాన్ని కూడా ఎన్నికల సంఘం కల్పించిందన్నారు.
ఆన్‌లైన్‌లో ఫారం సమర్పించిన వారి వివరాలను కూడా బీఎల్‌వోలు ఇంటి వద్దకు వెళ్లి ధ్రువీకరిస్తారన్నారు. ఎన్యూమరేషన్ ఫారంపై ఓటరు స్వయంగా లేదా కుటుంబ సభ్యులలో ఎవరైనా సంతకం చేసి సమర్పించవచ్చని తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం–6, వివరాల సవరణ కోసం ఫారం–8 కూడా అందుబాటులో ఉంటాయన్నారు.
భాగస్వాములు కావాలి..
ఓటరు జాబితా శుద్ధి ప్రక్రియ విజయవంతం కావాలంటే ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారం నింపి సమర్పించాలని, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి సహకరించాలని కర్ణన్ పిలుపునిచ్చారు.
ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు..
జులై 24 నాటికి పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తవుతుందని, 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తామని కర్ణన్ తెలిపారు. జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ జరుగుతుందని చెప్పారు.ఈ సమయంలో ఓటర్ల చేర్పు, తొలగింపు, వివరాల సవరణకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్‌వోలు) విచారణలు నిర్వహించి, సెప్టెంబర్ 28 నాటికి అన్ని అభ్యంతరాలను పరిష్కరిస్తారు. తుది ఓటరు జాబితా అక్టోబర్ 1, 2026న విడుదల కానుంది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరుగా నమోదై ఉండటం ప్రజాప్రాతినిధ్య చట్టంప్రకారం శిక్షార్హమైన నేరమని కర్ణన్ హెచ్చరించారు.
ముసాయిదా జాబితాలో పేరు లేకుంటే..?
ఎన్యూమరేషన్ ఫారం సమర్పించని కారణంగా ముసాయిదా జాబితాలో పేరు లేకుంటే, ఆ వివరాలను ఈఆర్‌వో కార్యాలయాలు, ముఖ్య ప్రదర్శన కేంద్రాలు, ఎన్నికల సంఘం వెబ్‌సైట్లలో ప్రదర్శిస్తారు. అనంతరం ఈఆర్‌వోలు నోటీసులు జారీ చేసి అవసరమైన పత్రాలు సమర్పించాలని కోరుతారు. ఈ సందర్భంగా పాస్‌పోర్ట్, జనన ధ్రువీకరణ పత్రం, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డులు, పెన్షన్ పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు, భూ లేదా గృహ కేటాయింపు పత్రాలు తదితర గుర్తింపు పత్రాలను సమర్పించవచ్చని అధికారులు తెలిపారు.
4,062 పోలింగ్ కేంద్రాలు..
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 4,062 పోలింగ్ కేంద్రాలు, 1,684 పోలింగ్ లొకేషన్లు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణ కోసం 15 మంది ఈఆర్‌వోలు, 93 మంది ఏఈఆర్‌వోలు, 408 మంది బీఎల్‌వో సూపర్వైజర్లు, 4,062 మంది బీఎల్‌వోలు విధుల్లో ఉన్నారని చెప్పారు.
రాజకీయ పార్టీల నుంచి బీఎల్‌ఏలు
జిల్లాలోని 4,062 పోలింగ్ కేంద్రాలకు వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు మొత్తం 10,901 మంది బూత్ లెవల్ ఏజెంట్లను (బీఎల్‌ఏలు) నియమించాయి. కాంగ్రెస్ పార్టీ 3,601 మంది (88 శాతం), బీజేపీ 2,941 మంది (72.4 శాతం), బీఆర్‌ఎస్ 1,988 మంది (49.94 శాతం), ఎంఐఎం 2,371 మంది (58.31 శాతం) బీఎల్‌ఏలను నియమించాయి. బీఎల్‌ఏలు బల్క్‌గా అప్లికేషన్లు సమర్పించవచ్చు.


