కోర్‌ సిటీలో ఇవి అత్యంత ఇబ్బందికరం.. | GHMC traffic dept focus on flood control in core city | Sakshi
Sakshi News home page

GHMC : ముంపు ముప్పు తప్పేలా...

Jun 3 2025 7:37 PM | Updated on Jun 3 2025 7:50 PM

GHMC traffic dept focus on flood control in core city

చీకోటి గార్డెన్స్‌ వద్ద రహదారిపై వరద (ఫైల్‌)

తిప్పలు పెడుతున్న మూడు ప్రాంతాలపై దృష్టి

ఓ మోస్తరు వానకే రహదారులన్నీ జలమయం

వాటి కేంద్రంగా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ జామ్స్‌

ఒక ప్రాంతంలో సమస్య పరిష్కరించిన అధికారులు

మరో రెండు ప్రాంతాల్లో చర్యలకు సన్నాహాలు

వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు హైద‌రాబాద్‌ సిటీలో ఉన్న కీలక వాటర్‌ లాగింగ్‌ ఏరియాలపై దృష్టి పెట్టారు. ఏఏ ప్రాంతాల్లో, ఏ స్థాయిలో వర్షానికి, ఎన్ని నీళ్లు  నిలుస్తున్నాయి? అనే అంశాన్ని గడిచిన కొన్నాళ్లుగా అధ్యయనం చేశారు. దీని ఆధారంగా జాబితాను రూపొందించారు. ఈ నివేదికను జీహెచ్‌ఎంసీకి పంపిన ట్రాఫిక్‌ విభాగం ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లో మరమ్మతులు చేయిస్తున్నారు. తొలి దశలో బేగంపేట, సైఫాబాద్‌ల్లో ఉన్న మూడు వాటర్‌ లాగింగ్‌ ఏరియాల రూపురేఖలు మారుస్తున్నారు. ఇప్పటికే ఓ ప్రాంతంలో పని పూర్తయిందని, మిగిలిన రెండు చోట్లా ఉన్న సమస్యని త్వరలోనే పరిష్కరిస్తామని ట్రాఫిక్‌ చీఫ్‌ డి.జోయల్‌ డెవిస్‌ ‘సాక్షి’కి తెలిపారు.  – సాక్షి, సిటీబ్యూరో

ఆ ప్రాంతాలు అత్యంత ఇబ్బందికరం... 
జీహెచ్‌ఎంసీ (GHMC) గణాంకాల ప్రకారం ‘గ్రేటర్‌’లో దాదాపు 150 వాటర్‌ లాగింగ్‌ ఏరియాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రధాన రహదారుల పైనే ఉండటంతో ఓ మాదిరి వర్షానికీ రోడ్లు మునిగిపోయి ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడుతున్నాయి. డ్రైనేజీ, వరద కాల్వలు అన్నిచోట్లా లేకపోవడం, ఉన్నవీ ప్రస్తుత అవసరాలకు సరిపోకపోవడంతో ఈ ఇబ్బందులు వస్తున్నాయి. ఈ ట్రాఫిక్‌ జామ్స్‌ సైతం నగర వ్యాప్తంగా ఒకేలా ఉండట్లేదు. కొన్ని చోట్ల ట్రాఫిక్‌ జామ్స్‌ ఆ ప్రాంతానికే పరిమితం అవుతున్నాయి. మరికొన్ని చోట్ల చుట్టుపక్కల ఏరియాల పైనా ప్రభావం చూపుతున్నారు. వాటర్‌ లాగింగ్‌ ఏరియాల్లో ఇలాంటి సమస్యాత్మకమైనవి గుర్తించిన ట్రాఫిక్‌ విభాగం అధికారులు ప్రాధాన్యత క్రమంలో జీహెచ్‌ఎంసీ సహకారంతో అక్కడి సమస్యలు పరిష్కరిస్తున్నారు.  

కోర్‌ సిటీలో ఇవి అత్యంత ఇబ్బందికరం...
నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న మూడు వాటర్‌ లాగింగ్‌ ఏరియాలు అత్యంత  ఇబ్బందికరంగా మారాయి. వీటివల్ల ఆ ప్రాంతంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లోనూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడుతున్నారు. అత్యంత కీలకమైన రహదారుల్లో ఒకటైన బేగంపేట పరిధిలోని అమీర్‌పేట–సికింద్రాబాద్‌ మధ్య ఉన్న చీకోటి గార్డెన్స్‌తో పాటు సైఫాబాద్‌ పరిధిలోని ఓల్డ్‌ సైఫాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్, లక్డీకాపూల్‌ బస్టాండ్‌ వద్ద ఉన్న వాటర్‌ లాగింగ్‌ ఏరియాలు ట్రాఫిక్‌ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాయి. 

చీకోటీ గార్డెన్స్‌ వద్ద ప్రభావంతో పంజాగుట్ట, సోమాజీగూడ వరకు, మిగిలిన రెండు చోట్ల వాటర్‌ లాగింగ్‌ ప్రభావంతో ఖైరతాబాద్, నిరంకారి, అయోధ్య జంక్షన్, మాసబ్‌ట్యాంక్, రవీంధ్రభారతి తదితర ప్రాంతాల వరకు ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడుతున్నాయి. ఇవి క్లియర్‌ కావడానికి ఒక్కోసారి గంటలు పడుతుండటంతో సాధారణ వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
క్యారో సహకారంతో చీకోటి గార్డెన్స్‌ వద్ద... 
ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు జీహెచ్‌ఎంసీ సహకారంతో ఆయా సమస్యలకు కారణాలు అధ్యయనం చేశారు. మురుగు, వరదనీటిని కూకట్‌పల్లి నాలాలోకి తీసుకువెళ్లే డ్రైనేజీ  చీకోటి గార్డెన్స్‌ వద్ద అంతకు ముందు ప్రాంతాల కంటే చిన్నగా ఉండటంతో పాటు వర్షం కురిసినప్పుడు హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌(హెచ్‌పీఎస్‌), బేగంపేటలోని ఓల్డ్‌ ఎయిర్‌పోర్టు నుంచి భారీగా వరదనీరు రావడం కారణంగా గుర్తించారు. 

దీనికి పరిష్కారం కోసం అన్వేషించిన అధికారులు అక్కడ ఉన్న సివిల్‌ ఏవియేషన్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (క్యారో) సహకారం తీసుకున్నారు. వారి అనుమతితో అందులో ఉన్న ఓ చెరువును అభివృద్ధి చేసి హెచ్‌పీఎస్, ఓల్డ్‌ ఎయిర్‌పోర్టు నుంచి వచ్చే నీటిని డైవర్షన్‌ కెనాల్స్‌ ద్వారా అందులోకి మళ్లిస్తున్నారు. ఓ గేటు ఏర్పాటు చేయడం ద్వారా చెరువు నిండిపోతే... వంతుల వారీగా నీటిని బయటకు వదులి చీకోటీ గార్డెన్స్‌ డ్రైనేజీపై ఒత్తిడి తగ్గిస్తున్నారు. దీంతో అది పొంగిక వాటర్‌ లాగింగ్‌ తగ్గింది.

జీహెచ్‌ఎంసీ సహకారంతో ముందుకు 
వాటర్‌ లాగింగ్‌ ఏరియాల వద్ద సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. తొలి దశలో కోర్‌ సిటీలోని మూడు ప్రాంతాలను ఎంచుకున్నాం. జీహెచ్‌ఎంసీ సహకారంతో అక్కడి సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాం. చీకోటి గార్డెన్స్‌ వద్ద సమస్య పరిష్కారమైంది. మిగిలిన రెండు చోట్లా పైప్‌ లైన్‌ నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ ముమ్మరంగా చర్యలు తీసుకుంటోంది. వర్షాలు ప్రారంభమయ్యే లోపు ఈ రెండు పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారికి అవసరమైన పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నాం.  
– డి.జోయల్‌ డెవిస్, సిటీ ట్రాఫిక్‌ చీఫ్‌

Advertisement
 
Advertisement
Advertisement