పంట విక్రయించిన సొమ్ము రాక విలవిల
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 3.32 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ
ఇంకా 30,382 మందికి రూ.482 కోట్లు బకాయి
ఖరీఫ్ మొదలవడంతో పెట్టుబడికి ఎదురుచూపులు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మార్క్‌ఫెడ్ ద్వారా మక్కలు విక్రయించిన రైతులు పంట సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగి సీజన్‌లో ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చినా మార్కెట్‌లో మద్దతు ధర దక్కక ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు నానా అగచాట్లు పడ్డారు. ఆ తర్వాత మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం మక్కలను కొనుగోలు చేసినా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంకా 30,382 మంది రైతులకు రూ.482 కోట్లు బకాయి ఉండడం... ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడి కోసం ప్రతీరోజు బ్యాంకుల వద్దకు వెళ్లి ఆరా తీస్తున్నారు.
8.64 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి
ఈ ఏడాది యాసంగిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా మొక్కజొన్న విస్తారంగా సాగు చేశారు. ఫలితంగా 3.17 లక్షల ఎకరాల్లో సాగవగా 8.64 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చింది. దిగుబడి వచ్చిందన్న ఆనందంలో ఉన్న రైతులకు ధర చూస్తే నిరాశ ఎదురైంది. ప్రభుత్వం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,400గా ప్రకటించినా, వ్యాపారులు రూ.1,600కు మించి చెల్లించలేదు.
ఈనేపథ్యంలో ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టింది. అయితే కేంద్రాలు అరకొరగా ఏర్పాటు చేయడం, నిబంధనలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజుల తరబడి కేంద్రాల వద్దనే పడిగాపులు కాయగా.. కాంటాలు వేశాక కూడా మిల్లులకు తరలింపులో జాప్యంతో కేంద్రాల వద్దే వేచి ఉండాల్సి వచ్చింది.
3.32 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ..
కొనుగోళ్లలో ఇక్కట్లు ఎదురుకావడంతో పలుమార్లు రైతులు ఆందోళనలకు దిగారు. చివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 50,382 మంది రైతుల నుంచి 3,32,700 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను ప్రభుత్వం సేకరించింది. వీటి విలువ రూ.797 కోట్లు. ఇందులో 20వేల మంది రైతులకు చెందిన 1.32 లక్షల మెట్రిక్ టన్నుల పంటకు సంబంధించి రూ.315 కోట్లను ఖాతాల్లో జమ చేశారు. రైతుల ఖాతాల్లో జమ అయిన సొమ్ము కన్నా.. ఇంకా అందాల్సిన సొమ్ము ఎక్కువగా ఉంది. 30,382 మంది రైతులకు సంబంధించి రూ.482 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
డబ్బు కోసం ఎదురుచూస్తున్నాం
నేను 18 ఎకరాల్లో మొక్క జొన్న పంటను సాగు చేశా. 497 క్వింటాళ్లను మార్క్‌ఫెడ్‌కు విక్ర యించి 50 రోజులు గడిచినా డబ్బు రాలేదు. ప్రభుత్వం గోనె సంచులు కూడా ఇవ్వక బయట కొనడంతోపాటు కాంటా, రవాణా ఖర్చులకు రూ.50 వేలు వడ్డీకి తెచ్చి పెట్టా. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడికి ఇబ్బంది పడుతున్నాం. – బంధం రంగయ్య, ముష్టికుంట్ల, బోనకల్
అమ్మి 45 రోజులైంది..
నాకున్న ఐదెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. 225 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. తనికెళ్లలోని కొనుగోలు కేంద్రంలో మక్కలను విక్రయించి 45 రోజులు గడిచింది. ఇప్పటి వరకు నగదు బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు. ఈ సమయంలో డబ్బులు జమ చేస్తే విత్తనాలు, ఎరువులు ఇతర అవసరాలకు ఉపయోగపడతాయి. – ఆకుతోట పుల్లారావు, తనికెళ్ల, కొణిజర్ల


