సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు తనిఖీలు చేపట్టారు.
వివరాల ప్రకారం.. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో శుక్రవారం ఉదయం ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరుపుతోంది. మోతీ నగర్‌లోని ఇంట్లో ఎన్నికల అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
ఈ క్రమంలో పోలీసులతో మర్రి జనార్థన్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ సందర్బంగా మర్రి జనార్థన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘పోలీసులే నా ఇంట్లో డబ్బులు పెట్టించారు. పోలీసులే బ్యాగులను నా ఇంట్లోకి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు బహిరంగంగా డబ్బులు పంచుతున్నారు. డైవర్షన్ కోసమే మా ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ రౌడీయిజం చేస్తోంది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రౌడీయిజమా?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రౌడీయిజం చేస్తారని అనుకోలేదు’ అంటూ మండిపడ్డారు.
ఇక, తాజాగా మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు ముగిశాయి. దాదాపు ఐదు గంటల పాటు సోదాలు జరిపిన ఎన్నికల అధికారులు సోదాలపై పంచనామా రిపోర్ట్ సిద్ధం చేసి సంతకాలు తీసుకున్నారు. సోదాల సందర్భంగా ఆయన ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్.. అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఏసీలు కూడా పూర్తిగా ఓపెన్ చేసి చూశారు. ఓ లాకర్ ఉంటే వాటి తాళలు తెప్పించి మరీ సోదాలు జరిపారు. ఇంట్లో ఎలాంటి నగదు లభ్యం కాకపోవడం.. ఖాళీ చేతులతో వెనుదిరిగారు.
మరోవైపు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు నివాసంలో పోలీసుల తనిఖీలు చేపట్టారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బీఎస్పీ కాలనీలో ఉంటున్న ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. అయితే, ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతంలో ఉన్న తన ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారని ఎమ్మెల్సీ రవీందర్ రావు ప్రశ్నిస్తున్నారు.
ఇక.. పోలీసుల సోదాల నేపథ్యంలో వారి ఇళ్ల వద్దకు భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు మాట్లాడుతూ..మమ్మల్ని పోలీసులు బెదిరిస్తున్నారు. సోదాల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు. పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్ల మాదిరిగా పనిచేస్తున్నారు. బహిరంగంగా రిగ్గింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


