రూ. 198 కోట్ల వ్యయంతో ఆలయ జీర్ణోద్ధరణ, తొలగింపు ప్రక్రియ
దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
నేటి నుంచి ఆదిముక్తీశ్వరాలయం వద్ద బాలాలయంలో దర్శనాలు
కాళేశ్వరం: కాకతీయులు, చాళుక్యుల కాలం నాటి పురాతన కాళేశ్వరాలయానికి మహర్దశ రానుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని ఈ ఆలయ జీర్ణోద్ధరణ, తొలగింపు పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.198 కోట్లు కేటాయించింది. ఆలయ పనులకు ఏప్రిల్ 20న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆయన సతీమణి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్‌లు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆలయ జీర్ణోద్ధరణకు పూనుకున్నారు. పూర్తిగా కృష్ణశిలతో ఆలయ పునర్నిర్మాణాన్ని చేపడుతున్నారు. మంగళవారం దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, ధార్మిక సలహాదారు గోవిందహరిలు చేపట్టబోయే పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు.
ఆలయ నిర్మాణ ప్రత్యేకతలు..
» ఆలయాన్ని 7 లక్షల క్యూబిక్ ఫీట్లతో నిర్మాణం చేపడతారు. కాకతీయుల కళావైభవం ఉట్టిపడేలా నిర్మాణశైలి ఉంటుంది. దేవస్థానంలోని గర్భాలయం, అనివెట్టి మండపం అంత రాలయం, ప్రాకారాలు నిర్మిస్తారు.
» అన్ని ఉప ఆలయాలు శ్రీశుభానందదేవి, నందులు, శ్రీసుబ్రహ్మణ్యస్వామి, నవగ్రహాలు, యాగశాల, సుపద మండపాలు ఒకే చోట వాస్తు ప్రకారం ప్రతిష్టించనున్నారు.
» బయట ఉన్న సరస్వతి అమ్మవారు, శ్రీరామాలయం, శ్రీసూర్యాలయాలు లోపల ఏర్పాటు చేస్తున్నారు. ఆ తరువాత రెండవ దశలో తూర్పు రాజగోపురం, ఇతర మిగిలిన పనులు చేపట్టనున్నారు.
నమూనా చిత్రాల విడుదల
కాళేశ్వరంలోని అష్ట తీర్థాలకు రూ.60 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసినట్లు దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. ఈవో కార్యాలయంలో స్థానికులతో సమావేశంలో కృష్ణశిలతో ఉన్నటువంటి నమూనా చిత్రాలు విడుదల చేశారు. మే చివరి వరకు పనులు పూర్తి చేసేలాగా ప్రణాళికలు చేశామని తెలిపారు. శిల్పులకు ఒక్కో శిల్పానికి మూడు నెలల సమయం పట్టనుంది. పనులు హైదరాబాద్‌కు చెందిన జైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అప్పగించినట్లు పేర్కొన్నారు.

పుష్కర ఘాట్ నమూనా చిత్రం
పంచబ్రహ్మ యాగంతో ఆరంభం
జీర్ణోద్ధరణలో భాగంగా మంగళవారం సాయంత్రం యాగశాలలో పంచబ్రహ్మ హోమాన్ని వేదపండితుల మంత్రోచ్ఛారణలతో ఘనంగా నిర్వహించారు. పూజా క్రతువులు ప్రారంభం కావడంతో బుధవారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు ప్రాయశ్చిత్త పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత 8.15 గంటలకు శృంగేరి శారదా పీఠాధిపతి శిష్యబృందంతో కళాపకార్షణ క్రతువు ఆరంభిస్తారు.
దీంతో శ్రీ ఆదిముక్తీశ్వరాలయంలో ఏర్పాటు కానున్న బాలాలయంలో చైన్నైకి చెందిన కళాకారులు అరుదైన అత్తి కర్రతో తయారు చేసిన ఉత్సవ మూర్తులను ప్రతిష్టిస్తారు. అప్పటి నుంచి ఆలయంలో దర్శనాలు, ఆదిముక్తీశ్వరాలయంలో అభిషేక పూజలు ప్రారంభం జరుగుతాయని కమిషనర్ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం నుంచి కాళేశ్వరం దేవస్థానంలో కైంకర్య పూజలు నిలిపివేస్తారని పేర్కొన్నారు.


