పాత వాహనాలు కొంటున్నారా..? కీలక సూచనలు | CP Sajjanar's Strict Advisory On Old And Second Hand Vehicles, Fake Documents, Odometer Tampering Under Scanner As Hyderabad Police Act | Sakshi
Sakshi News home page

పాత వాహనాలు కొంటున్నారా..? కీలక సూచనలు

Jun 8 2026 5:00 PM | Updated on Jun 8 2026 5:10 PM

CP Sajjanar's key suggestions on old vehicles

సాక్షి, హైదరాబాద్: నగరంలో దొంగ వాహనాల చలామణికి అడ్డుకట్ట వేయడంతో పాటు, పాత వాహనాల కొనుగోలుదారులను మోసాల నుంచి రక్షించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇటీవల నిర్వహించిన 'ఆపరేషన్ కవచ్' ఆకస్మిక తనిఖీల్లో సెకండ్ హ్యాండ్ వాహన డీలర్లు కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా విక్రయాలు సాగిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ గారు సోమవారం కీలక మార్గదర్శకాలతో కూడిన అడ్వైజరీని జారీ చేశారు.

సెకండ్ హ్యాండ్ వాహనాల క్రయవిక్రయాలపై మోటార్ వాహనాల చట్టం-1988, సెంట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్-1989, భారతీయ న్యాయ సంహిత -2023లో ఉన్న నిబంధనలను అడ్వైజరీలో ప్రధానంగా పేర్కొన్నారు. యజమాని వివరాల ధృవీకరణ లేకుండా వాహనాలను కొనుగోలు చేసినా, తక్కువ కిలోమీటర్లు తిరిగినట్లు చూపించేందుకు ఒడోమీటర్లను ట్యాంపరింగ్ చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోళ్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.

అడ్వైజరీలోని ప్రధానాంశాలు!

●  డీలర్లు ఏదైనా పాత వాహనాన్ని కొనుగోలు చేసే ముందు విక్రయదారుడి గుర్తింపును పక్కాగా ధృవీకరించుకోవాలి. ఇందుకోసం విక్రేత ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాల నకలును సేకరించడంతో పాటు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లో ఉన్న పేరు, చిరునామాతో వాటిని సరిపోల్చుకోవాలి.

●  ఒకవేళ అసలు యజమాని కాకుండా వేరొక ప్రతినిధి ద్వారా విక్రయం జరుగుతున్నట్లయితే, చట్టబద్ధమైన పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

●  ఒకవేళ విక్రేత గుర్తింపు లేదా వాహన యాజమాన్య వివరాలు సంతృప్తికరంగా ధృవీకరించబడకపోతే.. అటువంటి వాహనాన్ని డీలర్లు తమ వద్దకు తీసుకోవడం గానీ, ప్రకటనలు ఇవ్వడం గానీ లేదా తిరిగి విక్రయించడం గానీ పూర్తిగా నిషేధం.

●    వాహనం కొనుగోలు చేసే ముందే అది దొంగిలించబడినదా, బ్లాక్ లిస్టులో ఉందా లేదా ఏదైనా ప్రమాదానికి గురైందా అన్న విషయాన్ని వాహన్ పోర్టల్ ద్వారా నిర్ధారించుకోవాలి.

●    వాహనంపై ఉన్న పెండింగ్ ట్రాఫిక్ చలానాలు, రోడ్డు పన్ను బకాయిలతో పాటు ఎటువంటి టోల్ గేట్ బకాయిలు లేకుండా చూసుకోవాలి. ఫైనాన్స్ క్లియరెన్స్ వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే లావాదేవీలు జరపాలి.

●    ఇతర రాష్ట్రాల వాహనాల విక్రయాలకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. వాహన్ పోర్టల్ రికార్డులలో సదరు వాహనానికి సంబంధించి ఎటువంటి ఇతర భారాలు లేవని (ఎన్‌కంబరెన్స్ ఫ్రీ), స్పష్టమైన యాజమాన్య హక్కులు (క్లియర్ టైటిల్) ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే వాహన బదిలీ లేదా డెలివరీ ప్రక్రియ చేపట్టాలి.

●    వాహనాల ఓడోమీటర్ రీడింగ్‌లను మార్చడం లేదా ఇంజిన్, ఛాసిస్ నంబర్లను ట్యాంపరింగ్ చేయడం చట్టరీత్యా నేరం. తక్కువ కిలోమీటర్లు తిరిగినట్లు చూపించి కస్టమర్లను మోసం చేయడం శిక్షార్హమైన నేరం. బాధ్యులపై బిఎన్ఎస్ సెక్షన్ 318తో పాటు వినియోగదారుల ర‌క్ష‌ణ చట్టం-2019 ప్రకారం చర్యలు ఉంటాయి.

●    డీలర్లు వాహనాన్ని తమ వద్దకు తీసుకున్నప్పుడు, అలాగే వేరొకరికి డెలివరీ చేసే సమయంలో ఓడోమీటర్ రీడింగ్‌ను నమోదు చేయడంతో పాటు, ఇంజిన్/ఛాసిస్ నంబర్లను ఫోటో తీసి భద్రపరచుకోవాలి.

●    మోటారు వాహనాల చట్టం-1988 లోని సెక్షన్ 192A, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్-1989 లోని రూల్ 50 నిబంధనల ప్రకారం.. వాహనంపై కంపెనీ ముద్రించిన ఇంజిన్, ఛాసిస్ నంబర్లను గానీ, ఇతర గుర్తింపు చిహ్నాలను గానీ మార్చడం, చెరపడం, ట్యాంపరింగ్ చేయడం చట్టరీత్యా నేరం.

●    ఒకవేళ ఏ వాహనానికైనా ఈ గుర్తింపు నంబర్లు ట్యాంపరింగ్‌కు గురైనా లేదా అసలు లేకపోయినా.. ఆ వాహనాన్ని దొంగిలించినదిగా భావించి పోలీసులు తక్షణమే సీజ్ చేస్తారు. అంతేకాకుండా, సదరు వాహనాన్ని తమ వద్ద ఉంచుకున్న రీసెల్లర్లపై ‘భారతీయ న్యాయ సంహిత (BNS)-2023’ సెక్షన్ 317(2) కింద దొంగ సొత్తును కలిగి ఉన్నట్లుగా పరిగణించి కఠిన క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.

●    కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ (MoRTH) జారీ చేసిన జీఎస్‌ఆర్ 901(ఇ) (తేదీ: 22 డిసెంబరు, 2022) నిబంధనల ప్రకారం.. సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం చేసే ప్రతి వ్యక్తి లేదా సంస్థ మోటార్ వాహన నిబంధనల (CMVR-1989) రూల్ 48 కింద సంబంధిత ప్రాంతీయ రవాణా అధికారి (RTO) కార్యాలయం నుంచి తప్పనిసరిగా అధికారిక లైసెన్స్ (అథరైజేషన్ సర్టిఫికేట్) పొంది ఉండాలి. నిబంధనలు ఉల్లంఘించి, అనుమతులు లేకుండా వ్యాపారం సాగిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయి.

●    డీలర్లు తమ వద్ద జరిగే ప్రతి వాహన లావాదేవీకి సంబంధించి డిజిటల్ లేదా రాతపూర్వక రూపంలో ప్రత్యేక రిజిస్టర్‌ను నిర్వహించాలి. ఈ రిజిస్టర్‌లో కొనుగోలుదారు, విక్రయదారుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, వారి సంతకాలతో పాటు లావాదేవీ జరిగిన తేదీ, సమయాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలి.

●    అలాగే వాహనం రిజిస్ట్రేషన్ నంబరు, ఇంజిన్, ఛాసిస్ నంబర్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు.. తిరిగి కస్టమర్‌కు డెలివరీ ఇచ్చే సమయంలో ఉన్న ఒడోమీటర్ రీడింగ్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

●    వాహనం డీలర్ వద్ద ఉన్న సమయంలో జరిగే ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు లేదా ఇతర దుర్వినియోగాలకు మోటారు వాహన నిబంధనల రూల్ 55ఇ  ప్రకారం డీలర్లదే పూర్తి కస్టడీ ఆధారిత బాధ్యత.

●    మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 2(30) కింద అసలు యజమానికి ఉండే చట్టబద్ధమైన యాజమాన్య బాధ్యతకు ఇది పూర్తిగా భిన్నమైనది. టెస్ట్ డ్రైవ్, సర్వీసింగ్ లేదా ఇతర అవసరాల కోసం వాహనాన్ని బయటకు తీసిన ప్రతిసారీ డ్రైవర్ పేరు, లైసెన్స్ నంబర్, వెళ్లే ఉద్దేశం, ప్రయాణ సమయం, ప్రయాణించిన దూరం (మైలేజీ) వివరాలను 'ఎలక్ట్రానిక్ ట్రిప్ రిజిస్టర్' లో తప్పనిసరిగా నమోదు చేయాలి.

●    డీలర్ల కస్టడీలో ఉన్నప్పుడు వాహనం ఏదైనా ప్రమాదానికి గురైనా లేదా అసాంఘిక కార్యకలాపాలకు వాడబడినా.. అసలు వాహన యజమాని (ఆర్‌సీ ఓనర్) అనవసరంగా సివిల్, క్రిమినల్ కేసులతో పాటు మోటారు ప్రమాదాల క్లెయిమ్‌ల ట్రిబ్యునల్ (MACT) వ్యాజ్యాల్లో చిక్కుకోకుండా రక్షించేందుకే ఈ నిబంధనలను తీసుకువచ్చారు.

సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాలలో వాహనాలకు సంబంధించి తప్పుడు ఫోటోలు, అవాస్తవ సమాచారంతో ప్రకటనలు ఇచ్చి వినియోగదారులను ఆకర్షించడం నేరమని సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు స్పష్టం చేశారు. ఈ నియమ నిబంధనలను ఉల్లంఘించే డీలర్ల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు, వారిపై భారతీయ న్యాయ సంహిత లోని దొంగతనం (సెక్షన్ 303), దొంగిలించిన సొత్తును కలిగి ఉండటం (సెక్షన్ 317), మోసం (సెక్షన్ 318), ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం (సెక్షన్ 221/222) కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నిరంతరం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, ఈ ప్రక్రియకు అందరూ పూర్తిగా సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement