కలెక్టర్ అనుదీప్ ఆలోచనతో ఇంగ్లిష్ పరిజ్ఞానం పెంచేలా అమలు
1– 5వ తరగతి విద్యార్థుల కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం
విద్యార్థులు ఎదగాలంటే చదవడం.. చదివింది అర్థం చేసుకోవడం అనేది కీలకం. ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం కూడా ముఖ్యమే. ఈ రెండింటిలో విద్యార్థుల సామర్థ్యాలను పెంచేలా ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
చింతకాని మండలంలో పైలెట్ ప్రాజెక్టు మొదలుపెట్టగా, సత్ఫలితాలు రావడంతో.. జిల్లాలోని 958 పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు గల 28,982 మంది విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచేలా గత నెల 27న ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెల రోజులపాటు (ఈ నెల 30వ తేదీవరకు) విద్యార్థులకు అక్షరాలు, పదాలు, వాక్యాలు ఎలా ఉచ్ఛరించాలో చెప్పడమే కాక ఫోనెటిక్ సౌండ్‌తో సహా నేర్పేలా కోర్సును డిజైన్ చేశారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
ప్రాథమిక విద్యార్థుల కోసం...
ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ, లోకల్ బాడీ మేనేజ్‌మెంట్ పరిధిలో 958 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 28,982 మంది విద్యార్థులు ఉండగా, అందరినీ ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ఎవ్రీ చైల్డ్ రీడ్స్ యాప్‌లో నమోదు చేశారు. ప్రతీ విద్యారి్థకి మెటీరియల్ అందించి ఇంగ్లిష్ అక్షరాలు రాయడం, చదవడం నేర్పిస్తున్నారు.
పర్యవేక్షణకు యాప్
ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమ పర్యవేక్షణకు యాప్‌ను రూపొందించారు. దీనిని యూడీఐఎస్‌తో అనుసంధానం చేశారు. దీనికి డేటా ఎంట్రీ అవసరం ఉండదు. విద్యార్థి అభ్యసన సామర్థ్యం ఎలా ఉందన్నది ప్రతీ బుధవారం ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయా లి. ప్రతీ రోజు గంట సేపు చదివే సామర్థ్యంపై అభ్యసన చేయించేందుకు బుక్‌లెట్ ఇస్తారు. దీని ఆధారంగా ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఇంగ్లిష్ పరిజ్ఞానం పెంచేలా కృషి చేస్తున్నారు.
నెలరోజుల్లో పేరాగ్రాఫ్ చదివేలా..
ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం మెరుగుపరచి, పఠనా సామర్థ్యం పెంపొందిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులు బోర్డుపై ఇంగ్లిష్ అక్షరాలు, పదాలు, పద్యాలు రాసి ఉచ్ఛారణ, అర్థం వివరిస్తూ విద్యార్థులు తిరిగి చెప్పగలుగుతున్నారా లేదా, అనేది పరిశీలిస్తున్నారు.
ధ్వనులను అనుసరించి పదాలను గుర్తించడం నేర్పిస్తున్నారు. నెల తర్వాత ప్రతీ విద్యార్థి కనీసం ఒక పేరాగ్రాఫ్ చదివి అర్థం చేసుకునే స్థాయికి చేర్చేలా కృషి సాగుతోంది. ప్రతిరోజు పాఠశాల సమయాన ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుండడంతో 26,639 విద్యార్థుల్లో పఠనా సామర్థ్యాలు మెరుగయ్యాయి.


