దేశంలోనే తొలిసారిగా రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఆర్‌ఏఎస్ టెక్నాలజీతో రెయిన్‌బో ట్రౌట్ చేపల ఫాం
కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్‌సింగ్ చేతుల మీదుగా ప్రారంభం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం వంటి శీతల ప్రాంతాలకే పరిమితమైన రెయిన్‌బో ట్రౌట్ చేపల పెంపకం దేశంలోనే తొలిసారిగా ఉష్ణమండల ప్రాంతమైన తెలంగాణలో వాణిజ్య స్థాయిలో ప్రారంభమైంది. రాష్ట్రానికి చెందిన స్మార్ట్ గ్రీన్ ఆక్వాకల్చర్ లిమిటెడ్ సంస్థ.. రెండెకరాల విస్తీర్ణంలో ఇండోర్ పద్ధతిలో అత్యాధునిక రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టం (ఆర్‌ఏఎస్) ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో రెయిన్‌బో ట్రౌట్ ఫాం, పరిశోధన సంస్థను ఏర్పాటు చేసింది.
సుమారు రూ. 54 కోట్ల పెట్టుబడితో, ఏటా 1,200 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఫాంను కేంద్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్‌సింగ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీని జోడించి చేపల పెంపకం చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రతికూల వాతావరణంలోనూ ఇలాంటి చేపల పెంపకం చేపట్టడం ఆదర్శనీయమని చెప్పారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలో ఎక్కడైనా ఇలాంటి చేపలను పెంచొచ్చని.. ప్రపంచ మార్కెట్‌లో ఈ చేపలకు డిమాండ్ ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, మత్స్యశాఖ సహాయ మంత్రి జార్జి కురియన్, ఎస్పీ సింగ్ బగెల్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పశుసంవర్థక కార్యదర్శి సాగర్ మెహ్రా, ఆల్ ఇండియా డిక్కీ చైర్మన్ నర్ర రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉష్ణోగ్రత 10 నుంచి 15 డిగ్రీల్లోపే
రెయిన్‌బో ట్రౌట్ చేపలు 10 నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలోనే జీవిస్తాయని... అందువల్ల 44 కోల్డ్‌వాటర్ ఫిష్ ప్లాంట్లను ఏర్పాటు చేసి వాటిలో ఈ చేపల పెంపకం చేపడుతున్నామని సంస్థ నిర్వాహకుడు ఆదిత్య రిత్విక్ నర్ర తెలిపారు. 14 నెలల్లోనే చేపలు చేతికి వస్తాయన్నారు. ప్రస్తుతం అమెరికా నుంచి చేప పిల్లలను దిగుమతి చేసుకున్నట్లు చెప్పారు. కృత్రిమ చేపల చెరువులు, కుంటల్లో చేపట్టే చేపల పెంపకంలో.. చేపలను బయటకు తీసి కలుషిత నీటిని ఎప్పటికప్పుడు మార్చాల్సి ఉంటుందన్నారు. కానీ ఆర్‌ఏఎస్ టెక్నాలజీలో మాత్రం చేపలను తొలగించాల్సిన అవసరం లేకుండానే నీటిని నిరంతరం శుభ్రపరచొచ్చని.. అవే నీటిలో తిరిగి ఆక్సిజన్‌ను చేర్చడం, ఉష్ణోగ్రతలను నియంత్రించడం సాధ్యమవుతుందని వివరించారు. ఖరీదైన, అరుదైన రెయిన్‌బో ట్రౌట్ చేపలను ఎక్కడైనా పెంచొచ్చని నిరూపించేందుకే ఈ విధానంలో ఫిష్ ఫారి్మంగ్‌ను చేపట్టినట్లు ఆయన తెలిపారు.
6 కేజీల దాకా బరువు.. కిలో రూ. 3 వేలపైనే రేటు
రెయిన్‌బో ట్రౌట్ రకం చేపల జీవితకాలం ఆరేళ్లు. ఇవి 10 నుంచి 15 అంగుళాల పొడవు, 6 కేజీల దాకా బరువు పెరుగుతాయి. ఈ రకం చేపల్లో పుష్కలంగా విటమిన్ బీ12, విటమిన్ డీతోపాటు ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రొటీన్లు ఉంటాయి. బహిరంగ మార్కెట్‌లో ఈ చేప ధర కేజీ రూ. 3 వేలపైనే పలుకుతుండటంతో దేశంలోని శీతల ప్రాంతాల్లో వాటిని వాణిజ్య స్థాయిలో పెంచుతున్నారు.


