పేర్లు.. పింఛను వెతలు... | Sakshi
Sakshi News home page

పేర్లు.. పింఛను వెతలు...

Published Fri, Sep 1 2023 3:31 AM

CMPF woes for Singareni retired workers - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కోల్‌మైన్స్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (సీఎంపీఎఫ్‌) విధించిన కొత్త నిబంధన కొందరు రిటైర్డ్‌ సింగరేణి కార్మికులకు ఇబ్బందిగా మారింది. వాస్తవానికి విశ్రాంత కార్మికుల సంక్షేమానికి సీఎంపీఎఫ్‌ బతికిఉన్న ప్రతీ కార్మికుడు, అతడి భార్య వివరాలు డిజిటలైజేషన్‌ చేయాలని ఇటీవల నిర్ణయించింది. కొందరు సింగరేణి కార్మికుల భార్యలు మరణించగా, రెండో వివాహం చేసుకున్నారు.

ఇలాంటి వారి వివరాలు ఇంతవరకూ డిజిటలైజ్‌ కాలేదు. అందుకే, భార్యల ప్ర యోజనాలు కాపాడేందుకు, వితంతువులకు పింఛన్‌ ఇవ్వాలన్న సదుద్దేశంతో సీఎంపీఎఫ్‌ ఈ కార్యక్రమాన్ని కొద్దిరోజులుగా కోల్‌బెల్ట్‌లో మొదలుపెట్టింది. రిటైరైన కార్మికులంతా జాయింట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి, ఆధార్‌ వివరాలు సమర్పిస్తున్నారు. ఇందుకోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తమకోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నా రు. సింగరేణి వ్యాప్తంగా రిటైర్డ్‌ కార్మికులు 84,808 మంది ఉన్నారు.  

న్యాయపరమైన చిక్కులతోనే... 
సింగరేణిలో చాలామంది కార్మికులు గతంలో అలియాస్‌ పేర్లతో విధులు నిర్వర్తించేవారు. అప్పట్లోయాజమాన్యం కూడా దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ సమస్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రభుత్వాల దృష్టిలో ఉన్నదే. తెలంగాణ ఆవిర్భవించాక రెండుపేర్లు ఉన్న కార్మికుల ప్రయోజనాలు పరిరక్షిస్తామని సీఎం హామీ ఇచ్చినా..న్యాయపరమైన చిక్కుల వల్ల కార్యరూపం దాల్చలేదు. అయితే, ఇప్పుడు సీఎంపీఎఫ్‌ విధించిన కొత్త నిబంధనలు రెండు పేర్లున్న సింగరేణి కార్మికుల పాలిట ప్రతికూలంగా మారాయి.  

రెండు రోజులుగా తిరుగుతున్నా 
జీడీకే–2గనిలో కోల్‌ఫిల్లర్‌గా పనిచేసి తొమ్మిదేళ్ల కిందట రిటైర్డ్‌ అయ్యా. అప్పటి నుంచి పెన్షన్‌ తీసుకుంటున్నా. పాత రామగుండం నుంచి 2 రోజులుగా బ్యాంకుకు వచ్చి వెళ్తున్నా. ఇంకా పని కాలేదు. ఇద్దరికి బ్యాంకు అకౌంట్లు ఉండాలంటున్నారు. తర్వాతే జాయింట్‌ చేస్తామని చెబుతున్నారు.  - ఈదునూరి శంకర్‌ రిటైర్డ్‌ కార్మికుడు

గర్రెపల్లి నుంచి వచ్చా  
జీడీకే–2ఏ గనిలో పనిచేసి 11 ఏళ్ల కిందట రిటైర్డ్‌ అయ్యా. మళ్లీ అన్ని పేపర్లు అడుగుతున్నారు. చేతకాకున్నా మనుమడిని పట్టుకొని బ్యాంకుకు వచ్చా. గంటల తరబడి లైన్‌లో కూర్చోవాల్సి వచ్చింది. మళ్లీ పేపర్లు అన్నీ నింపి ఫొటోలు ఇవ్వాల్సి రావడం ఆలస్యం అవుతోంది.  - పిట్టల గంగయ్య రిటైర్డ్‌ కార్మికుడు  

20 శాతం మారుపేర్లతోనే... 
సింగరేణిలో పనిచేసి రిటైర్డ్‌ అయిన కార్మికుల్లో సుమారు 20శాతం మంది మారుపేర్లతో పనిచేశారు. వీరికి సింగరేణిలో ఒకపేరు, సొంత గ్రామంలో మరోపేరు ఉంది. వీరందరికీ మొన్నటి వరకూ రెండు ఆధార్‌కార్డులు కూడా ఉన్నాయి. కరోనా తర్వాత కేంద్రం రెండు పేర్లతో ఉన్న ఆధార్‌కార్డుల తొలగింపు మొదలుపెట్టింది. దీంతో వందలాదిమంది సింగరేణి కార్మికులు తమ ఆధార్‌కార్డులు కోల్పోవాల్సి వచ్చింది.

కొందరు మారుపేరు కార్డు కోల్పోగా, మరికొందరు సొంత పేరుతో ఉన్న కార్డులు కోల్పోయారు. ప్రస్తుతం ఇదే ఇబ్బందిగా మారింది. వితంతువులకు కూడా ఇది ఇబ్బందికరంగా మారింది. అందుకే, మారుపేర్లతో ఉన్న కార్మికులను అలియాస్‌ పేరుతో నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

అసలు తమకు వచ్చేది అరకొర పింఛన్‌ అని, దానికి ఇన్ని తిప్పలు పెట్టి తమ పొట్టకొట్టొద్దని వేడుకుంటున్నారు. ఊర్లో ఉన్న ఆస్తులు రైతుబంధు, రైతుబీమా వివిధ సంక్షేమ పథకాలకు సొంతపేరుతో ఉన్న ఆధార్‌కార్డు లింక్‌ అయ్యాయని, ఇప్పుడు తామేం చేయాలో తెలియని అయోమయ స్థితి నెలకొందని వాపోతున్నారు. యాల్సి వచ్చిందని విలపించారు. 

Advertisement
Advertisement