
హైదరాబాద్: దేవుడు గొప్ప డిజైనర్, ప్రకృతి ఉత్తమ గురువు అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈరోజు(ఆదివారం, ఆగస్టు 24వ తేదీ) నగరంలోని ఏఐజీ ఆస్పత్రి వేదికగా ఆసియా-పసిఫిక బయోడిజైన్ ఇన్నోవేషన్-2025 సమ్మిట్‌ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘బయోడిజైన్ ఉపయోగించి వైద్య ఉత్పత్తుల ఆవిష్కరణల సదస్సులో పాల్గొనడం ఆనందంగా ఉంది. దేనినైనా మనం రూపొందిస్తే దాని ప్రయోజనం , పనితీరు, రూపం ప్రాథమిక అంశాలుగా ఉంటాయి.
దేవుడు గొప్ప డిజైనర్. ప్రకృతి ఉత్తమ గురువు. మనం మంచి విద్యార్థులమా లేదా అన్నదే ప్రశ్న.లైఫ్ సైన్సెస్‌లో, వైద్యంలో, ప్రకృతి ఉత్తమ గురువు. మనం ప్రకృతి నుంచి నేర్చుకుంటే, మనం తప్పు చేయొద్దు. కృత్రిమ మేధస్సు బయోడిజైన్‌కు మంచి ఉదాహరణ. మానవులు కృత్రిమ మెదడును సృష్టించడానికి సహజ మెదడును ఉపయోగించారు.
మేము తెలంగాణ రైజింగ్ 2047 అనే ప్రయాణాన్ని ప్రారంభించాము. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం. దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్యదినోత్సవాన్ని జరుపుకునే 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గా మారుస్తాం..తెలంగాణ లైఫ్ సైన్సెన్స్‌కు కేంద్రం గా ఉంది..తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను సాధించడంలో వైద్య పరికరాలు, మెడ్‌టెక్ కీలకమైనవి’ అని ఆయన పేర్కొన్నారు.