
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. తన పాలనను రెఫరెండంగా ఉపఎన్నికలకు వెళ్లేదమ్ము రేవంత్‌కు ఉందా? అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలి’అని డిమాండ్ చేశారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎన్నడూ రియల్ ఎస్టేట్లో నాయకులు వేలు పెట్టలేదు. కానీ 20 నెలల్లోనే హైడ్రా పేరుతో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టించారు. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకోకుండా పేదల ఇళ్లు కూల్చివేశారు. బీఆర్ఎస్ పదేళ్లలో రెండు లక్షల 85 వేల కోట్ల అప్పు చేస్తే, రేవంత్ రెడ్డి 20 నెలల్లోనే రెండు లక్షల 20 వేల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. కేసీఆర్ ఆ అప్పుతో హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు, అత్యాధునిక ఆసుపత్రులు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు కట్టారని, కానీ రేవంత్ ఒక్క కొత్త బ్రిడ్జి కానీ, మోరీ కానీ కట్టారు. కేసీఆర్ 70 లక్షల మంది రైతు ఖాతాల్లో 70 వేల కోట్లు వేస్తే, రెండు లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ ఏం చేశారని నిలదీశారు. 200 ఉన్న పెన్షన్‌ను కేసీఆర్ ప్రభుత్వం 2000 చేస్తే, రేవంత్ ఏం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు మంచి చేసి ఉంటే, ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఉత్త టైంపాస్ ముచ్చట్లు చెబుతూ, ఒకరోజు కేసీఆర్ మీద, ఇంకోరోజు తన మీద కేసులంటూ రేవంత్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మహానగరానికి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను వదల్లేదని కేటీఆర్ ప్రశంసించారు.