
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధికి ,సేవలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మళ్ళీ గులాబీ జెండా ఎగరాలి’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
‘బీఆర్ఎస్ పార్టీకి 50 వేల మంది కార్యకర్తల సభ్యత్వం ఉన్న నియోజకవర్గం జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మళ్ళీ గులాబీ జెండా ఎగరాలి. కాంగ్రెస్ వచ్చాక అనేక సంక్షేమ పథకాలు ఆగిపోయాయి. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బస్తీల్లో ఉండే పేదల ఇండ్లు కూల్చుతున్నారు. సీఎం రేవంత్ కొడంగల్ నియోజకవర్గంలో ఎఫ్‌టీఎల్‌లో ఇల్లు కట్టుకున్నాడు.
హైదరాబాద్‌లో రేవంత్, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఎఫ్‌టీఎల్‌లోనే ఉంటుంది. ఇలా చెప్పుకుంటే పోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్లు అన్ని బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌లోనే ఉన్నాయి. కూట్లో రాయి తెయ్యలేని వాడు, ఎట్లో రాయి తీస్తా అని రేవంత్ మాట్లాడుతున్నాడు.
జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ శ్రేణులకు ఒకటే చెప్తున్నా. గెలుస్తామన్న ధీమాతో నిర్లక్ష్యం వద్దు. గెలుస్తాం అని ఇంట్లోనే ఉండకుండా ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ గెలుపుకు కృషి చెయ్యాలి. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారిన మాగంటి గోపినాధ్ బీఆర్ఎస్ పార్టీ వీడలేదు. ఉపఎన్నిక గెలిచి మాగంటి గోపీనాథ్ అంకితం ఇవ్వాలి.
ఎలక్షన్ కమిషన్ తీరు సరిగా లేదు. ఎలక్షన్ కమిషన్ దేశ వ్యాప్తంగా ఓట్లు తీసివేసి పనిలో ఉంది. బీహార్‌లో మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఓటునే తీసేశారు. మన ఓట్లు తీసివేయడం ఒక లెక్కనాఅందరం జాగ్రత్తగా ఉండాలి’ అని అన్నారు.