యూరియాపై ఆందోళన వద్దు | Ministers Sridhar Babu and Tummala review urea supply with RFCL officials | Sakshi
Sakshi News home page

యూరియాపై ఆందోళన వద్దు

Aug 24 2025 5:07 AM | Updated on Aug 24 2025 5:07 AM

 Ministers Sridhar Babu and Tummala review urea supply with RFCL officials

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి పునరుద్ధరణపై మార్గనిర్దేశం

సచివాలయంలో మంత్రులు తుమ్మల, శ్రీధర్‌బాబు సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: యూరియా సరఫరా ను పెంచేందుకు మా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని, ప్రతిపక్షాల దుష్ప్రచారంతో రైతులు ఆందోళనకు గురి కావొద్దని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) యాజమాన్యం, వ్యవసాయ, పరిశ్రమల శాఖల ఉన్నతాధికారులతో శనివారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి నిలిచిపోవడానికి గల కారణాలపై మంత్రులు ఆరా తీశారు.

ఈ సీజన్‌లో 145 రోజుల్లో 40 రోజులు మాత్రమే ప్లాంట్‌ పనిచేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తరచూ ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటే శాశ్వత చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సీఈవో అలోక్‌ సింఘాల్‌ను మంత్రులు ప్రశ్నించారు. ‘మిమ్మల్ని మేం కేవలం వ్యాపారవేత్తలుగా మాత్రమే చూడటం లేదు. రాష్ట్రాభివృద్ధిలో మాతో కలిసి నడిచే భాగస్వామిగా చూస్తున్నాం’అని స్పష్టం చేశారు. ప్లాంట్‌ పునరుద్ధరణకు రూపొందించిన యాక్షన్‌ ప్లాన్‌ను సమీక్షించి మార్గనిర్దేశం చేశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణను చూడొద్దన్నారు. 

రామగుండంలో ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు ఆర్‌ఎఫ్‌సీఎల్‌ మాతృసంస్థ ఎన్‌ఎఫ్‌ఎల్‌కు సంబంధించిన ఇతర ప్లాంట్ల నుంచి తెలంగాణకు ప్రతీరోజు ఒక రేకు యూరియాను సరఫరా చేసేలా చొరవ చూపాలని కోరారు. ఈ విషయంలో మీకేమైనా ఇబ్బందులుంటే కేంద్రంతో మాట్లాడి పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. సమీక్షలో స్పెషల్‌ సీఎస్‌ సంజయ్‌కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యూనిట్‌ హెడ్, జీఎం రాజీవ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement