
సాక్షి,హైదరాబాద్: ఒళ్లుగగూర్పొడిచే రీతిలో చోటు చేసుకున్న హైదరాబాద్ బోడుప్పల్ స్వాతి మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానం పెనుభూతమై, నిండు గర్భిణి అయిన భార్య స్వాతిని భర్త మహేందర్‌రెడ్డి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు మల్కాజ్‌గిరి డీసీపీ పద్మజా రెడ్డి వెల్లడించారు.
బోడుప్పల్ మర్డర్ కేసుపై డీసీపీ పద్మజారెడ్డి మీడియాతో మాట్లాడారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి, మహేందర్‌రెడ్డిలది ఒకే గ్రామం. ఏడాదిన్నర క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. స్వాతి పంజాగుట్టా కాల్ సెంటర్‌లో జాబ్ చేస్తోంది. మహేందర్‌రెడ్డి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 25రోజుల క్రితమే హైదరాబాద్‌కు వచ్చి బోడుప్పల్‌లోని ఈస్ట్ బాలాజీ హిల్స్‌లో ఉంటున్నారు.
పెళ్లైన మూడు,నాలుగు నెలల నుంచి చిన్న చిన్న విషయాలకే గొడవపడేవారు. స్వాతి కాల్‌సెంటర్‌లో పనిచేస్తోంది.నిత్యం ఫోన్‌లోనే ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. ఆ అనుమానంతోనే మొదటి సారి గర్భం వస్తే తీయించాడు. రెండో సారి గర్భం వచ్చినప్పుడు స్వాతిపై ఉన్న అనుమానం మహేందర్‌రెడ్డికి పెను భూతమైంది.
స్వాతి గర్భవతి. మెడికల్ చెకప్ తీసుకుకెళ్లమని అడిగింది.ఈ విషయంలో గొడవమొదలైంది. అది చిలికిచిలికి పెద్దదయ్యింది. ఈనెల 22న కూడా గొడవపడ్డారు. స్వాతిని హత్య చేయాలని ప్లాన్ చేశాడు. హత్యకు ముందే బోడుప్పల్‌లో హాక్సాబ్లేడ్ కొనుగోలు చేశాడు. ఇరువురు ఘర్షణలో మహేందర్‌రెడ్డి భార్య స్వాతిని కొట్టాడు. మహేందర్‌రెడ్డి కొట్టడం స్వాతి స్పృహ కోల్పోయింది. అనంతరం, ఆమెను గొంతు నులుమి హత్య చేశాడు.
చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత డెడ్‌బాడీని మాయం చేసేందుకు శతవిధాల ప్రయత్నించాడు. ప్రయత్నాలు విఫలం కావడంతో కాళ్లు,చేతులు,మొడెం ఇతర శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. శరీర భాగాల్ని కవర్‌లో ప్యాక్ చేశాడు. శరీర భాగాలున్న కవర్లను మూడుసార్లు మూసినదిలో పడేశాడు.
అనంతరం చెల్లికి ఫోన్ చేశాడు. తన భార్య అదృశ్యమైందని చెప్పాడు.ఫోన్ రావడంతో బావ మహేందర్‌రెడ్డి ఇంటికి వెళ్లాడు.చెల్లెలి భర్తకు మహేందర్‌రెడ్డిపై అనుమానం వచ్చింది. మహేందర్ కూడా మేడిపల్లిలో భార్యపై మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చి.. ఏమీ ఎరుగనట్టుగా ఉందామని యాక్టింగ్ చేశాడు. కానీ మా ఇన్‌స్పెక్టర్‌కు మహేందర్‌రెడ్డిపై అనుమానం వచ్చింది. మహేందర్‌రెడ్డిని ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ నిందితుడి ఇంట్లో మృతదేహం లభ్యమైంది.
తల,కాళ్లు,చేతులు,ఇతర శరీర భాగాలు లేని మొండాన్ని గుర్తించాం. ఆ మొండాన్ని డీఎన్‌ఏ టెస్టుకు పంపించి నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నాం. మా విచారణలో మహేందర్‌రెడ్డి తాను నేరం చేసినట్లు అంగీకరించాడు. మృతదేహం ముక్కలు ముక్కలు చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు. తల, కాళ్లు, చేతులు మూసీ నదిలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. మూసీ నది వద్దకు నిందితుడిని తీసుకొచ్చి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశాం. మూసీలో స్వాతి శరీరభాగాల ముక్కల కోసం వెతుకుతున్నాం’అని అన్నారు.