
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి యూరియా కొరతపై బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసి డ్రామాలాడుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. యూరియా ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని కేటీఆర్ అనడంలోనే వాళ్ల తీరు అర్థమవుతోందని విమర్శించారు.
యూరియా కోసం నాలుగుసార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్‌ను కలిశానని సీఎం రేవంత్ తెలిపారు. యూరియా పంపిణీ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయిలో మానిటరింగ్‌ను పెంచాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 23 వ తేదీ) గాంధీ భవన్‌లో మూడు గంటల పాటు జరిగిన పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడారు.
‘ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ప్రకటించినందుకు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం, పౌర హక్కులను కాపాడటం కోసం పని చేశారు. రాహుల్ గాంధీ, పార్టీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కులగణన చేపట్టాo. బీసీలకు విద్యా, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు మంత్రి వర్గంలో ఆమోదించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకున్నాం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు విడిగా మరో బిల్ తీసుకొచ్చాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారు. ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చాం. కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్సు తెచ్చాం.. దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారు. బీసీ లకు మేలు జరగాల్సిందే. రాహుల్ గాంధీ మాట నిలబడాలి. 90 రోజులలో రాష్ట్రపతి బిల్లులను ఆమోదించాలన్న అంశం పైన సుప్రీంకోర్టు లో మన రాష్ట్ర వాదనలు వినిపించడం కోసం ఇద్దరు న్యాయవాదులను నియమించాం. బీహార్ లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓట్ చోరీ పాదయాత్రకు ఈ నెల 26వ తేదీన హాజరవుతా’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.