
హైదరాబాద్: భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీని థర్డ్ గ్రేడ్ పార్టీ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెసేనని, మీకు థర్డ్ గ్రేడ్ పార్టీలా కనిపిస్తుందా? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎటువంటి పార్టీనో మీ తండ్రి కేసీఆర్‌ను అడిగితే చెబుతారన్నారు.
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దగ్గర గ్రూఫ్ పోటో దిగింది మర్చిపోయారా? అని మంత్రి కోమటిరెడ్డి నిలదీశారు. ‘మా పార్టీ పెట్టిన ఉపరాష్ట్రపతి అభ్యర్థిని దేశం మొత్తం హర్షిస్తుంది. సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు జడ్జిగా ఉంటూనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గళం ఎత్తిన న్యాయ కోవిదుడు. తెలంగాణ బిడ్డ ఉప రాష్ట్రపతి అవ్వడం మీకు ఇష్టం లేదు..మీ తెలంగాణ వాదం పై సందేహాలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ బిడ్డను వ్యతిరేకించిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించరు. లక్షల కోట్ల అవినీతి చేసి ఆ డబ్బు ఉందని కళ్ళు నెత్తికెక్కి కాంగ్రెస్ పై మాట్లాడుతున్నావ్. అహంకారపూరితమైన మాటలు ఇక మాట్లాడకు. దేశం కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబం పై చులకనగా మాట్లాడడం..అమెరికాలో చదివిన మీ విజ్ఞతకు వదిలేస్తున్న. నాడు ప్రపంచలోనే ద బెస్ట్ పిఎం అనిపించుకున్నారు రాజీవ్ గాంధీ.
రాజకీయంతో సంబంధం లేకుండా దేశ ఐక్యత కోసం భారత్ జోడో యాత్ర చేశారు రాహుల్ గాంధీ. యూరియా ఎందుకు రావట్లేదో అంత మాత్రం తెలియదా?, కేంద్రం ఇవ్వాల్సింది ఇవ్వకుండా చేస్తుంటే అది మాట్లాడక పోగా.. అజ్ఞానంతో మాట్లాడుతున్నావ్’ అని ప్రశ్నించారు.