
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కింది. తెలంగాణ సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ నేతలు నిరసనలకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో సచివాలయం వద్దకు బీజేపీ నేతలు రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆరు జిల్లా బీజేపీ నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలోనే సచివాలయం వద్దకు చేరుకున్నారు. అయితే, బీజేపీ నేతల నిరసనల నేపథ్యలంలో సచివాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిరసనలకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వాహనాల్లో వారిని అక్కడి నుంచి తరలించారు.
ఇక, హైదరాబాద్‌లో కరెంట్ తీగలు తగిలి ఇటీవల మరణాలు, డ్రైనేజీ సమస్యలు, గుంతల రోడ్ల అంశాలపై బీజేపీ నిరసనకు దిగింది. జీహెచ్‌ఎంసీ, హైడ్రా, జలమండలి విభాగాల మధ్య కో-ఆర్డినేషన్ లేక ఎక్కడి సమస్యలు అక్కడే అంటూ బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిరసనల నేపథ్యంలో ఇప్పటికే గ్రేటర్ పరిధిలో పలువురు బీజేపీ కార్పొరేటర్లు, నేతలను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు.