రౌడీషీటర్ దారుణ హత్య
పహాడీషరీఫ్: రౌడీషీటర్ దారుణ హత్యకు గురైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాహిన్‌నగర్ వాదే సాల్హె హీన్ ప్రాంతానికి చెందిన ఫరూక్ కుమారుడు షేక్ అమీర్ (32) రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎం.ఎం.పహాడీలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి పలు హత్య కేసులు, దొంగతనాలలో ప్రమేయం ఉండడంతో జైలు జీవితం సైతం అనుభవించాడు. ఇతనిపై అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ సైతం నమోదైంది. ఈ క్రమంలోనే పోలీసులు నగర బహిష్కరణ చేసి, స్థానికంగా ఉండకూడదని హెచ్చరించారు. ఈ నెల 13న వాదే సాల్హె హీన్‌లో నివాసం ఉంటున్న సోదరుడు ఫరీద్ ఇంటికి వచ్చి.. తాను రెండు నెలల కోసం రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు వెళ్తున్నట్లు, ఖర్చుల నిమిత్తం డబ్బులు కావాలని కోరాడు. సాయంత్రం సమకూరుస్తానని చెప్పడంతో తన స్నేహితులు సయ్యద్ అమన్, హుస్సేన్‌లో కలిసి బైక్‌పై బయటికి అమీర్ బయల్దేరాడు. శనివారం అర్ధరాత్రి సమయంలో షాహిన్‌నగర్ ప్రధాన రహదారిలోని నహదీ హోటల్ ప్రాంతంలో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్‌లు ధరించి అమీర్‌పై కత్తులతో కడుపు, వీపు భాగాల్లో ఐదుసార్లు పొడిచి పరారయ్యారు. ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మహేశ్వరం ఏసీపీ జానకీ రెడ్డి, పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్‌రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకొని హత్య జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. పాత కక్షల కారణంగానే బాలాపూర్ ప్రాంతానికి చెందిన అహ్మద్ ఇమాద్ తన ఐదుగురు అనుచరులతో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


