
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ గాంధీ దేశ యువతకు స్ఫూర్తి అని కొనియాడారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ అమరుడు అయ్యారని రేవంత్ చెప్పుకొచ్చారు. రాజీవ్ గాంధీ స్పూర్తితో తెలంగాణలో పరిపాలన కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
నేడు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. ఈ సందర్బంగా తెలంగాణ సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి రేవంత్, కాంగ్రెస్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘దేశ సమగ్రతను కాపాడేందుకు రాజీవ్ గాంధీ అమరుడయ్యారు. దేశానికి సాంకేతిక నైపుణ్యాన్ని కృషి చేసిన పునాదులు వేసిన నేత రాజీవ్ గాంధీ. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రాజీవ్ గాంధీ కల్పించారు.

రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవ్వగానే 21ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే విధంగా అసెంబ్లీలో బిల్లు పెడతాం. దేశ కలలు సహకారం కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాల్సిందే. స్థానిక సంస్థల్లో చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన నేత రాజీవ్ గాంధీ. సిలికాన్ వ్యాలీని ఈరోజు మహిళలలు నడుపుతున్నారు అంటే రాజీవ్ ఘనతే. నేటి యువతకు ఆయన స్పూర్తి ప్రదాత. రాజీవ్ స్పూర్తితో తెలంగాణలో పరిపాలన కొనసాగిస్తున్నాం. ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అలాగే, మూసీ ప్రక్షాళనను మన ప్రభుత్వం చేయబోతోంది అని చెప్పుకొచ్చారు.