రాజధాని భూ సమీకరణపై సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటి ప్రశ్న
రైతులకు ఇప్పటికీ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వనే లేదు
మౌలిక వసతుల కల్పనకు ఎకరానికి రూ.2 కోట్లు అవుతుందని చెప్పారు
అంటే, లక్ష ఎకరాల రాజధానికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది
నిర్మాణ పనుల్లో అంచనాలు భారీగా పెంచేస్తున్నారు
అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించి, భారీగా కమీషన్లు దండుకుంటున్నారు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఈ దశాబ్దంలో అతిపెద్ద స్కామ్
ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ సిబ్బంది, జీతాలిచ్చేది
ప్రభుత్వం.. కానీ, లాభాలేమో ప్రైవేటు వ్యక్తులకా? అని నిలదీసిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో తొలి దశలో భూసమీకరణ కింద తీసుకున్న 50 వేల ఎకరాల్లో ఇప్పటికీ అభివృద్ధి పనులు చేయకుండా... రెండో దశలో 50 వేల ఎకరాలను ఎందుకు సమీకరిస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. అమరావతి నిర్మాణం ఓ స్కామ్ అన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. రాజధాని తొలి దశలో భూములిచ్చిన రైతులకు ఇప్పటికీ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండానే రెండో దశ భూ సమీకరణ చేస్తుండడంపై మీ స్పందన ఏమిటని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానమిచ్చారు. ‘‘చంద్రబాబు, ఆయన బినామీలు భూములు కాజేసిన తర్వాతే రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారు.
అనంతరం తొలి దశలో 50 వేల ఎకరాలు సమీకరించారు. ఆ భూముల్లో రాజధాని నిర్మించాలంటే తాగునీరు, రహదారులు, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్లు అవసరమని గతంలో కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇచ్చింది. రెండో విడతలో 50 వేల ఎకరాలు తీసుకుంటే, వాటిలో సదుపాయాలకు ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున మరో రూ.లక్ష కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది.
అంటే, రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. కానీ, ఇప్పటికీ తొలి దశలో భూములిచ్చిన రైతులకు ఏ హామీలను అమలు చేయలేదు. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు’’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు, ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడ కూర్చొని కార్యకలాపాలు నిర్వహిస్తే అదే రాజధాని. చంద్రబాబు రివర్ బేసిన్‌లో రాజధాని కడుతున్నారు. దీనిపై సుప్రీంకోర్టు దృష్టిపెట్టాలి. కేవలం చంద్రబాబు, ఆయన బినామీలు కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికే రివర్ బేసిన్‌లో రాజధాని నిర్మిస్తున్నారు’’ అని మండిపడ్డారు.
రాజధాని ఓ పెద్ద స్కామ్
రాజధాని నిర్మాణ పనుల్లో అంచనా వ్యయాలు భారీగా పెంచేసి, అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించి, భారీగా కమీషన్లు తీసుకుంటున్నారని, రాజధాని ఓ పెద్ద స్కామ్ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన బినామీలు కాజేసిన భూముల ధరలు పెంచుకోవడానికే పల్లపు ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారని పునరుద్ఘాటించారు. విజయవాడ–గుంటూరు మధ్య జాతీయ రహదారికి సమీపంలో రాజధాని నిర్మించి ఉంటే ఈ పాటికే మహానగరంగా అభివృద్ధి చెందేదని వివరించారు. మీ హయాంలో అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు మీకంటే చంద్రబాబు ఎక్కువ అప్పులు చేస్తోంది. మరి ఇప్పుడు రాష్ట్రం ఏమౌతుంది అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మీరే చెప్పండని వైఎస్ జగన్ అన్నారు. దక్షిణ సుడాన్, సోమాలియానో అవుతుందని అన్నారు.
ఈ దశాబ్దంలోనే అతి పెద్ద స్కామ్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఈ దశాబ్దంలోనే అతి పెద్ద స్కామ్ అని వైఎస్ జగన్ అన్నారు. ‘‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ టెండర్లు రాకపోవడం సంతోషకరం. ప్రైవేటీకరణపై న్యాయ పోరాటం చేస్తున్నాం. నిన్ననే (జనవరి 7న) హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశాం. దాన్ని కోర్టు ఆమోదించింది. ప్రభుత్వానికి నోటీసులిచ్చింది’’ అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘కట్టినవి, దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నవి, సగం పూర్తయినవి... ఉచితంగా ఇవ్వడమే కాక, రెండేళ్ల పాటు నడిపేందుకు సంబంధించిన జీతాలు సంవత్సరానికి రూ.60 కోట్లు, రెండేళ్లకు రూ.120 కోట్లు ఒక్కో కాలేజీకి చంద్రబాబు ఇస్తాడంట.
ప్రభుత్వ భూమి, ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ సిబ్బంది.. జీతాలు ఇచ్చేది ప్రభుత్వం.. కానీ, లాభాలేమో ప్రైవేటు వ్యక్తలకంట. ఇది స్కామ్ కాకపోతే ఏంటి? ఇలాంటి స్కాముల్లో నిజంగా ఎవరైనా భాగస్వాములవుతారా?’’ అని ప్రశ్నించారు. ‘‘తొలుత కిమ్స్ వాళ్లు టెండర్ వేశారని చెప్పి డబ్బా కొట్టుకున్నారు. కిమ్స్ వాళ్లు అదేమీ లేదు. ఆ స్కాముల్లో మాకు సంబంధం లేదని వెనక్కి తప్పుకొన్నారు. వీళ్లకు ఏం చేయాలనో దిక్కు తెలీలేదు. ఎల్లయ్యతోనో, పుల్లయ్యతోనో, వంట మనుషులతోనో టెండర్లు వేయిస్తున్నారు.
వాళ్లకైనా సరే నేను ఇస్తానంటున్నాడు చంద్రబాబు’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘‘ఛత్తీస్‌గఢ్‌లో కూడా బీజేపీ ప్రభుత్వమే కదా ఉంది... అక్కడ 13 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను మొన్ననే ప్రారంభించారు. కొత్త మెడికల్ కాలేజీలు ఎవరైనా పెట్టాలనుకుంటే దరఖాస్తులు పెట్టుకుంటే ఇస్తారు. అదొక పద్ధతి. భూములు కొనుక్కో, భవనాలు కట్టుకో, అన్ని రకాలుగా చేసుకో, ప్రభుత్వం నీకు సహకరిస్తుంది. ఇదొక పద్ధతి. కానీ, ఈ మాదిరిగా స్కాములు చేస్తూ, ఇప్పటికే ప్రభుత్వం కట్టిన భవనాలను ప్రైవేటువాళ్లకు ఊరికే ఇచ్చేయడం, సిబ్బంది జీతాలు కూడా ప్రభుత్వమే ఇవ్వడం వంటివి ఎవడూ చేయడు. ఏ ప్రభుత్వమూ చేయదు’ అంటూ వైఎస్ జగన్ స్పష్టం చేశారు.


