హజ్‌ కమిటీలో బాబు అపవిత్ర రాజకీయం | Irregularities in the Appointment of the Andhra Pradesh Haj Committee | Sakshi
Sakshi News home page

హజ్‌ కమిటీలో బాబు అపవిత్ర రాజకీయం

Apr 13 2026 6:05 AM | Updated on Apr 13 2026 6:05 AM

Irregularities in the Appointment of the Andhra Pradesh Haj Committee

ఆంధ్రప్రదేశ్‌ హజ్‌ కమిటీ నియామకంలో తప్పు మీద తప్పు 

నిబంధనలకు పాతరేసి టీడీపీ నేతలతో నియామకాలు 

గతేడాది ఇచ్చిన జీవోలో ధార్మిక ప్రతినిధుల పేరుతో పార్టీ నేతలకు చోటు

దీనిపై అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించిన ముస్లిం సంఘాలు 

4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

అయినా ఖాతరు చేయని ప్రభుత్వం

జాప్యం చేసి ఏడాది తర్వాత పాత కమిటీని మార్చుతూ కొత్తగా జీవో జారీ

ఈసారి పదవీకాలం ముగిసిన స్థానిక సంస్థల నుంచి ముగ్గురిని నియమించి మళ్లీ తప్పు

మరోసారి న్యాయ పోరాటానికి సిద్ధపడుతున్న ముస్లిం సంఘాలు

సాక్షి, అమరావతి: పవిత్ర హజ్‌ కమిటీ నియామకంలో చంద్రబాబు ప్రభుత్వం అపవిత్ర రాజకీయం చేస్తోంది. హజ్‌ కమిటీ చట్టం–2002 నియమ నిబంధనలను గతేడాది యథేచ్ఛగా ఉల్లంఘించింది. కమిటీలో ధార్మిక ప్రతినిధులుగా పేర్కొంటూ ఇద్దరు టీడీపీ నేతలను నియమించింది. దీనిపై ముస్లిం సంఘాలు అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఏడాది అనంతరం పాత జీవో స్థానంలో మరో జీవోను బాబు ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఈ నియామకంలోని కూడా ప్రభుత్వం అదే తప్పు చేసింది. ఈసారి స్థానిక సంస్థల ప్రతినిధుల పేరుతో పదవీకాలం ముగిసిన ముగ్గురు టీడీపీ నేతలను నియమించింది. దీనిపై ముస్లిం సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. దీనిపై మళ్లీ న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

టీడీపీ నేతలే ధార్మిక ప్రతినిధులా?
ఏపీ హజ్‌ కమిటీనీ నియమిస్తూ ప్రభుత్వం గతేడాది ఏప్రిల్‌ 16న జీవో 38 జారీ చేసింది. ఏపీ హజ్‌ కమిటీ చట్టం–2002 సెక్షన్‌ 18(1), (2) ప్రకారం చేపట్టిన ఈ నియామకంలో సబ్‌ క్లాజ్‌–3 ప్రకారం ముగ్గురు ధార్మిక పండితులను నియమించాల్సి ఉంది. అయితే ధార్మిక పండితులను నియమించకుండా వారి పేరుతో టీడీపీ ప్రతినిధులైన పఠాన్‌ ఖాదర్‌ ఖాన్, షేక్‌ హసన్‌ బాషాలను నియమించడం వివాదాస్పదమైంది. దీంతో బాబు ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించిందని రాజమహేంద్రవరానికి చెందిన షేక్‌ నిజాముద్దీన్‌ హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ చేసిన హైకోర్టు 4 వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని గతేడాది జూన్‌ 21న ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఆదేశం అమలును ప్రభుత్వం జాప్యం చేసి ఈ ఏడాది మార్చి 29న జీవో 34ను జారీ చేసింది. అయితే కొత్తగా నియమించిన హజ్‌ కమిటీలోనూ చంద్రబాబు ప్రభుత్వం అదే తప్పు పునరావృతం చేసింది. ఈ ఏడాది మార్చి 29న ఇచ్చిన జీవో 34లో స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఉన్న షేక్‌ అబ్దుల్‌ హుస్సేన్, రమేష్‌ పర్వీన్, షేక్‌ జబీన్‌లను కమిటీలో నియమించింది. రాష్ట్రంలో మునిసిపాలిటీలకు, పంచాయతీలకు పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవో ఇచ్చే నాటికి వారు పదవిలో ఉన్నప్పటికీ.. పదవీకాలం అయిపోయిన తర్వాత కూడా కొత్త కమిటీలో ఎలా కొనసాగిస్తారని ముస్లిం సంఘాలు కొత్త జీవోను తప్పుపడుతున్నాయి. దీనిపై న్యాయ­పోరాటానికి మళ్లీ సిద్ధపడుతున్నాయి.

నిబంధనలను ఉల్లంఘిస్తారా?
పవిత్రమైన హజ్‌ కమిటీ నియామకంలో టీడీపీ ప్రతినిధులను నియమించుకోవడం కోసం చట్టంలోని నియమ నిబంధనలను ఉల్లంఘిస్తారా? గత జీవోలో ధార్మిక పండితుల పేరుతో ఇస్లామిక్‌ ధర్మశాస్త్రంపై ఎటువంటి అవగాహన లేని టీడీపీ నేతలను నియమించారు. ఇప్పుడు జీవోలో పదవీకాలం ముగిసిపోయిన వారిని కమిటీలో ఎలా కొనసాగిస్తారు? –షేక్‌ గౌస్‌ లాజమ్, ఏపీ హజ్‌ కమిటీ మాజీ చైర్మన్‌

హజ్‌ కమిటీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన జగన్‌
వైఎస్సార్‌సీపీ హయాంలో ఏపీ హజ్‌ కమిటీ నియామకం పారదర్శకంగా చేపట్టారు. హజ్‌ కమిటీ పనితీరులోను వైఎస్‌ జగన్‌ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఏపీ హజ్‌ కమిటీ చట్టం–2002లోని సెక్షన్లకు లోబడి నియామకం చేపట్టడంలో నిబంధనలు పాటిస్తూ ఏ ఒక్క విమర్శకు కూడా తావులేకుండా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం హజ్‌ కమిటీ నియామకంలో తప్పు మీద తప్పు చేస్తోంది. చివరకు కోర్టు ధిక్కారం కేసు నుంచి బయటపడేందుకు ఇచ్చిన కొత్త జీవోలోనూ నిబంధనలు ఉల్లంఘించింది. – ఇస్సాక్‌ బాషా, ఎమ్మెల్సీ, హజ్‌ కమిటీ మాజీ సభ్యుడు

కూటమిలో ముస్లిం ప్రతినిధులు మూగబోయారా?
హజ్‌ కమిటీ నియామకంలో చంద్రబాబు ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తుంటే..కూటమిలోని ముస్లిం ప్రతినిధులు మూగ­బోయారా? నిబంధనలను అతిక్రమిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలపై మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్, మైనారిటీ సలహాదారు ఎంఏ షరీఫ్, ముస్లిం నేతలు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? వెంటనే జీవో 34ను రద్దు చేసి నిబంధనల మేరకు నియామకాలు చేపట్టకపోతే న్యాయ పోరాటం చేస్తాం. –షేక్‌ నాగుల్‌ మీరా, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement