Noida: కార్మికుల తిరుగుబాటు.. కలెక్టర్ కీలక నిర్ణయం! | Workers salary hike protest in Noida turns violent | Sakshi
Sakshi News home page

Noida: కార్మికుల తిరుగుబాటు.. కలెక్టర్ కీలక నిర్ణయం!

Apr 13 2026 10:51 AM | Updated on Apr 14 2026 8:37 AM

Workers salary hike protest in Noida turns violent

గ్రేటర్ నోయిడా: జీతాలు పెంచాలంటూ గ్రేటర్ నోయిడా(యూపీ)లో కార్మికులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఫేజ్ 2 పారిశ్రామిక ప్రాంతంలో వరుసగా నాలుగో రోజు జరుగుతున్న ఈ నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. ఆగ్రహంతో రగిలిపోయిన కార్మికులు పోలీసుల వాహనాలను బోల్తా కొట్టించి, రాళ్ల దాడికి దిగడంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. అదుపు తప్పుతున్న పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
 

హింసను అరికట్టేందుకు స్థానిక యంత్రాంగం భారీ సంఖ్యలో పోలీసులను మోహరించింది. ఆందోళనకారులు పలు కంపెనీల ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు, ఒక వాహనానికి నిప్పు పెట్టారు. ఈ అల్లర్ల నేపథ్యంలో గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా కలెక్టర్ మేధా రూపమ్‌ కార్మికులకు ఒక విజ్ఞప్తి చేశారు. ఎలాంటి వదంతులు నమ్మవద్దని, శాంతియుతంగా విధులకు హాజరు కావాలని కోరారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఫ్యాక్టరీ యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి, కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.

కార్మికుల సంక్షేమం కోసం జిల్లా యంత్రాంగం పలు కఠిన నిబంధనలను ప్రకటించింది. ఇకపై ఓవర్ టైమ్ చేస్తే ఎటువంటి కోతలు లేకుండా రెట్టింపు వేతనం చెల్లించాలని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరికీ వారాంతపు సెలవు తప్పనిసరి చేస్తూ, ఒకవేళ ఆదివారం పనికి పిలిచినా డబుల్ పేమెంట్ ఇవ్వాలని ఆదేశించింది. నిబంధనల ప్రకారం నవంబర్ 30 లోగా బోనస్ మొత్తాన్ని నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. మహిళల భద్రత కోసం ప్రతి ఫ్యాక్టరీలో కంప్లైంట్ బాక్సులు, మహిళల నేతృత్వంలో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు ఏర్పాటు చేయాలి. ప్రతి నెలా 10వ తేదీలోగా జీతాలు చెల్లించి, శాలరీ స్లిప్పులు తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కార్మికుల ఫిర్యాదుల పరిష్కారానికి, తక్షణ సహాయం కోసం 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: బీజేపీని భరించడం కష్టం: ‘దీదీ’ చెంతకు నేతాజీ వారసుడు

Advertisement
 
Advertisement
Advertisement