బీజేపీని భరించడం కష్టం: ‘దీదీ’ చెంతకు నేతాజీ వారసుడు | Netaji's Grandson Chandra Kumar Bose Joins TMC | Sakshi
Sakshi News home page

బీజేపీని భరించడం కష్టం: ‘దీదీ’ చెంతకు నేతాజీ వారసుడు

Apr 13 2026 8:57 AM | Updated on Apr 13 2026 9:28 AM

Netaji's Grandson Chandra Kumar Bose Joins TMC

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అత్యంత ఉత్కంఠభరితంగా మారిన ఈ పోరులో బీజేపీకి ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబం నుంచి వచ్చిన కీలక నేత, ఆయన మనుమడు చంద్ర కుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరారు. బీజేపీ సిద్ధాంతాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తూ, టీఎంసీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా చంద్ర కుమార్ బోస్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. నాడు బ్రిటిష్ వారు అవలంబించిన విభజించు, పాలించు విధానాన్నే నేడు బీజేపీ పాటిస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటూ, ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని విమర్శించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, శరత్ చంద్రబోస్ తదితరులు తీవ్రంగా వ్యతిరేకించిన మత రాజకీయాలను బీజేపీ ప్రోత్సహిస్తుండటం ఏమాత్రం అంగీకారం కాదని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, కేవలం సిద్ధాంతపరమైన విభేదాల వల్లే తాను తొమ్మిదేళ్ల బంధాన్ని తెంచుకుని, బీజేపీకి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.
 

దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న బీజేపీ విధానాలను భరించలేకే ఆ పార్టీని వీడానని, లౌకికవాదం, అందరినీ కలుపుకుపోయే తత్వం ఉన్న టీఎంసీ విధానాలు నచ్చడంతోనే ఆ పార్టీలో చేరానని చంద్ర కుమార్ బోస్ వివరించారు. రాబోయే ఎన్నికల్లో దీదీ మరోసారి ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కాగా ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతలుగా బెంగాల్ ఎన్నికలు జరగనుండగా మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. గత 2021 ఎన్నికల్లో 213 స్థానాలతో అఖండ విజయం సాధించిన టీఎంసీకి, 77 స్థానాలతో బలపడిన బీజేపీకి మధ్య ఈసారి హోరాహోరీ పోరు జరగనుంది. ఈ తరుణంలో నేతాజీ వారసుడు టీఎంసీలో చేరడం ఆ పార్టీ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. 

ఇది కూడా చదవండి: ఇరాన్ యుద్ధం: ‘ఐఎంఎఫ్’ తీవ్ర హెచ్చరిక

Advertisement
 
Advertisement
Advertisement