కొత్త విధానానికి తెరలేపిన కార్పొరేట్ స్కూళ్లు
ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నిర్దేశిత సమయంలోగా ఫీజు చెల్లించకపోతే వడ్డీతో కలిపి దాన్ని చెల్లించాలనే కొత్త విధానానికి కార్పొరేట్ స్కూళ్లు తెరలేపాయి. విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆర్థికస్థితిని బట్టి విద్యా సంవత్సరం ప్రారంభంలోనో, మధ్యలోనో, చివరిలోనో ఫీజులు చెల్లిస్తుంటారు. ఆర్థిక భారంతో సతమతమవుతున్న వీరికి గుండెల్లో గునపాలు గుచ్చేవిధంగా విద్యాసంవత్సరం ప్రారంభం కాకుండానే ఫీజు చెల్లించాలని గడువు విధించడం, నిర్దేశిత సమయంలోపు చెల్లించకపోతే వడ్డీ విధిస్తామని చెబుతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
అకడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే...
సాధారణంగా విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాతే స్కూళ్లు ఫీజులు వసూలు చేస్తుంటాయి. విద్యా సంవత్సరంలో టర్మ్ ఫీజులను తల్లిదండ్రులు తమ ఆర్థిక వెసులుబాటును బట్టి చెల్లిస్తుంటారు. పాఠశాలల్లో ఇప్పటివరకు సంవత్సరాంతపు పరీక్షలు కూడా జరగలేదు. వేసవి సెలవులూ ఇవ్వలేదు. అప్పుడే వచ్చే విద్యా సంవత్సరానికి ఫీజులు కట్టడమేమిటని, లేకపోతే వడ్డీ పడుతుందని చెప్పడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
చట్టపరంగా ఎదుర్కొంటాం
ఫీజు చెల్లింపు ఆలస్యమైతే బ్యాంకు వడ్డీ విధిస్తామనడం తాము ఎన్నడూ చూడలేదని, దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. కాగా, ఫీజు కట్టకుంటే వడ్డీ అనే విధానం పూర్తిగా చట్ట విరుద్ధమని తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు చెప్పారు. ఇటువంటి వి«ధానం అవలంబిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు చేపడతామని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే ఫీజులు కట్టించుకోవడం నేరమన్నారు. అంతేగాక గడువు విధించి ఆ సమయానికి ఫీజు చెల్లించకపోతే వడ్డీ సహా చెల్లించాలని చెప్పడం కూడా తప్పేనని స్పష్టం చేశారు. ఇలా మెసేజ్‌లు పంపే స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బ్యాంక్ వడ్డీ రేట్ల ప్రకారం చార్జీలు విధిస్తాం
రాజమహేంద్రవరంలోని పిడింగొయ్యి ప్రాంతంలోని ఓఎన్‌జీసీ బేస్ కాంప్లెక్స్ సమీపంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులకు ఈ వింత పరిస్థితి ఎదురైంది. ఇంకా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఫస్ట్ టర్మ్ ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం వివాదాస్పదంగా మారింది. ఇటీవల తల్లిదండ్రులకు పంపిన వాట్సాప్ మెసేజ్‌లో ‘2026 ఏప్రిల్ 10 లోపు ఫీజులు చెల్లించాలి. ఆలస్యమైతే బ్యాంకు వడ్డీ రేట్ల ప్రకారం అదనపు చార్జీలు విధిస్తాం’ అని స్పష్టంగా పేర్కొంది. ఈ స్కూల్ విధించిన కొత్త నిబంధనేదో బాగుందని భావించిన మిగిలిన కొన్ని పాఠశాలల యాజమాన్యాలు కూడా ‘వడ్డీ’ విధానాన్ని అవలంబించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


