Viktor Orban.. హంగేరీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హంగేరీలో దశాబ్ద కాలానికి పైగా సాగిన విక్టర్ ఓర్బన్ శకానికి తెరపడింది. హంగేరీ సార్వత్రిక ఎన్నికల్లో విక్టర్ ఓర్బన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. యువ నాయకుడు పీటర్ మాగ్యార్ ఘటన విజయం అందుకున్నారు. అయితే, విక్టర్‌కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పుతిన్ సన్నిహితుడిగా పేరుంది.
తాజాగా జరిగిన హంగేరీ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. అక్కడి 199 స్థానాలు గల శాసనసభలో ‘టిస్జా’ పార్టీకి చెందిన పీటర్ మాగ్యార్ ఘన విజయం అందుకున్నారు. ఓట్ల లెక్కింపు తుది దశకు వచ్చేసరికి టిస్జా పార్టీ మూడింట రెండు వంతుల మెజారిటీతో ఏకంగా 138 స్థానాలను కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. బుడాపెస్ట్‌లోని డాన్యూబ్ నది ఒడ్డున చేరిన వేలాది మంది మద్దతుదారుల మధ్య మాగ్యార్ తన విజయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నారు. తాము విజయం సాధించినట్టు నినాదాలు చేస్తున్నారు. కాగా, పీటర్ మాగ్యార్ ప్రభంజనంతో హంగేరీలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పీటర్ మాగ్యార్ ఈ ఎన్నికల్లో విజయ కేతనంతో హంగేరీ రాజకీయాలను మలుపు తిప్పారు.
భావోద్వేగ ప్రకటన..
ఇక, హంగేరీలో గత 16 ఏళ్లుగా తిరుగులేని నాయకుడిగా విక్టర్ ఓర్బన్‌కు పేరుంది. అయితే, దేశంలో పెరుగుతున్న ఆర్థిక మందగమనం ప్రజల్లో ఆయన పట్ల అసంతృప్తిని పెంచింది. ఓర్బన్ విధానాల వల్ల హంగేరీ అంతర్జాతీయంగా ఒంటరి అయిందనే భావన హంగేరీ ప్రజల్లో నెలకొంది. ఈ క్రమంలో ఆయనకు వ్యతిరేకంగా మాగ్యార్ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా నిలబడటం, ప్రజాస్వామ్య సంస్కరణల దిశగా అడుగులు వేస్తానని హామీ ఇవ్వడంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఓటమి అనంతరం, ఓర్బన్ భావోద్వేగ ప్రకటన చేశారు. ఈ ఫలితాలు మాకు చాలా బాధాకరమైనవి, కానీ ప్రజల తీర్పు స్పష్టంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు.
పుతిన్ సన్నిహితుడిగా..
ఇదిలా ఉండగా.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు విక్టర్ ఓర్బన్ సన్నిహితుడిగా పేరుంది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో ఉక్రెయిన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్‌ను శత్రువుగా చూపించారు. అంతకుముందు కూడా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల్లో ఆయన మార్క్ కనిపించింది. గతంలో ఉక్రెయిన్‌కు అందాల్సిన 90 బిలియన్ యూరోల ($105 బిలియన్) రుణాన్ని ఓర్బన్ అడ్డుకున్నారు. అంతేకాకుండా యూరోపియన్ యూనియన్‌లో ప్రతికూల వైఖరి అనుసరించారు. తాజాగా పీటర్ మాగ్యార్ విజయంతో ఈయూలో హంగేరీ వ్యవహరిస్తున్న వైఖరికి తెరపడనుంది. దీంతో, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల్లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది.


