హంగేరీ కొత్త ’హీరో’ పీటర్ మాగ్యార్ ఎవరు? | Peter Magyar wins Hungary election | Sakshi
Sakshi News home page

హంగేరీ కొత్త ’హీరో’ పీటర్ మాగ్యార్ ఎవరు?

Apr 13 2026 9:41 AM | Updated on Apr 13 2026 11:12 AM

Peter Magyar wins Hungary election

బుడాపెస్ట్‌: యూరప్ రాజకీయాల్లో అగ్రదేశమైన హంగేరీలో ఊహించని రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రెండు దశాబ్దాలుగా తిరుగులేని నేతగా ఏకఛత్రాధిపత్యం వహించిన ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్‌కు అక్కడి ఓటర్లు ఊహించని షాక్ ఇచ్చారు. ఆదివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ నేత, 45 ఏళ్ల పీటర్ మాగ్యార్ నేతృత్వంలోని ‘తిస్సా’ పార్టీ ప్రభంజనం సృష్టించింది. దీంతో హంగేరీ నూతన ప్రధానిగా పీటర్ మాగ్యార్ ఎన్నికయ్యారు.

న్యాయశాస్త్రం అభ్యసించిన పీటర్ మాగ్యార్ ఒకప్పుడు ఓర్బన్ కు చెందిన ‘ఫిడెస్జ్’ పార్టీలోనే సుదీర్ఘకాలం పాటు  కొనసాగారు. బ్రస్సెల్స్‌లో దౌత్యవేత్తగా, ప్రభుత్వ సంస్థల్లో ఉన్నత పదవులు చేపట్టారు. అయితే గతంలో జరిగిన లైంగిక వేధింపుల కేసును కప్పిపుచ్చిన వ్యక్తికి ఓర్బన్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పీటర్ 2024లో ఆయనతో తెగతెంపులు చేసుకున్నారు. అదే ఏడాది ‘తిస్సా’ అనే కొత్త రాజకీయ ఉద్యమాన్ని స్థాపించి, యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికల్లో 30 శాతం ఓట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.

హంగేరీ ఎన్నికల ఫలితాలు కేవలం ఈ దేశంలోనే కాకుండా అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొత్తం 199 స్థానాలున్న హంగేరీ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 77 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం ప్రజలు మార్పు కోరుకుంటున్నారనడానికి అద్దం పట్టింది. కమ్యూనిస్ట్ పాలన అంతమైన తర్వాత ఇంతటి పోలింగ్ జరగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు లెక్కించిన 97.35 శాతం ఓట్లలో, టిస్జా పార్టీ ఏకంగా 53.6 శాతం ఓట్లతో 138 సీట్లను కైవసం చేసుకుని, మూడింట రెండొంతుల మెజారిటీ దిశగా దూసుకెళ్లింది.

మరోవైపు జాతీయవాద నేత ఓర్బన్‌కు చెందిన ‘ఫిడెజ్’ పార్టీ కేవలం 37.8 శాతం ఓట్లతో 55 సీట్లకే పరిమితమై దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. తన ఓటమి అత్యంత బాధాకరమైనప్పటికీ స్పష్టమైనదని అంగీకరించిన ఓర్బన్.. పీటర్ మాగ్యార్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బుడాపెస్ట్‌లోని డాన్యూబ్ నది తీరాన వేలాది మంది మద్దతుదారుల మధ్య పీటర్ మాగ్యార్ ఉద్వేగభరితంగా ప్రసంగిస్తూ, ఈ రాత్రి అబద్ధాలపై నిజం గెలిచిందని వ్యాఖ్యానించారు. దేశంలో పేరుకుపోయిన అవినీతిని అంతం చేసి, న్యాయవ్యవస్థకు, ఇతర సంస్థలకు పూర్తి స్వతంత్రతను తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ ఎన్నికల ఫలితం హంగేరీకే కాకుండా యూరోపియన్ యూనియన్, యుక్రెయిన్ భవిష్యత్తుకు అత్యంత కీలకం కానుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాన మిత్రుడిగా ఉన్న ఓర్బన్ ఓటమితో, పాశ్చాత్య దేశాలకు మరింత బలం చేకూరింది. ఓర్బన్ అడ్డుకుంటూ వస్తున్న, యుక్రెయిన్ కు ఇవ్వాల్సిన 90 బిలియన్ యూరోల రుణానికి ఇప్పుడు మార్గం సుగమం కానుంది. అలాగే, ప్రజాస్వామ్య విలువల ఉల్లంఘన కారణంగా హంగేరీకి యూరోపియన్ యూనియన్ నిలిపివేసిన నిధులు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అమెరికాకు చెందిన జేడీ వాన్స్ స్వయంగా వచ్చి ప్రచారం చేసినా, డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక మద్దతు ఇస్తామని ప్రకటించినా ఓర్బన్‌ను ప్రజలు గెలిపించకపోవడం గమనార్హం.

ఇది కూడా చదవండి: ఇరాన్ యుద్ధం: ‘ఐఎంఎఫ్’ తీవ్ర హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement