కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌ గూటికి ఆ ఎమ్మెల్యే? | Senior MLA Back To BRS Party Soon | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌ గూటికి ఆ ఎమ్మెల్యే?

Apr 13 2026 10:33 AM | Updated on Apr 13 2026 1:19 PM

Senior MLA Back To BRS Party Soon

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జీవన్‌రెడ్డి లాంటి సీనియర్‌ కాంగ్రెస్‌తో బంధం తెంచుకుని బీఆర్‌ఎస్‌లో చేరబోతుండడంతో ఆ పార్టీలో జోష్‌ నెలకొంది. అయితే మరో నేత కూడా ఇదే బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా.. ఆయన బహిరంగంగా చేసిన కామెంట్లే ఇందుకు నిదర్శనం. 

సీనియర్‌ నేత, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై గరం గరంగా ఉన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల ఆధారంగా ఆయన తిరిగి బీఆర్‌ఎస్‌ గూటికి చేరతారా? అనే చర్చ జోరందుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. 

నిజామాబాద్‌ జిల్లా సిద్ధాపూర్‌ రిజర్వాయర్‌ నిధుల విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఈ పరిణామంపై పోచారం రిజర్వాయర్‌ వద్ద బైఠాయించి మరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘బిల్లులు రాకపోతే ఎలా పని చేయాలని కాంట్రాక్టర్లు అంటున్నారు. అయినా వాళ్లను బతిమాలి పనులు చేయిస్తున్నాం. నా రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఏనాడూ చూడలేదు. నిధులు విడుదల చేయాలని సంబంధిత మంత్రిని 20 సార్లు అడిగా. ఇప్పుడు మంత్రులు కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు. వాళ్ల కాళ్లు మొక్కలా ఏంది?. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?’’ అని ప్రశ్నించారాయన.   

ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన పోచారం.. టీడీపీ, ఆ తర్వాత టీఆర్‌ఎస్‌(ప్రస్తుత బీఆర్‌ఎస్‌)లో చేరారు. అటుపై మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గానూ ఆయన పని చేశారు. అయితే.. 2024లో కాంగ్రెస్‌లో చేరి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమితులయ్యారు. అయితే.. ఆయన పార్టీ ఫిరాయించినట్లు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసినప్పటికీ స్పీకర్‌ మాత్రం ఆ పిటిషన్‌ కొట్టేశారు. గత కొంత కాలంగా కాంగ్రెస్‌ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తిరిగి బీఆర్‌ఎస్‌ గూటికి చేరతారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement