ఆశా భోంస్లే మృతి: ఛాతీ ఇన్ఫెక్షన్లు ఎందుకంత ప్రమాదకరం.. | Asha Bhosle Reason Of Demise Why Chest Infections Are So Dangerous | Sakshi
Sakshi News home page

ఆశా భోంస్లే మృతి: ఛాతీ ఇన్ఫెక్షన్లు ఎందుకంత ప్రమాదకరం..

Apr 12 2026 5:28 PM | Updated on Apr 12 2026 6:15 PM

Asha Bhosle Reason Of Demise Why Chest Infections Are So Dangerous

ప్రముఖ గాయని ఆశా భోంస్లే 92 ఏళ్ల వయసులో ఛాతీ ఇన్ఫెక్షన్‌తో కన్నుమూశారు. వృద్ధుల్లో శ్వాసకోశ వ్యాధులు ఎంత తీవ్రతరంగా ఉంటాయి, అలాగే సత్వరమే చికిత్స అందించడం ఎంత కీలకం అని చెప్పే ఘటన ఇది. నిజానికి గాయని ఆశా ఛాతీ ఇన్ఫెక్షన్‌ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరి..చికిత్స పొందుతూ మరణించారు. ఈ నేపథ్యంలో ఈ ఛాతీ ఇన్ఫెక్షన్‌ అంత ప్రమాదకరమైనదా..?, వయసు పైబడిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.

ఆశా భోంస్లేని తీవ్రమైన అలసట, శ్వాసకోశ సమస్యలతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ సమస్యలకు ఛాతీ ఇన్ఫెక్షన్ కారణమని వైద్యులు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించినా..వయసు పైబడటంతో ఆ ఇన్ఫెక్షన్‌ శరీరంపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించి చివరికి ఆశా భోంస్లే మరణానికి దారితీసిందని వెల్లడించారు వైద్యులు.

ఛాతీ ఇన్ఫెక్షన్ అంటే..
ఛాతీ ఇన్ఫెక్షన్ అనేది ఊపిరితిత్తులు లేదా శ్వాసనాళాలకు సోకే ఇన్ఫెక్షన్. వీటిలో సర్వసాధారణమైన రకాలు శ్వాసనాళాల ఇన్ఫెక్షన్ అయిన బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల కణజాల ఇన్ఫెక్షన్ అయిన న్యుమోనియా. ఈ పరిస్థితులు శరీరంలో వాపు, శ్లేష్మం పేరుకుపోవడం, దగ్గు, ఆయాసం, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడానికి కారణమవుతాయి. 90 ఏళ్లు పైబడిన వారిలో, ఒక 'సాధారణ' ఛాతీ ఇన్ఫెక్షన్  సైతం కూడా ప్రాణాంతకం కావచ్చు.

ప్రభావం ఎలా ఉంటుందంటే..

  • ఊపిరితిత్తుల పనితీరు తగ్గడం వల్ల శరీరానికి ఆక్సిజన్ అందించడం కష్టమవుతుంది

  • బలహీనమైన కండరాలు దగ్గడం, యు శ్లేష్మాన్ని తొలగించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి

  • తక్కువ రోగనిరోధక శక్తి కోలుకోవడాన్ని నెమ్మదింపజేస్తుంది

  • శరీరంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోవడంతో గుండెపై భారం పెరుగుతుంది

ఈ పరిస్థితుల్లో, శరీరం తరచుగా తన శక్తిలో ఎక్కువ భాగాన్ని కేవలం శ్వాస తీసుకోవడానికి, ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి మాత్రమే ఉపయోగించే స్థితిలోకి వెళుతుంది. దీనివల్ల ఇతర అవయవాలకు శక్తి నిల్వలు చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా బహుళ అవయవాల ఫెయిల్యూర్‌కి దారితీస్తుంది. అందుకే తీవ్రమైన అలసట (నీరసం) వంటి లక్షణాలు కేవలం దుష్ప్రభావాలు మాత్రమే కావు, అవి శరీరం తీవ్రమైన ఒత్తిడికి గురవుతోందని చెప్పే సూచన అని అంటున్నారు ఆరోగ్య నిపుణలు.

ఇక్కడ ఆశా భోంస్లే విషయంలో ఇన్ఫెక్షన్‌తో పాటు అప్పటికే తీవ్రమైన అలసటతో బాధపడుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ రెండిటి కలయిక రోగి పరిస్థితిని క్రిటికల్‌ చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఈ ఛాతీ ఇన్‌ఫెక్షన్లు రాత్రికి రాత్రే తీవ్రం కావడం చాలా అరుదు. అవి తరచుగా తేలికపాటి, సులభంగా గుర్తించలేని లక్షణాలతో ప్రారంభమవుతాయి. వృద్ధులలో, దీర్ఘకాలిక దగ్గు, స్వల్ప శ్వాస ఇబ్బంది, తక్కువ స్థాయి జ్వరం, గందరగోళం లేదా అసాధారణమైన నిద్రమత్తు వంటి అనారోగ్య సంకేతాలను అందిస్తుంది. 

యువకులతో పోలిస్తే, వృద్ధుల్లో ఎల్లప్పుడూ వ్యాధికి సంబంధించిన సాధారణ, స్పష్టమైన లక్షణాలను చూపించకపోవచ్చని అందువల్లే దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తించడం కష్టమవుతుందని చెబుతున్నారు వైద్యులు. సాధారణంగా అయితే ఆకలి తగ్గడం, నీరసం లేదా ఆకస్మిక అలసట వంటివి కొన్నిసార్లు వ్యాధికి సంబంధించిన తొలి హెచ్చరిక సంకేతాలుగా (red flags) ఉంటాయని వైద్యులు నొక్కి చెబుతున్నారు. అయితే చాలా సందర్భాల్లో, కుటుంబ సభ్యులు ఈ మార్పులను వృద్ధాప్య సహజ లక్షణాలుగా పొరబడి, వైద్య సహాయం తీసుకోవడంలో జాప్యం చేస్తుంటారని అన్నారు.

నివారణ..
ఫ్లూ, న్యుమోనియా టీకాలు వేయించుకోవడం, తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం, సరైన సమయంలో చికిత్స పొందడం ద్వారా అనారోగ్య ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని చెబతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాక శ్వాసకోశ సంబంధిత లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేయకూడదనే విషయాన్ని ఆశా భోంస్లే గారి ఉదంతం స్పష్టంగా తెలియజేస్తోంది. 

ముఖ్యంగా వృద్ధాప్యం కారణంగా శరీరం ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తిని కోల్పోతున్నప్పుడు ఈ జాగ్రత్త మరింత అవసరం అని అంటున్నారు. అలాగే అరుదుగా మాత్రమే ఈ ఛాతీ ఇన్ఫెక్షన్లు తీవ్రరూపం దాల్చుతాయని, పైగా తేలికపాటి లక్షణాలతో కొట్టిపారేసే విధంగా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

(చదవండి: రెండేళ్లుగా వ్యాన్‌లోనే బందీ..! పాపం చివరికి..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement