పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు(2026) దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇటు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), అటు బలమైన ప్రతిపక్షంగా ఎదిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య పోరు అత్యంత రసవత్తరంగా మారింది. గెలుపే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలు దాదాపు ఒకే వర్గం ఓటర్లను టార్గెట్ చేశాయి. అవే మహిళలు, యువత, సంక్షేమ పథకాల లబ్ధిదారులు. అయితే ఈ ఓట్లను రాబట్టేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పాత ఫార్ములాను నమ్ముకోగా, ఆమె కోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ సరికొత్త వాగ్దానాలతో రంగంలోకి దిగింది.
ప్రభుత్వ వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు..
2011 నుండి బెంగాల్‌లో టీఎంసీకి తిరుగులేని విజయాలు అందిస్తున్న మహిళలు, మైనారిటీలు, ఎస్సీ-ఎస్టీ సామాజిక వర్గాల కూటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదని మమతా బెనర్జీ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగానే అత్యంత ఆదరణ పొందిన ‘లక్ష్మీర్ భండార్’ పథకం కింద జనరల్ కేటగిరీ మహిళలకు నెలవారీ ఆర్థిక సాయాన్ని రూ.1,500కి, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.1,700కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేకతను పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ, పార్టీని ఆదుకుంటున్న మహిళా ఓటర్లను కట్టిపడేసేందుకే టీఎంసీ ఈ ఎత్తుగడ వేసింది. రాష్ట్రంలో 30 శాతంగా ఉంటూ, సుమారు 110 సీట్లలో ప్రభావం చూపే ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు వక్ఫ్ ఆస్తుల రక్షణ, అలియా యూనివర్సిటీ అభివృద్ధి వంటి హామీలను టీఎంసీ ఇచ్చింది. ‘మతం పేరిట రాష్ట్రాన్ని విభజించాలనుకునే వారికి ఒక్కటే చెబుతున్నాం. ఈ రాష్ట్రం ఇక్కడి తల్లులు, కుమార్తెలు, మైనారిటీలు, పేదల పక్షాన నిలబడుతుంది’ అని టీఎంసీ నేత జయప్రకాశ్ మజుందార్ స్పష్టం చేశారు.
మహిళల ఆగ్రహానికి అడ్డుకట్ట వేసేందుకు..
ఇదే సమయంలో టీఎంసీకి అత్యంత బలంగా ఉన్న మహిళా ఓటు బ్యాంకుకే గండికొట్టాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి సంచలన హామీలు గుప్పించారు. ప్రతి మహిళకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం, ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, మహిళా పోలీస్ స్టేషన్లు, ప్రత్యేకంగా ‘దుర్గా సురక్షా స్క్వాడ్’ల ఏర్పాటు వంటివి బీజేపీ సంకల్ప్ పత్రలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటన, సందేశ్‌ఖాలీ ఉదంతాలతో మహిళల్లో రగులుతున్న ఆగ్రహాన్ని ఓట్లుగా మలుచుకునేందుకు, వారికి భద్రతపై భరోసా కల్పించేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
‘చేపలు, గుడ్లు తినకుండా ఎవరూ ఆపలేరు’
మహిళా సాధికారతతో పాటు, హిందుత్వ అజెండాను కూడా బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) అమలు చేస్తామని, చొరబాటుదారులను ఏరివేస్తామని, ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’లకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు తెస్తామని హామీ ఇచ్చింది. ‘ఈ ఎన్నికలు బుజ్జగింపులకు-న్యాయానికి, చొరబాట్లకు-భద్రతకు, అవినీతికి-అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటం’ అని బీజేపీ నేత దేబ్‌జిత్ సర్కార్ అభివర్ణించారు. 2021లో బీజేపీ అత్యధికంగా లాభపడిన ఎస్సీ-ఎస్టీ బెల్టుల్లో టీఎంసీ ఈసారి స్కాలర్‌షిప్‌లు, హాస్టళ్ల ఏర్పాటుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి దీటుగా బీజేపీ.. రాజ్‌బన్షీ, కుర్మి భాషలకు గుర్తింపుతో పాటు, ఉత్తర బెంగాల్‌కు ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎం వంటి భారీ ప్యాకేజీని ప్రకటించింది. మరోవైపు తమపై ఉన్న ‘ఉత్తరాది పార్టీ’ అనే ముద్రను చెరిపేసుకునేందుకు బీజేపీ ఈసారి ‘బెంగాలీ హిందుత్వ’ నినాదాన్ని ఎత్తుకుంది. వందేమాతరం మ్యూజియం, ఠాగూర్ కల్చరల్ సెంటర్లు, చైతన్య మహాప్రభు సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని చెబుతూనే.. చేపలు, గుడ్లు తినకుండా బెంగాలీలను ఎవరూ ఆపలేరని భరోసా ఇవ్వడం గమనార్హం.
ఉనికిని కాపాడుకునేందుకు వామపక్షాలు, కాంగ్రెస్..
ఇక ఈ ద్విముఖ పోరులో ఉనికి కాపాడుకునేందుకు పోరాడుతున్న వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు గుర్తింపు రాజకీయాలను పక్కనబెట్టి ఉపాధి చుట్టూ తమ ప్రచారాన్ని అల్లుకున్నాయి. ప్రతి కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని లెఫ్ట్ ఫ్రంట్ హామీ ఇస్తే, అవినీతి లేని సంక్షేమ పాలన అందిస్తామని, ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు విశ్వనాథ్ చక్రవర్తి మాటల్లో.. ‘టీఎంసీ తన పాత ఓటు బ్యాంకును కాపాడుకోవాలని చూస్తుంటే, బీజేపీ దానిని బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. తాము ఇంకా రేసులో ఉన్నామని గుర్తుచేయడానికే లెఫ్ట్, కాంగ్రెస్ పోరాడుతున్నాయి’. కాగా పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు వేస్తున్న ప్రతి ఎత్తుగడ, ఇస్తున్న ప్రతి హామీ బెంగాల్ ఓటర్లను ఆలోచనలో పడేస్తోంది. ఏ మేనిఫెస్టో ఎవరి ఓటు బ్యాంకును కొల్లగొడుతుందో ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే!
ఇది కూడా చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం


