కూరగాయాలు.. | Farmers have lost interest in vegetables | Sakshi
Sakshi News home page

కూరగాయాలు..

Apr 13 2026 6:11 AM | Updated on Apr 13 2026 6:13 AM

Farmers have lost interest in vegetables

పెట్టుబడి ఖర్చులు పైపైకి.. ధరలు మాత్రం పాతాళానికి... ∙ఏ పంట ధరలు చూసిన నేలచూపులే

ఆదుకోకుండా పట్టనట్లుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

కొనేవారు లేక ఉల్లి, టమోటా రైతుకు కన్నీరే 

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో కూరగాయ రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఆరుగాలం శ్రమించి అప్పులతో సాగుచేసి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే కన్నీళ్లే మిగులుతున్నాయి. మార్కెట్లో ఏ కూరగాయ ధర చూసినా కిలో రూ.40 తక్కువ లేదు. కానీ, అందులో పదో వంతు కూడా రైతుకు దక్కడంలేదు. ఎంతో కష్టపడి సాగుచేసిన పంటలు చేతికొచ్చే సమయానికి వాటి ధరలు తగ్గిపోవడం, రెక్కలు ముక్కలు చేసుకుని చేసిన కష్టం దళారీల పాలవుతుండడంతో చివరకు పెట్టుబడి కూడా చేతికి అందక రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

రైతు కష్టం దళారీల పాలు.. 
రాష్ట్రంలో ప్రధానంగా కృష్ణా, గోదావరి లంక గ్రామాలతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బోర్ల కింద అధిక సంఖ్యలో రైతులు కూరగాయ పంటలను సాగుచేస్తున్నారు. రాయలసీమ (కర్నూలు, నంద్యాల, అనంతపురం) ఉల్లి సాగుకు పెట్టింది పేరు. కర్నూలు జిల్లా అయితే ఇక్కడ నిల్వ సౌకర్యాలు  లేకపోవడంతో పంట కోసిన వెంటనే అయిన కాడికి తెగనమ్ముకోవాల్సిన దుస్థితి. ఇక చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో టమాటా రైతులు పండించిన పంటను రోడ్లపై పారబోస్తున్నారు. కోస్తాంధ్ర (ప్రకాశం, పల్నాడు, గుంటూరు)లో దోస, వంకాయ, బెండ సాగుతో రైతులు కుదేలవుతున్నారు. ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడిని తట్టుకుని, ట్యాంకర్లతో నీరుపోసి పండించిన దోసకాయను కిలో రూపాయికి కూడా కొనేవారు కనిపించడంలేదు. కోస్తా – ఉత్తరాంధ్రలో కాకర, బీర వంటి తీగజాతి పంటలకు పందిరి పెట్టుబడి ఖర్చు తడిసి మోపెడవుతోంది. 

ఉల్లి, టమాటా రైతుల పరిస్థితి దారుణం.. 
ముఖ్యంగా.. ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున పంట మార్కెట్లోకి రావడంతో ఎగుమతుల్లేక ఉల్లి పంటను కొనేవారు కరువయ్యారు. నాణ్యమైన ఉల్లికి సైతం క్వింటా రూ.300–రూ.400కు మించి ధర దక్కడంలేదు. కూరగాయల రైతుల పరిస్థితి కూడా ఇంతే. రెండునెలల కిందట కిలో టమాట రూ.50 వరకు పలకగా.. నేడు రూ.3–4 కు దిగజారింది. వాటిని కోయడానికి కూలీ ఖర్చులు కూడా రాకపోవడంతో వందలాది మంది రైతులు టమాటా పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు ఏటా 30 శాతం చొప్పున పెరుగుతున్నా, ప్రభుత్వం మాత్రం సబ్సిడీలు ఏమా­త్రం పెంచలేదు. పైగా.. రెండేళ్లుగా రైతులకు సబ్సిడీ వి­డు­దల చేస్తున్న దాఖలాల్లేవు. మరోవైపు కూలీల రేట్లు (మగ కూలీ రూ.600, ఆడ కూలీ రూ.400), డీ­జి­ల్‌ ధరలు, విత్తన ధరలు తడిసిమోపడవుతున్నాయి. 

ఏ కూరగాయ ధర చూసినా గుండె గుబులే.. 
ఏ కూరగాయ ధర చూసినా రైతు గుండెలు బాదుకుంటున్నాడు. దోసకాయల బస్తా ధర మూడు నెలల కిందట రూ.రెండున్నర వేలు ఉండగా, ప్రస్తుతం రూ.రెండు వందలకు కూడా కొనేవారు లేరు. క్యాబేజీ నెల క్రితం కిలో రూ.40లకు పైగా ఉండగా నేడు కిలో రూ.4–6కు పడిపోయింది. బెండ, వంకాయలు కిలో రూ.8–10.. కాకర, పెద్ద చిక్కుళ్లు కిలో రూ.15–20లు మాత్రమే పలుకుతున్నాయి. తక్కువ వ్యవధిలో పంట చేతికొస్తోందని, సాగుకు నీరులేకపోయినా రూ.లక్షలు వెచి్చంచి బోర్లు వేసి కూరగాయల పంటలు సాగుచేస్తే చివరికి పెట్టుబడి కూడా రాక నష్టాలపాలై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని రైతులు ఆవేదన 
చెందుతున్నారు. 

పత్తా లేని ప్రభుత్వం.. 
ఇక ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ‘ధర స్థిరీకరణ నిధి’ ఎక్కడా అమలుకాకపోవడంతో దళారుల చేతిలో రైతులు నిలువు దోపిడీకి గురవు తున్నారు. ధరలు పతనమైనప్పుడు ప్రభుత్వం మార్కెట్లోకి వచ్చి కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. టమాటా, ఉల్లి వంటి పంటలను కొనేవారులేక చేలల్లో, రోడ్లపక్క పంటను పారబోస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. దళారీలు, వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతును దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఉల్లి, టమాటా వంటి పంటలకు గిట్టుబాటు ధర కలి్పంచకపోతే, వచ్చే ఏడాది సాగుచేసే వారు కరువయ్యే ప్రమాదం ఉంది.

కూరగాయల సాగుతో తీవ్ర నష్టాలు 
మూడెకరాల్లో టమోటా సాగుచేశా. ధర లేకపోవడంతో తీసేశా. ప్రస్తుతం నాలుగెకరాల్లో ఉల్లి పంట, ఎకరాలో వంకాయ, రెండెకరాల్లో బెండ సాగుచేశా. ఉల్లి కొనేవారు లేరు. కూరగాయలకు మార్కెట్లో కనీస ధరలేక ఆర్థికంగా నష్టపోతున్నా. టమోటా ఎకరాకు రూ.60 వేల చొప్పున రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయా. ఎకరాకు రూ.లక్ష చొప్పున నాలుగెకరాల్లో ఉల్లి పెట్టుబడి నష్టపోయా. బెండ ఎకరాలో రూ.40వేలు.. వంకాయ ఎకరాకు రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టా. కానీ, ఏ ఒక్క పంటకూ పెట్టుబడి దక్కలేదు.   – ఆంజనేయులు, ప్యాలకుర్తి గ్రామం, కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement