న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు చైనా కల్పిత పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా చర్యను దురుద్దేశపూరితమంటూ మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో విడదీయలేని అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కల్పిత పేర్లు పెట్టడం ద్వారా వాస్తవాలను మార్చలేరని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
ఇదే సమయంలో ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బ తీసే చర్యలకు దూరంగా ఉండాలని హితవు పలికింది. ‘‘తప్పుడు వాదనలు, నిరాధార కథనాల సృష్టిని చైనా మానుకోవాలి. అరుణాచల్ సహా ఈ ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లో భాగంగానే ఉంటాయి. చైనా చర్యలు ఈ వాస్తవాన్ని ఎప్పటికీ, ఏమాత్రమూ మార్చలేవు’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.


