పాక్‌ నేతలపై ట్రంప్‌ ప్రశంసలు.. భారత్‌పై మళ్లీ అదే మాట.. | Donald Trump Praises Pak Shehbaz Sharif And Asim Munir | Sakshi
Sakshi News home page

పాక్‌ నేతలపై ట్రంప్‌ ప్రశంసలు.. భారత్‌పై మళ్లీ అదే మాట..

Apr 13 2026 8:36 AM | Updated on Apr 13 2026 8:54 AM

Donald Trump Praises Pak Shehbaz Sharif And Asim Munir

వాషింగ్టన్‌: ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తతలు, చర్చల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో చర్చల వ్యవహారంలో పాకిస్తాన్‌ను ప్రశంసిస్తూ.. మధ్యలోకి భారత్‌ ప్రస్తావనను తీసుకువచ్చారు. ఆపరేషన్‌ సిందూర్‌ నాటి పరిస్థితులను మళ్లీ ప్రస్తావించి వార్తల్లో నిలిచారు.

కాగా, ఇరాన్‌, అమెరికా మధ్య పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగా చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ చర్చలు విఫలమయ్యాయి. అనంతరం, చర్చలపై ట్రంప్‌ స్పందించారు. ఈ సందర్భంగా పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలను ప్రస్తావించి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు.

ట్రంప్‌ సోషల్‌ మీడియా ట్రుత్‌ వేదికగా.. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లు అత్యంత సమర్థులు, అసాధారణ వ్యక్తులు అని అన్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన ఒక భయంకరమైన యుద్ధాన్ని తాను ఆపడం ద్వారా దాదాపు 3 నుంచి 5 కోట్ల మంది ప్రాణాలను కాపాడానని ట్రంప్ పునరుద్ఘాటించారు. నేను చేసిన సహాయానికి వారు (పాక్ నేతలు) నాకు నిరంతరం కృతజ్ఞతలు తెలుపుతూనే ఉన్నారు. వారి మాటలు నాకు ఎంతో ఆనందం కలిగిస్తాయి.. అంటూ మరోసారి ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రస్తావించారు. దీంతో, ట్రంప్‌ వ్యాఖ్యలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.

అయితే, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడానికి అమెరికా మధ్యవర్తిత్వం కారణం కాదని భారత్‌ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. అది కేవలం రెండు దేశాల సైన్యాల మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమేనని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా గతంలోనే స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్‌ తర్వాత పాక్ సైన్యమే చర్చలకు చొరవ చూపిందని భారత ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ ట్రంప్‌ పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement