'ఆశా తాయ్' మహారాష్ట్ర ఫ్యాషన్‌ ఐకాన్‌..! | Asha Bhosle: The legendary singer and ultimate icon of Maharashtrian grace | Sakshi
Sakshi News home page

Asha Bhosle: 'ఆశా తాయ్' మహారాష్ట్ర ఫ్యాషన్‌ ఐకాన్‌..!

Apr 12 2026 6:00 PM | Updated on Apr 12 2026 6:20 PM

Asha Bhosle: The legendary singer and ultimate icon of Maharashtrian grace

92 ఏళ్ల వయసులో ఆశా భోంస్లే కన్నుమూశారు. ఆమె మరణంతో, ప్రపంచం వేలాది పాటలు పాడిన ఒక గాత్రాన్ని మాత్రమే కోల్పోలేదు, హుందాతనానికి, ఫ్యాషన్‌ శైలికి కంచుకోట అయినా ఓ మహోన్నత వ్యక్తిని కోల్పోయాం అంటున్నారు ఫ్యాషన్‌ నిపుణుల. 'పియా తు అబ్ తో ఆజా', 'దిల్ చీజ్ క్యా హై', 'దమ్ మరో దమ్' వంటి అనేక హిట్ పాటలతో ప్రసిద్ధి చెందిన ఆమె ఆహార్యం పరంగా నిరంతరం కొత్తదనాన్ని కోరుకునేవారని చెబుతున్నారు. మరి ఆశా ఫ్యాషన్‌ పరంగా ఎలాంటివి ఇష్టపడేవారు, చీరల సెలక్షన్‌ తదితర విశేషాల గురించి తెలుసుకుందామా..!.

రూపం పరంగా రాజీపడని విధంగా రెడీ అయ్యేవారట. వాటిలో అత్యంత హైలెట్‌ అయ్యేవి ఆమె చీరలు. ఆమె వార్డ్‌రోబ్ మొత్తం మహారాష్ట్ర సౌందర్యానికి కేరాఫ్‌ అడ్రస్‌ అని చెప్పొచ్చు. ఆమె తరుచుగా మందపాటి బంగారు జరీ అంచులతో కూడిన ఐవరీ క్రీమ్‌ లేదా పాస్టల్‌ రంగులో ఉండే బరువైన పట్టు లేదా కాటన్‌ సిల్క్‌ చీరలనే ఇష్టపడేవారట. 

ముక్కుపుడక..
ఇక ఆశాలో మరో ప్రత్యేకత ముక్కుపుడక. ఆమె సాంప్రదాయ మహారాష్ట్ర ముక్కుపుడక లేకుండా అలంకరణ పూర్తి చేసేవారు కాదట. ఇది ఆమె మూలాల నేపథ్యాన్ని, హుందాతనానికి ప్రతీకగా నిలిచేవని చెబుతున్నారు ఫ్యాషన్‌ ప్రియులు. ఇలా ఆమె పండుగలు, పర్వదినాల్లోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై సైతం మహారాష్ట్ర శైలి ముక్కుపుడకనే ధరించేవారట. 

ముఖాన కచ్చితంగా ఎర్రటి బొట్టు గుండ్రంగా పెద్దదిగా ఉండాల్సిందేనట. ఇది ఆమె వ్యక్తిత్వానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంతేగాదు గాయని ఆశ అనేక వరుసల ముత్యాల హారాలు,  బరువైన బంగారు లేదా వజ్రాల ఆభరణాలు లేకుండా బయటకు వచ్చేవారు కాదట. సింపుల్‌గా చెప్పాలంటే సాంప్రదాయన్ని, ఆధునికతను మేళవించేలా  ఆభరణాలను ఎంచుకునేవారట. 

అంతేగాదు ఆమెను అభిమానులు ఎక్కువగా సొగసైన చీరలు, చక్కగా చుట్టిన కొప్పులోనే గుర్తించుకుంటారు. చెప్పాలంటే అభిమానుల హృదయంలో తన వేషధారణ నాటుకుని పోయేలా ఆహార్యాన్ని మెయింటైన్‌ చేసేవారు. పైగ మహారాష్ట్ర ప్రజలు ఆమెను ముద్దుగా 'ఆశా తాయ్‌'(తాయ్‌ అంటే మహారాష్ట్రలో అక్క అని అర్థం) అని పిలుచుకుంటుంటారు. అంతేగాదు ఆమె ప్రసిద్ధ పాప్‌ సంగీతం.. 1997లో లెస్లే లూయిస్‌తో కలిసి 'జనం సంఝా కరో' అనే విలక్షణమైన పాటను విడుదల చేసే టైంలో కూడా పాశ్చాత్య దుస్తులను ధరించడానికి ఒప్పుకోలేదు. మ్యూజిక్‌కి వేషధారణతో పనిలేదని, జనాల మనసుకు హత్తుకుందా లేదా అనేది ముఖ్యం అని అన్నారు. చివరి వరకు ఆశా తన సంగీత కచేరీలలో ఎర్రటి బొట్టు, అందమైన మహారాష్ట్ర చీరలతోనే విలక్షణంగా కనిపించారామె.

 

(చదవండి: ఆశా భోంస్లే మృతి: ఛాతీ ఇన్ఫెక్షన్లు ఎందుకంత ప్రమాదకరం..)

 

Advertisement
 
Advertisement
Advertisement