
సాక్షి,హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాకాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలుండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 13వ తేదీ నుంచి 16వరకు అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో పరిస్థితిని బట్టి విద్యా సంస్థలకు సెలవులు.. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న మూడు రోజులల్లో భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో ఇన్‌ఛార్జ్ మంత్రులకు,ఉన్నతాధికారులకు ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు.
అకస్మిక వరదలు సంభవించినపుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్స్ ఉండేలా చూసుకోవాలి.ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. విద్యుత్‌కు సంబంధించి అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా మొబైల్ ట్రాన్స్‌ఫర్స్ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
హైదరాబాద్‌లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా వ్యవహరించాలి. 24 గంటలు అందుబాటులో ఉండాలి.అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి. రాబోయే 72 గంటలు అందరూ అప్రమత్తంగా ఉండాలి.లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి.ఎక్కడ ఏం జరిగినా సమాచారం కంట్రోల్ రూంకు చేరేలా చూడాలి. ఉద్యోగులు,సిబ్బంది సెలవులు రద్దు చేసి 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్‌లో ప్రమాద స్థాయికి నీరు చేరిన చోట ప్రజలు వెళ్లకుండా పోలీసు సిబ్బంది అలెర్ట్ చేయాలి.
వర్షాల నేపథ్యంలో మూడు కమిషనరేట్‌లలో ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సహకారం తీసుకోవాలి. వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఎఫ్ఎం రేడియోలలో అలర్ట్ చేయాలి. క్లౌడ్ బరస్ట్ సమయాల్లో పరిస్థితులను ఎదుర్కొనేలా సన్నద్ధం కావాలి. పరిస్థితులను బట్టి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాలి. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసేలా చర్యలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉండేలా చూడాలి.అత్యవసర టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. మీడియా తప్పుడు వార్తలతో భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయొద్దు సమాచార శాఖ మీడియాకు సరైన సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలి. రాబోయే 72 గంటలు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలి’ అని సూచించారు.