
సాక్షి, హైదరాబాద్: దేశంలో మావోయిస్టుల లొంగుబాట్లు జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. లొంగుబాట్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ(Maoists Central Committee) తాజాగా లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో పోలీసులు ఎదుట లొంగిపోయిన వారికి ప్రజలకే బుద్ధి చెబుతున్నారని హెచ్చరించడం సంచలనంగా మారింది.
ఇటీవల మావోయిస్టుల(Maoists) కీలక నేతలు మల్లోజుల వేణుగోపాల్(Mallojula Venu gopal), ఆశన్నలు(Ashanna) పోలీసులు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. తాజాగా అభయ్ పేరుతో నాలుగు పేజీల లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. మల్లోజుల, ఆశన్నలు విప్లవ ద్రోహులుగా అభివర్ణించింది. విప్లవ ద్రోహులుగా మారి శత్రవులు ఎదుట లొంగిపోయిన ఇద్దరికి తగిన శిక్ష ప్రజలే విధిస్తారు. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
అలాగే, 2018లో ఒకసారి పార్టీ తాత్కాలిక వెనుకంజ వేసింది. అప్పటి నుంచి మల్లోజుల బలహీనతలు బయటపడ్డాయి. 2020 కేంద్ర కమిటీ సమావేశంలో మల్లోజుల తప్పుడు భావజాలాన్ని లేవనెత్తారు. ఆయుధాలను వదిలిపెట్టడంపై మల్లోజుల వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు లొంగిపోతున్న వ్యవహారం.. పార్టీకి తాత్కాలిక నష్టం మాత్రమే. ప్రాణ భీతితో ఎవరైనా లొంగిపోతే లొంగిపోవచ్చు కానీ.. పార్టీకి నష్టం కలిగితే ప్రజలే బుద్ధి చెబుతారు. కేంద్ర కమిటీతో చర్చించకుండానే మల్లోజుల లొంగిపోయాడు అని రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో లేఖ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
