
హైడ్రా అభివృద్ధి చేసిన బతుకమ్మ కుంటను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో పొన్నం, కాలేరు తదితరులు
మూసీ నదికి పునరుజ్జీవం కల్పించి తీరుతాం
ఒక్క పేద వాడిని కూడా ఇబ్బంది పడనీయం
బతుకమ్మ కుంటకు వీహెచ్ పేరు
మూసీకి అంబర్‌పేట వైపు రిటైనింగ్ వాల్ నిర్మిస్తాం
అంబర్‌పేటలో మినీ సెక్రటేరియట్ కడతాం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, నాలాలను రక్షించడంతోపాటు మూసీకి పునరుజ్జీవం కల్పించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. చెరువుల్ని చెరబడితే తాట తీస్తామని హెచ్చరించారు. హైడ్రా పునరుజ్జీవం కల్పించిన అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను ఆదివారం సీఎం ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేశారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రతిపాదన మేరకు ఈ చెరువుకు కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు పేరు పెట్టనున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
విశ్వేశ్వరయ్య ఆలోచనలతో మూసీ ప్రక్షాళన..
కోవిడ్ తర్వాత పర్యావరణ మార్పులతో దేశవ్యాప్తంగా కుంభవృష్టి కురుస్తోందని, ఒకటి రెండు గంటల్లోనే 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోందని సీఎం తెలిపారు. దీన్ని ముందే ఊహించి చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ ప్రారంభించినట్లు వెల్లడించారు. ‘నిజాం హయాంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇచి్చన ప్రణాళిక ఆధారంగానే ఇప్పు డు మూసీని అభివృద్ధి చేయనున్నాం. నగరంలోని ఎమ్మెల్యేలు వారివారి పరిధిలో మూసీతోపాటు బఫర్‌జోన్‌లో నివసిస్తున్న పేదల వివరాలు సేకరించండి. వారందరికీ ప్రభు త్వం న్యాయం చేస్తుంది.
హైడ్రా పెట్టినప్పుడు కొందరికి అర్థం కాలేదు. అర్థమైన కబ్జాకోరులు బురద చల్లాలని చూశారు. ఓర్పు, సహనం, సమయస్ఫూర్తితో ముందుకు వెళ్లాం. గుంటూరు, గుడివాడ, అమెరికాలో చదివి వచి్చన వాళ్లకు పేదరికం అంటే విహారయాత్ర లాంటిది. బెంజ్ కార్లలో తిరుగుతూ పేదల కష్టాలు చూస్తున్నం అంటారు. నేను చిన్నప్పటి నుంచి పేదల మధ్యలో, వారి కష్టాలను చూస్తూ పెరిగాను. మూసీని అభివృద్ధి చేసిన తర్వాత చుట్ట చుట్టి ఇంటికి పట్టుకుపోతానా? విదేశాలకు తరలించేస్తానా? అభివృద్ధి చేసి అనర్థాలు తగ్గించాలనే లక్ష్యంతో పని చేస్తు న్నా.
మూసీతోపాటు బఫర్‌జోన్‌లో నివసిస్తున్న వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తాం. దీనికోసం త్వరలో ప్రత్యేక సమీక్ష నిర్వహించి అధికారులను క్షేత్రస్థాయికి పంపిస్తాం. వాళ్లు ఇచ్చే నివేదిక ఆధారంగా పునరావాస చర్యలు తీసు కుంటాం. అంబర్‌పేటలో అన్ని విభాగాల కార్యాలయాలతో ఓ మినీ సెక్రటేరియట్ నిర్మి స్తాం. డిసెంబర్ 9 లోపే అనుమతులు, నిధులు మంజూరు చేస్తాం’అని ప్రకటించారు.
కబ్జా చేసిన వ్యక్తే ఆ నాయకుడికి పూలు చల్లాడు..
‘బతుకమ్మ కుంటను ఓ వ్యక్తి కబ్జా చేశాడు. అతడే ఆ నాయకుడు (ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి) వస్తే ఆకాశం నుంచి పూలు చల్లాడు. బతుకమ్మ కుంటను చెర విడిపించి కేవలం 100 రోజుల్లో అభివృద్ధి చేశాం. తమ్మిడికుంటలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ యజమాని నాగార్జున నాకు మంచి మిత్రుడు. ఖాళీ చేయమని చెప్పినా వినకపోవడంతో మా అధికారులు దానిని కూల్చేశారు. ఇప్పుడు ఆయనే ముందుకు వచ్చి రెండు ఎకరాలు అప్పగించారు. ఎవరైనా తక్కు వ రేటుకు ఇస్తున్నామని ప్రభుత్వ స్థలాలను అమ్మితే తీసుకోవద్దు. మూసీ నిర్వాసితులకు శాశ్వత ఇళ్లను నిర్మించి ఇస్తాం.
ప్రగతి భవన్‌కు జ్యోతిరావు ఫూలే పేరు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వీహెచ్ సలహాలతో చేసినవే’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు బతుకమ్మ కుంటకు పునరుజ్జీవం కల్పించడం ఆరంభం మాత్రమేనని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. చెరువు చుట్టూ ఉన్న పేదల ఇళ్లను కూల్చకుండానే చెరువును అభివృద్ధి చేశామని వివరించారు. అంబర్‌పేట నియోజకవర్గానికి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు విమర్శించారు.