వర్షాకాల సన్నద్ధతపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్
వర్షాకాల సన్నద్ధతలో సమన్వయ లోపం: అధికారులపై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
జూన్ 9న వర్షంతో ‘క్యూర్’లో రోడ్లపై భారీ వరద.. ట్రాఫిక్ జామ్
వాతావరణ శాఖ హెచ్చరించినా సిబ్బంది అప్రమత్తం కాలేదు
మున్సిపల్, పోలీసు అధికారుల మధ్య తీవ్ర సమన్వయ లోపం ఉందన్న సీఎం
బాధ్యులైన అధికారులపై చర్యలకు సీఎస్, డీజీపీకి ఆదేశం
ఇకపై వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టీకరణ
అధికారులు, పోలీసులు రోడ్లపై ఉండాల్సిందేనని, అవసరమైతే తానూ రోడ్డు మీదకి వస్తానన్న ముఖ్యమంత్రి
అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలకు హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో జూన్ 9న భారీ వర్షం కారణంగా ఏర్పడిన పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సైబరాబాద్‌తో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లను వరద ముంచెత్తి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడం, నగరవాసులు ఇబ్బందులు పడటంపై మండిపడ్డారు. వర్షంతో పలుచోట్ల చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మున్సిపల్, పోలీసు, ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తం కాలేదన్నారు. వర్షాకాల సన్నద్ధతపై జూన్ 1న సమీక్ష సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో పాటు తాను అనేక సూచనలు చేశానని..అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 9వ తేదీన వర్షం సమయంలో, ఆ తర్వాత మున్సిపల్, పోలీసు అధికారుల మధ్య సమన్వయం లోపించిందన్నారు. ఈ పరిస్థితికి గల కారణాలను విశ్లేషించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్‌లను ఆదేశించారు. మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తితే కఠిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి ఆదివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
పోలీస్ కమిషనర్, అవసరమైతే నేనూ..
‘అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇకపై వర్షాల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవు. వాతావరణ శాఖ సూచనల మేరకు వర్షాలపై ముందస్తు చర్యలు తీసుకోవాలి. వర్షం సమయంలో పురపాలక, హైడ్రా, ట్రాఫిక్, జలమండలి సిబ్బందితో పాటు పోలీసులూ క్షేత్రస్థాయిలో ఉండాల్సిందే. పోలీసు కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రోడ్లపైకి రావాల్సిందే. అవసరమైతే నేను కూడా రోడ్డుపైకి వస్తా.
ట్రాఫిక్ జామ్ అయితే కఠిన చర్యలు
వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయితే ఇకపై కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ విభాగంలోని ఖాళీలను డీజీపీ తక్షణమే భర్తీ చేయాలి. మానవ తప్పిదాల వల్ల సమస్యలు తలెత్తితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించను. వర్షాల సమయంలో ఏర్పడే వాటర్ లాగింగ్ పాయింట్లు, బ్లాక్ స్పాట్లు, ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాల డేటా ఆధారంగా అధికారులు సన్నద్ధం కావాలి. విద్యుత్ పునరుద్ధరణ వెంటనే జరగాలి. అవసరమైన చోట్ల మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలి. వర్షం సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో పనిచేసేలా చూడాలి.
ఇంజనీర్లు ప్రాజెక్టుల వద్దే ఉండాలి
వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల వద్ద పటిష్ట చర్యలు తీసుకోవాలి. మాన్యువల్ ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణ ఉండాలి. వర్షాకాలంలో ప్రాజెక్టుల వద్ద సంబంధిత ఇంజినీర్లు తప్పనిసరిగా స్థానికంగా ఉండాలి. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రాజెక్టులను వదిలి వెళ్లే ఇంజినీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు, నిర్వహణకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వెంటనే మంజూరు చేయాలి..’ అని సీఎం ఆదేశించారు.
విత్తనాలు, యూరియాపై దృష్టి పెట్టండి
‘వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలలి. ముఖ్యంగా విత్తనాలు, యూరియా పంపిణీపై దృష్టి సారించాలి. రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయాలి. యూరియా నిల్వ, పంపణి కోసం స్థానిక వ్యవసాయ అధికారిని బాధ్యుడిగా నియమించడంతో పాటు రెవెన్యూ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేయాలి. సన్న వడ్ల కోసం వ్యవసాయ శాఖ ప్రకటించిన 8 రకాల విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి.
తాగునీరు కలుషితం కావొద్దు..
వర్షాల కారణంగా తాగునీరు కలుషితం కాకుండా చూడాలి. గతంలో తాగునీటి కాలుష్యంతో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు నిర్వహించాలి. నీటి కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలి. వర్షాలతో నీటి నిల్వలు ఏర్పడి అపరిశుభ్ర వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నందున పారిశుధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
పురపాలక, జలమండలి, వైద్య ఆరోగ్య శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌ను ఆదేశించారు. పోలీసు, ట్రాఫిక్, ఫైర్, హైడ్రా, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. సమీక్షలో డీజీపీ, సీఎస్‌లతో పాటు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు


