‘సింగరేణి జాగృతి’ | BRS MLC Kavitha Forms Singareni Jagruthi To Mobilise Youth, More Details Inside | Sakshi
Sakshi News home page

‘సింగరేణి జాగృతి’

May 28 2025 5:33 AM | Updated on May 28 2025 8:51 AM

BRS MLC Kavitha forms Singareni Jagruthi to mobilise youth

జాగృతి సైన్యంతో కల్వకుంట్ల కవిత

కొత్త సంస్థను ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత

కార్మీకుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని ప్రకటన 

కవిత నివాసంలో భేటీ, నూతన కమిటీ ఏర్పాటు 

సింగరేణిలో 11 ఏరియాలకు సమన్వయకర్తల నియామకం

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కార్మికుల సంక్షేమంతోపాటు సంస్థను కాపాడటమే ధ్యేయంగా ‘సింగరేణి జాగృతి’సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మంగళవారం తన నివాసంలో ‘సింగరేణి జాగృతి’ఆవిర్భావ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సింగరేణి సంస్థ పరిధిలోని 11 ఏరియాల కార్మీకులు పాల్గొన్నారు. సమావేశంలో కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పాటైన ‘తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం’(టీబీజీకేఎస్‌)తో సమన్వయం చేసుకుంటూ సింగరేణి జాగృతి పని చేస్తుందని తెలిపారు.

సింగరేణి కార్మీకుల విద్య, వైద్య ఇబ్బందుల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతితో సింగరేణి సంస్థనే అంతం చేసే కుట్రలు చేస్తోందని, వీటిని అడ్డుకుంటామని ప్రకటించారు. 11 ఏరియాలకు సింగరేణి జాగృతి కో ఆర్డినేటర్లను కవిత నియమించారు. సింగరేణి జాగృతికి అనుబంధంగా మహిళల విభాగం కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. కిరణ్‌ ఓరం (బెల్లంపల్లి), కుర్మ వికాస్‌ (శ్రీరాంపూర్‌), ఎస్‌.భువన్‌ (మందమర్రి), బొగ్గుల సాయికృష్ణ (రామగుండం 1), కె.రత్నాకర్‌ రెడ్డి (రామగుండం 2), దాసరి మల్లేశ్‌ (రామగుండం 3), నరేశ్‌ నేత (భూపాలపల్లి), అజ్మీరా అశోక్‌ కుమార్‌ (మణుగూరు), వన్నంరెడ్డి వీర నాగేంద్ర సాగర్‌ (కొత్తగూడెం), వసికర్ల కిరణ్‌ కుమార్‌ (కార్పొరేట్‌), కె.రామ్మోహన్‌ చారి (ఎస్టీపీపీ పవర్‌ప్లాంట్‌)లను ఏరియా కో ఆర్డినేటర్లుగా నియమించారు. 

సింగరేణి స్కూళ్లను పునరుద్ధరించాలి: సింగరేణి స్కూళ్లను పునరుద్ధరించి సీబీఎస్‌ఈ సిలబస్‌లో విద్యాబోధన చేయాలని కవిత డిమాండ్‌ చేశారు. కార్మీకులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్‌ హాస్పిటళ్లలో ఉచిత వైద్యం అందించాలని కోరారు. అన్ని రీజియన్లలో కార్మీకుల కోసం కొత్త క్వార్టర్స్‌ నిర్మించాలని కోరారు. జైపూర్‌ పవర్‌ ప్లాంట్‌ రెండో దశ పనుల అంచనా పెంపులో భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement