సాక్షి, సిద్దిపేట: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి జలాల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులు, నీటి హక్కులపై శ్రద్ధ లేకుండా పోయిందని మండిపడ్డారు. గోదావరి జలాల విషయంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణకు న్యాయమైన వాటాను సాధించామని ఆయన చెప్పుకొచ్చారు.
ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య జయశంకర్ పాత్ర చిరస్మరణీయమని హరీశ్ రావు అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ప్రభుత్వం, గోదావరి జలాల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రావడానికి కేసీఆర్ పోరాటం, జయశంకర్ సార్ ఆరాటమే కారణ అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ విమర్శించారు.
గోదావరి జలాల విషయంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణకు న్యాయమైన వాటాను సాధించామని అన్నారు. గోదావరి నదీ జలాల్లో రాష్ట్ర హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేసిందని, మిగిలిన నీటి వాటా కోసం అవసరమైన డీపీఆర్‌లను కూడా కేంద్రానికి సమర్పించిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్నా కొత్తగా ఒక్క అనుమతిని కూడా సాధించలేదని ఆరోపించారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) చరిత్రలో తొలిసారిగా తెలంగాణ ప్రాజెక్టులను సమీక్షించి, అనుమతులను రద్దు చేయాలనే అంశం ఎజెండాలోకి రావడం ఆందోళనకరమని అన్నారు.
గతంలో జరిగిన GRMB సమావేశాల్లో తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయాలనే ప్రతిపాదన ఎప్పుడూ రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులు, నీటి హక్కులపై శ్రద్ధ లేకుండా పోయిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి GRMB ఎజెండాను మార్చించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే GRMB సమావేశాన్ని బహిష్కరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోతోందని ప్రశ్నించిన ఆయన, సమ్మక్క–సారక్క ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చినప్పటికీ దానిని ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదని నిలదీశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ స్టేజ్-2తో పాటు వరంగల్, నల్గొండ ప్రాంతాలకు నీరు అందే అవకాశం ఉందని పేర్కొన్నారు. గోదావరి, బనకచర్ల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో లోపాయికారీ ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


