సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లాలో దాదాపు పది లక్షల మంది ఓటర్లు గల్లంతయ్యారు. జిల్లాలోని మొత్తం ఓటర్లు 47,36,669 మందిలో 9,95,315 మంది ఓటర్లు ఏమైపోయారో అధికారులకు అంతు చిక్కలేదు. మొత్తం ఓటర్లలో ఇది 21 శాతం. వీరిలో కొందరు మరణించిన వారున్నప్పటికీ మిగతా వారు ఎక్కడ ఉన్నారో, ఏమయ్యారో వివరాలు లభించలేదు. వీరు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉండవచ్చునని, లేదా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన ..ప్రస్తుతం వెళ్లిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఈ నెల పదో తేదీ వరకు గడువుండటంతో ఇందులో స్వల్ప మార్పులకు అవకాశం ఉంది. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. వీరిలో మృతులు పోను మిగతావారిని అధికారులు ఆచూకీ తెలియని జాబితాలో చేర్చారు. వీరిలో అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 88,933 మంది ఉండగా, అత్యల్పంగా అంబర్‌పేట నియోజకవర్గంలో 38,208 మంది ఉన్నారు.
డిజిటలైజేషన్ అంతంతే..
అధికారులు ఎంతగా ప్రయత్నిస్తున్నా, ఇళ్లన్నీ తిరుగుతున్నా, రాజకీయ పార్టీలను అభ్యర్థిస్తున్నా, పార్టీల ఏజెంట్లను కోరుతున్నా ఎన్యూమరేషన్ ఫారాలు భర్తీ చేసి తిరిగి ఇచ్చిన వారు 27,26,655 మంది మాత్రమే. వీరి వివరాలు డిజిటలైజ్ చేశారు. ఇది 57.56 శాతం. మిగిలిన కొద్ది రోజుల్లో ఇంకెంతమంది ఫారాలు తిరిగి ఇస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఫారాల సమర్పణ గడువును ఇప్పటికే రెండు పర్యాయాలు పొడిగించడం తెలిసిందే. దీంతో, ఇవ్వాల్సిన వారి సంఖ్య స్వల్పంగా మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఇక జిల్లాలోని ఓటర్లలో 4,91,236 మంది ఆన్‌లైన్ ద్వారా తమ ఎన్యూమరేషన్ ఫారా లు భర్తీచేశారు. వీరు 10.37 శాతంగా ఉన్నారు.
94 భవనాల నుంచి పోలింగ్ కేంద్రాల మార్పు
రాజకీయనేతల ఇళ్లు, మతపరమైన ప్రదేశాలు, ఇతరత్రా సున్నిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఉండరాదన్న ఈసీఐ సెక్రటరీ ఆదేశాల నేపథ్యంలో 94 భవనాల్లోని పోలింగ్ కేంద్రాలను మార్చేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ మేరకు వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో వివరించారు. ‘నామెన్‌క్లేచర్’లు మార్చాల్సిన పోలింగ్ కేంద్రాలు 39 ఉన్నట్లు గుర్తించారు. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణలో భాగంగా ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్న 71 పోలింగ్ కేంద్రాలను ఇతర కేంద్రాల్లో విలీనం లేదా రద్దు చేసేందుకు ప్రతిపాదించారు. ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమబదీ్ధకరణతో జిల్లాలో ప్రస్తుతం ఉన్న 4062 పోలింగ్ కేంద్రాల్లో 67 తగ్గి, 3995 పోలింగ్ కేంద్రాలు మిగలనున్నాయి.


