ఎన్నిక ఏకగ్రీవమే! | BJP Telangana President will be One of Etala Rajender Or Ramchander Rao | Sakshi
Sakshi News home page

ఎన్నిక ఏకగ్రీవమే!

Jun 30 2025 1:34 AM | Updated on Jun 30 2025 5:54 AM

BJP Telangana President will be One of Etala Rajender Or Ramchander Rao

కమల దళపతిగా ఈటల, రాంచందర్‌రావులలో ఒకరికి అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్‌ యెండల లక్ష్మీనారాయణ ఎన్నిక ప్రకటన విడుదల చేశారు. అధ్యక్ష స్థానానికి పోటీ చేయాలనుకునేవారు సోమవారం నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. ఈ మేరకు పార్టీ పెద్దలు ఎన్నిక ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. 

అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో 119 మంది రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు, 38 జిల్లా శాఖల అధ్యక్షులు, 17 మంది జాతీయ కౌన్సిల్‌ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన అంశంపై పార్టీ నాయకత్వం ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా మన్నెగూడ సమీపంలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ అభయ్‌పాటిల్, సంస్థాగత ఇన్‌చార్జ్‌ చంద్రశేఖర్‌ తివారి తదితరులు పార్టీ రాష్ట్ర నాయ కత్వానికి దిశానిర్దేశం చేశారు. 

అధ్యక్ష ఎన్నికకు పెద్దగా పోటీ లేకుండానే..అందరి సమ్మతితో ఎన్నిక జరిపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం నాటి నామినేషన్ల ప్రక్రియలో అందరి సమ్మతితో ఒక అభ్యర్థి మాత్రమే నామినేషన్‌ దాఖలు చేసేలా క్షేత్రస్థాయి నాయకత్వంతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. నామినేషన్‌ వేసిన కొన్ని గంటల వ్యవధిలోనే నామినేషన్‌ పరిశీలన నిర్వహిస్తారు. ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్‌ వేస్తే... విత్‌డ్రాకు కూడా అవకాశం ఉంటుంది. 

ఈ ప్రక్రియంతా నామమాత్రమేనని పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే పలువురు ఢిల్లీ పెద్దలను కలిసి అవకాశం కల్పించాలంటూ ఎవరికి వారు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం క్షేత్రస్థాయి నాయకత్వంతో సమాలోచనలు చేసి అభిప్రాయాలను సైతం స్వీకరించినట్టు తెలిసింది. అధ్యక్ష ఎన్నిక రిటర్నింగ్‌ అధికారిగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వ్యవహరిస్తారు.

నామినేషన్ల స్వీకరణ రాష్ట్ర కార్యాలయంలోనే 
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సోమవారం నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పరిశీలన, ఉపసంహరణకు అవకాశం కల్పించారు. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక, ప్రకటన ఉంటుంది. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పోటీలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేరు బలంగా వినిపిస్తున్నాయి. ఈసారి అధ్యక్ష స్థానాన్ని బీసీకే ఇస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈటల బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు అవకాశం ఎక్కువగా ఉంటుందనే ప్రచారముంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement