breaking news
Ramchander rao
-
త్వరలో రోహిత్ వేముల చట్టం
సాక్షి, న్యూఢిల్లీ: పరిశోధక విద్యార్థి రోహిత్ వేములను ఆత్మహత్యకు ప్రేరేపించిన వారికి బీజేపీ పెద్దపీట వేసి, ఉన్నత పదవులను కట్టబెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హెచ్‌సీయూ ఎదుట ఆందోళన చేశారని గుర్తు చేశారు. రాంచందర్‌రావు ఒత్తిడి కారణంగా ఆ సమయంలో అంబేడ్కర్ స్టూడెంట్ అసోసియేషన్‌లో ఉన్న విద్యార్థులపై యూనివర్సిటీ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇంతటి ఘటనకు కారకుడైన రాంచందర్‌రావుపై చర్యలు తీసుకోకుండా అధ్యక్ష పదవి ఇచ్చి న బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్‌తో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. రోహిత్ వేముల కేసును తాము పునర్విచారణ చేసేందుకు కోర్టును ఆశ్రయించినట్లు భట్టి చెప్పారు. అతని మృతికి కారకులైన వారిని వదిలేది లేదని హెచ్చరించారు. రోహిత్ ఆత్మహత్య వంటి ఘటనలు దేశంలో పునరావృతం కాకుండా ఉండేందుకు ముందుగా రాష్ట్రంలో ప్రత్యేక చట్టాన్ని తెస్తున్నట్లు చెప్పారు. పదవులు కట్టబెడతారా? ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు తీసుకునే దళిత విద్యార్థులందరికీ అడ్మిషన్‌తోపాటు ఇంత విషం, ఒక తాడును కూడా ఇస్తే ఉరి వేసుకోవడానికి పనికొస్తుందని రోహిత్ వేముల వీసీకి రాసిన సూసైడ్ నోట్లో ఉంది. అప్పట్లో ఈ సూసైడ్ నోట్ దేశ ప్రజల మనసులను కలచివేసింది. వర్సిటీలో ఆత్మగౌరవంతో బతకడానికి కావలసిన హక్కులు కల్పించండి అంటూ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ యూనివర్సిటీలో జరుగుతున్న ఘటనలపై వీసీకి వినతి పత్రం ఇచ్చి ంది. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని వర్సిటీ ఏబీవీపీ యూనిట్ అధ్యక్షుడు సుశీల్ కుమార్.. రోహిత్‌తోపాటు మరో నలుగురు అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ వీసీకి ఫిర్యాదు చేశారు.ఆ నలుగురిపై పోలీసు కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని వీసీపై ఒత్తిడి తీసుకురావడమే కాకుండా, కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి నుంచి వీసీపై ఒత్తిడి తెచ్చారు. అదే సమయంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఒత్తిడి తేవడంతో పోలీసులు యూనియన్ సభ్యులపై కేసులు నమోదు చేశారు. నలుమూలల నుంచి వచ్చి న ఒత్తిడిని తట్టుకోలేక వర్సిటీ అధికారులు రోహిత్‌తోపాటు మరో నలుగురిని సస్పెండ్ చేయడంతో గత్యంతరం లేక రోహిత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు’అని భట్టి విక్రమార్క చెప్పారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేయించిన నాటి ఎమ్మెల్సీ రాంచందర్‌రావును ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని, రోహిత్ ఆత్మహత్యకు ప్రధాన కారకుడుగా భావిస్తున్న సుశీల్ కుమార్‌ను ఢిల్లీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించారని మండిపడ్డారు. మా ప్రభుత్వంలో ఇబ్బందుల్లేవు పవర్ షేరింగ్ అనేది లేదు.. అందరం కలిసి పనిచేస్తున్నాం బీఆర్ఎస్ నేతల మాటలు మితిమీరాయి: భట్టి సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నేతలు మితిమీరి వ్యాఖ్యలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో, వారి నిర్ణయం ఏంటనేది వారికే తెలియదన్నారు. వీటిపై తాము ప్రశి్నస్తే.. మితిమీరిన మాటలు మాట్లాడుతూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో భట్టి మీడియాతో చిట్‌చాట్ చేశారు.‘మా ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. పవర్ షేరింగ్ అనేది ఏమీ లేదు. అందరం కలిసి టీం వర్క్‌గా పనిచేస్తున్నాం. మా ప్రభుత్వం బాగుంది. ఎన్నికల్లో ఇచ్చి న హామీలను ఒక్కోటి పూర్తిస్థాయిలో అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం. ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాం. మహిళలకు ఉచిత బస్సు క్లిక్ అయ్యింది.. ఎంచక్కా మహిళలంతా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం. ఫోర్త్‌సిటీ పనులు జరుగుతున్నాయి, మూసీ సుందరీకరణను కచ్చితంగా ఈ హయాంలోనే పూర్తి చేస్తాం. రీజినల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రాదు. బీజేపీ వాళ్ల మాటలు వినడం ప్రజలు ఎప్పుడో మానేశారు’అని భట్టి అన్నారు. -
ఎన్నిక ఏకగ్రీవమే!
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ యెండల లక్ష్మీనారాయణ ఎన్నిక ప్రకటన విడుదల చేశారు. అధ్యక్ష స్థానానికి పోటీ చేయాలనుకునేవారు సోమవారం నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. ఈ మేరకు పార్టీ పెద్దలు ఎన్నిక ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో 119 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, 38 జిల్లా శాఖల అధ్యక్షులు, 17 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన అంశంపై పార్టీ నాయకత్వం ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా మన్నెగూడ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ అభయ్‌పాటిల్, సంస్థాగత ఇన్చార్జ్ చంద్రశేఖర్ తివారి తదితరులు పార్టీ రాష్ట్ర నాయ కత్వానికి దిశానిర్దేశం చేశారు. అధ్యక్ష ఎన్నికకు పెద్దగా పోటీ లేకుండానే..అందరి సమ్మతితో ఎన్నిక జరిపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం నాటి నామినేషన్ల ప్రక్రియలో అందరి సమ్మతితో ఒక అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేసేలా క్షేత్రస్థాయి నాయకత్వంతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. నామినేషన్ వేసిన కొన్ని గంటల వ్యవధిలోనే నామినేషన్ పరిశీలన నిర్వహిస్తారు. ఒకరికంటే ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ వేస్తే... విత్‌డ్రాకు కూడా అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియంతా నామమాత్రమేనని పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే పలువురు ఢిల్లీ పెద్దలను కలిసి అవకాశం కల్పించాలంటూ ఎవరికి వారు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం క్షేత్రస్థాయి నాయకత్వంతో సమాలోచనలు చేసి అభిప్రాయాలను సైతం స్వీకరించినట్టు తెలిసింది. అధ్యక్ష ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే వ్యవహరిస్తారు.నామినేషన్ల స్వీకరణ రాష్ట్ర కార్యాలయంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సోమవారం నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పరిశీలన, ఉపసంహరణకు అవకాశం కల్పించారు. జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక, ప్రకటన ఉంటుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పోటీలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేరు బలంగా వినిపిస్తున్నాయి. ఈసారి అధ్యక్ష స్థానాన్ని బీసీకే ఇస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఈటల బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు అవకాశం ఎక్కువగా ఉంటుందనే ప్రచారముంది. -
మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి అస్తమయం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ మంత్రి చిల్కూరి రాంచంద్రారెడ్డి (78) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఈ నెల 18వ తేదీన హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేరారు. పరిస్థితి విషమించి గురువారం సాయంత్రం 4.30గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేసిన ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సేవలందించారు. 1990–92 మధ్య కాలంలో అప్పటి సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రి వర్గంలో రాష్ట్ర చిన్ననీటి పారుదల, మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ ఇండిపెండెంట్ మంత్రిగా పని చేశారు. రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరు పొందిన ఆయన గ్రామగ్రామాన అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే పార్టీ శ్రేణులు, కుటుంబీకులు, అభిమానులు దుఃఖసాగరంలో మునిగారు. తన జీవిత చరమాంకం వరకు కాంగ్రెస్ కోసమే పనిచేశారు. తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలో 4వ ఏప్రిల్ 1944లో జన్మించిన ఆయన ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌లో స్థిరపడ్డారు. ఆయనకు భార్య లక్ష్మీదేవి ఉన్నారు. రాజకీయాల్లో చెరగని ముద్ర పంచాయతీ సమితి అధ్యక్షుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాంచంద్రారెడ్డి జిల్లా రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. 1978లో తొలిసారి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన ఆయన అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి చిల్కూరి వామన్రెడ్డిపై విజయం సాధించి తన సత్తా చాటారు. 1983లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన స్వతంత్ర అభ్యర్థి వామన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 1985లో మరోసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి లక్ష్మణ్‌రావుపై విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆయన టీడీపీ అఽభ్యర్థి చంద్రకాంత్రెడ్డిపై గెలుపొందారు. 1994, 1999 ఎన్నికల్లో ఓటమి చవి చూసిన రాంచంద్రారెడ్డి 2004లో మరోసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి జోగు రామన్నపై విజయం సాధించారు. 2009, 2012 ఎన్నికల్లో జోగు రామన్న చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన పార్టీ పటిష్టతకు పనిచేస్తూ వచ్చారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి, నాలుగుసార్లు గెలుపొందారు. రాష్ట్ర ఇండిపెండెంట్ మంత్రిగానూ సేవలందించారు. ఇళ్ల స్థలాలిచ్చిన ఘనత ఆయనదే.. నియోజకవర్గ అభివృద్ధికి ఆహర్నిశలు శ్రమించిన రాంచంద్రారెడ్డి పేదల అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారు. పట్టణంలోని రాంనగర్, కేఆర్కే కాలనీ, చిల్కూరి లక్ష్మీనగర్, బంగారుగూడ, బట్టిసావర్గాం పరిధిలోని సర్వే నంబర్ 170లో వేలాదిమంది నిరుపేదలకు ఇంటి స్థలాలు అందించి పేదల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత ఆయనకే సొంతం. జిల్లా కేంద్రంలో రిమ్స్ వైద్యకళాశాల ఏర్పాటు, తాంసి మండలం వడ్డాడి మత్తడివాగు ప్రాజెక్ట్ నిర్మాణం కూడా ఆయన కృషి ఫలితమే. ఎమ్మెల్యేగా ప్రతి గ్రామంలోనూ నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించి పేదలకు సొంతగూడు కల్పించారు. తుదిశ్వాస వరకూ కాంగ్రెస్‌లోనే.. కాంగ్రెస్‌లో చేరిన నుంచి తుదిశ్వాస విడిచేవరకూ రాంచంద్రారెడ్డి ఇదే పార్టీలో కొనసాగారు. గత ఏప్రిల్ 26న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిర్వహించిన నిరుద్యోగ గర్జన సభలో రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు. శ్రీరామ నవమి రోజున జన్మించడంతో ఆయన పుట్టినరోజు వేడుకలను అదే పండగ రోజు నిర్వహించేవారు. తులాభారం నిర్వహించి పేదలకు అన్నదానం చేసేవారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 11గంటలకు తన స్వగ్రామమైన ఖోడద్లో నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. -
‘తెలంగాణలో మానవ హక్కులు లేవా..?’
సాక్షి, హైదరాబాద్: ఒకే స్ట్రెచర్ మీద ఇద్దరు రోగులను తీసుకెళ్లే దుస్థితి గాంధీ ఆస్పత్రిలో నెలకొందని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు మాట్లాడుతూ.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా పర్యటనతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయన్నారు. ఒక్క బీజేపీ నేతకు ఆరుగురు టీఆర్ఎస్ నేతలు సమాధానమిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా రాజకీయ విమర్శలు చేశారే తప్ప వ్యక్తిగత విమర్శలు చేయలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవినీతిపై తాము చర్చకు సిద్ధమని వ్యాఖ్యానించారు. ఆయుష్మాన్ భారత్‌ను దేశంలో అనేక రాష్ట్రాలు అమలు పరుస్తున్నాయని, దీని ద్వారా లక్షలాదిమంది లబ్ది పొందారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రతీ పథకంలో కేంద్రం వాటా ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, డాక్టర్లు, నిరుద్యోగులు ఎన్ని ధర్నాలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఇంతవరకు తెలంగాణలో మానవహక్కుల సంఘం ఏర్పాటు చేయలేదని చెప్పిన ఆయన.. ఇక్కడ మానవ హక్కులు ఉండవా అని నిలదీశారు. టీఆర్ఎస్ ఒక్కటే ఉద్యమం చేయలేదని, బీజేపీ ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. -
సైబర్ నేరగాళ్ల బారిన ఎమ్మెల్సీ
సాక్షి, హైదరాబాద్ : ఎమ్మెల్సీ రామచంద్రరావును కూడా సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 1న సైబర్ నేరగాళ్లు ఆయనకు ఫోన్ చేసి ఆర్బీఐ అధికారిని మాట్లాడుతున్నానంటూ క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చేయాలని కోరారు. దీంతో సీవీవీ, మొబైల్‌కు వచ్చిన ఓటీపీ సంఖ్యలను కూడా చెప్పేశారు. వెంటనే ఆయన కార్డునుంచి రూ.70 వేల ను ఇతర ఖాతాల్లోకి మళ్లించేశారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
‘మండలి’లో మొండిచేయి?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ కోటా సభ్యుడి ఎన్నికలో ప్రధాన పార్టీల టికెట్లు ఆశిస్తున్న పాలమూరు నేతలకు మొండిచేయి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 26వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుండగా బీజేపీ మినహా ఇతర పార్టీల అభ్యర్థులు శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ కోటా సభ్యుడి ఎన్నికలో ప్రధాన పార్టీల టికెట్లు ఆశిస్తున్న పాలమూరు నేతలకు మొండిచేయి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 26వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుండగా బీజేపీ మినహా ఇతర పార్టీల అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. ప్రముఖ న్యాయవాది రాంచందర్‌రావు పేరును బీజేపీ ఇప్పటికే ఖరారు చేసింది. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, టీపీఆర్టీయూ అధ్యక్షుడు హర్షవర్దన్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. ఈ మేరకు ఇద్దరు ఉపాధ్యాయ సంఘం నేతలు తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించాల్సిందిగా సీఎం స్థాయి లో ప్రయత్నాలు సాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు పూలరవీందర్, కాటేపల్లి జనార్దన్‌రెడ్డితో కలిసి వెంకట్‌రెడ్డి ఇటీవల సీఎంను కలిసినట్లు సమాచారం. నియోజకవర్గ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పీఆర్టీయూ బలమైన యూనియన్‌గా ఉన్నందున తమకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ పేరు దాదాపు ఖాయమైందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇద్దరు నేతల ప్రయత్నాలు ఫలిస్తాయా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. గతంలో టీడీపీనుంచి ఇదే స్థానంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన హైదరాబాద్ వాసి పీఎల్ శ్రీని వాస్ ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉండటంతో జిల్లా నేతలకు అవకాశం దక్కడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. 2007 ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి పోటీచేశారు. తదనంతర పరిణామాల్లో శ్రీనివాసరెడ్డి బీజేపీగూటికి చేరారు. 2009 ద్వైవార్షిక ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దించకుండా, సిట్టింగ్ ఎమ్మెల్సీ నాగేశ్వర్ అభ్యర్థిత్వానికి మద్దతు పలికింది. ఎమ్మెల్సీ నాగేశ్వర్ మూడో పర్యాయం పోటీ చేయడంపై స్పష్టత కొరవడింది. మరోవైపు తమను సంప్రదించకుండానే బీజేపీ అభ్యర్థిని ప్రకటించడంపై టీడీపీ శ్రేణులు తొలుత కొంత అసంతృప్తి వ్యక్తం చేశాయి. అయితే మండలి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ద్వైవార్షిక ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి టీడీపీ మద్దతు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. పోటీకి దూరంగా కాంగ్రెస్? పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు కాంగ్రెస్ మొదటి నుంచి దూరంగా ఉంటూ వస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో నిలబడే అభ్యర్థి ఎవరనే అంశంపై జిల్లా నేతల్లో స్పష్టత కొరవడింది. పార్టీలతో సంబంధం లేకుండా సొంతంగానే బరిలోకి దిగేందుకు కొందరు ఔత్సాహికులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రజా సంఘాలు, న్యాయవాదులు, విద్యార్థి సంఘాలు, రిటైర్డు ఉద్యోగులు నామినేషన్ వేసేందుకు సన్నిహితులతో సంప్రదింపులు సాగిస్తున్నారు.